Begin typing your search above and press return to search.

పెద్ది, ది ప్యారడైజ్.. ఇప్పుడు ఈ సినిమా ఏం చేస్తుందో?

కార్తీక్‌ను చాలామంది సుకుమార్ శిష్యుడిగానే చూస్తుంటారు. కానీ ఆయన సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి బయటకు వచ్చిన వ్యక్తి కాదు.

By:  M Prashanth   |   30 Sept 2026 11:30 AM IST
పెద్ది, ది ప్యారడైజ్.. ఇప్పుడు ఈ సినిమా ఏం చేస్తుందో?
X

ఒక సినిమాతో దర్శకుడిపై భారీ అంచనాలు వచ్చాక, నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో స్కేల్ పెంచడం ఇప్పుడు టాలీవుడ్‌లో కామన్ అయిపోయింది. అయితే ఈ మధ్య అలా భారీ కాన్వాస్‌లోకి వెళ్లిన కొందరు దర్శకులకు ఆడియన్స్ నుంచి ఒకే రకమైన రెస్పాన్స్ రాలేదు. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు రామ్ చరణ్‌తో ‘పెద్ది’ చేశారు. సినిమా భారీగానే వచ్చినా రైటింగ్, లెంగ్త్ విషయంలో మిక్స్‌డ్ రియాక్షన్ కనిపించింది. ‘దసరా’ తర్వాత శ్రీకాంత్ ఓదెల కూడా నానితో ‘ది ప్యారడైజ్’ కోసం చాలా పెద్ద ప్రపంచాన్నే క్రియేట్ చేశారు. ఓపెనింగ్స్ వచ్చినా సినిమా విషయంలో మాత్రం రియాక్షన్స్ షాకింగ్ అనేలా వచ్చాయి.

ఇప్పుడు ఇలాంటి మరో భారీ సినిమా కార్తీక్ దండు చేతిలో ఉంది. ‘విరూపాక్ష’తో వచ్చిన గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి అది తొలి సినిమా కాదు. అంతకుముందే ‘భం బోలేనాథ్’ చేశారు. కానీ దర్శకుడిగా కార్తీక్ పేరు ఇండస్ట్రీలో బలంగా వినిపించింది మాత్రం ‘విరూపాక్ష’ తర్వాతే. అందుకే ఇప్పుడు నాగచైతన్యతో చేస్తున్న ‘వృషకర్మ’ మీద సహజంగానే ఫోకస్ ఎక్కువగా ఉంది.

కార్తీక్‌ను చాలామంది సుకుమార్ శిష్యుడిగానే చూస్తుంటారు. కానీ ఆయన సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి బయటకు వచ్చిన వ్యక్తి కాదు. ‘విరూపాక్ష’ కథతో సుకుమార్‌ను కలిసిన తర్వాతే ఆ జర్నీ మొదలైంది. ఆ సినిమా స్క్రీన్‌ప్లేపై ఇద్దరూ కలిసి పని చేశారు. ఇప్పుడు ‘వృషకర్మ’కు కూడా సుకుమార్ రైటింగ్స్ భాగస్వామిగా ఉంది.

‘విరూపాక్ష’లో ఒక ఊరు, అందులో జరిగే మిస్టరీ చుట్టూ కథను నడిపించిన కార్తీక్.. ఈసారి పూర్తిగా వేరే ప్రపంచంలోకి వెళ్లారు. ‘వృషకర్మ’ను మైథికల్ అడ్వెంచర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో భారీ సెట్లు, యాక్షన్, ఫాంటసీ ఎలిమెంట్స్ కనిపించాయి. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ కీలక పాత్రల్లో ఉన్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, నవీన్ నూలి ఎడిటింగ్ లాంటి టెక్నికల్ టీమ్‌ను కూడా తీసుకున్నారు.

నాగచైతన్యకు కూడా ఇది రెగ్యులర్ సినిమా కాదు. ఆయన కెరీర్‌లోనే పెద్ద స్కేల్‌లో రూపొందుతున్న ప్రాజెక్టుల్లో ఇదొకటిగా మొదటి నుంచే ప్రమోట్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో భారీ సెట్లు వేసి షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ‘తండేల్’ తర్వాత చైతన్య మార్కెట్ పెరగడంతో బడ్జెట్ విషయంలో కూడా మేకర్స్ వెనక్కి తగ్గడం లేదనే టాక్స్ వచ్చాయి. దీంతో హీరోకు ఎంత ముఖ్యమైన సినిమానో, కార్తీక్ దండుకు కూడా అంతే కీలకమైన ప్రాజెక్ట్‌గా మారింది. ‘పెద్ది’, ‘ది ప్యారడైజ్’ తర్వాత భారీ స్కేల్ తో వస్తున్న సినిమా ఇది. ఇలాంటి కథలు ఎంచుకున్న యువ దర్శకుల సినిమాలపై ఆడియన్స్ మరింత జాగ్రత్తగా చూస్తున్న టైమ్‌ ఇది. ఇలాంటి టైమ్ లో ‘వృషకర్మ’ థియేటర్లలోకి రాబోతోంది. మరి కార్తీక్ ఆ అంచనాలను ఎంతవరకు అందుకుంటాడో చూడాలి.