ఎట్టకేలకు రిలీజ్ కాబోతున్న కార్తీ మూవీ
తమిళ హీరో అయినప్పటికీ కార్తీకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇంకా చెప్పాలంటే కార్తీని తమిళ హీరో అని తెలుగు ఆడియన్స్ అసలు భావించరు.
By: Sravani Lakshmi Srungarapu | 1 Sept 2025 3:41 PM ISTతమిళ హీరో అయినప్పటికీ కార్తీకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇంకా చెప్పాలంటే కార్తీని తమిళ హీరో అని తెలుగు ఆడియన్స్ అసలు భావించరు. వరుస సినిమాలతో కార్తీ కెరీర్లో ముందుకు దూసుకెళ్తూ చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కార్తీ మార్షల్, సర్దార్2 సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే కార్తీ వరుసగా సినిమాలను చేస్తున్నప్పటికీ అందులో ఓ సినిమా మాత్రం ఇబ్బందులకు గురవుతూ వస్తోంది.
కార్తీ సరసన కృతి శెట్టి
అదే వా వాతియార్. స్టూడియో గ్రీన్ బ్యానర్ లో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో కార్తీ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా సత్యరాజ్, రాజ్ కిరణ్, ఆనంద రాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్, సుందర్, రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కార్తీ కెరీర్లో 26వ సినిమాగా తెరకెక్కుతున్న వా వాతియార్ ఇప్పటికే రిలీజ్ కావాల్సింది.
కార్తీ స్పీడుకు బ్రేకులేసిన నలన్
సినిమా అనౌన్స్ చేసి రెండేళ్లవుతున్నప్పటికీ ఇంకా వా వాతియార్ రిలీజ్ కాలేదు. ఓ వైపు కార్తీ మిగిలిన సినిమాలన్నింటినీ జెట్ స్పీడులో పూర్తి చేసి రిలీజ్ చేస్తుంటే ఈ సినిమా మాత్రం వాయిదా మీద వాయిదా పడుతూ కార్తీ స్పీడుకు బ్రేకులేస్తూ వచ్చింది. ఈ సినిమా తర్వాత మొదలుపెట్టిన సత్యం సుందరం, సర్దార్ కూడా రిలీజై మంచి హిట్లుగా నిలిచాయి. దీంతో ఒకానొక టైమ్ లో వా వాతియార్ ఆగిపోయిందని కూడా వార్తలొచ్చాయి. అయితే ఎట్టకేలకు అన్నింటినీ అధిగమించి ఈ సినిమాను పూర్తి చేశారు నలన్.
పలుమార్లు వాయిదా
ముందు వా వాతియార్ ను జనవరిలో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ అప్పటికి షూటింగ్ పూర్తవలేదు. ఆ తర్వాత జూన్ లో అనుకుంటే అదీ కుదరలేదు. సెప్టెంబర్ 5కి రిలీజ్ చేద్దామంటే వీలవలేదు. దీంతో కార్తీ ఫ్యాన్స్ ఈ సినిమాపై ఆశలు వదిలేసుకున్నారు. ఇక ఇప్పట్లో ఈ సినిమా రిలీజవడం కష్టమేనని నిరాశ పడుతున్న టైమ్ లో ఈ మూవీ రిలీజ్ గురించి మేకర్స్ ఓ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.
డిసెంబర్ లో వా వాతియార్
వా వాతియార్ డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్నట్టు హింట్ ఇస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి సినిమాపై ఉన్న అంచనాలను పెంచారు. వర్షంలో తడుస్తూ కార్తీ గుర్రంపై వస్తున్నట్టు ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. అందరినీ శాసించే రాజు రాకకు రంగం సిద్ధమైందని, ఈ డిసెంబర్ లో వాతావరణం మారబోతోందనే క్యాప్షన్ ను రాసుకొచ్చారు. దీంతో వా వాతియార్ డిసెంబర్ లో రిలీజ్ ఖాయమని తెలిసి కార్తీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఇప్పుడైనా ఈ సినిమా డిసెంబర్ లో వస్తుందో లేదో చూడాలి.