Begin typing your search above and press return to search.

మెరిట్ స్టూడెంటువి సినిమాల్లోకి ఎందుకు అన్నారు!-కార్తీ

అలాగే సినిమాలు తెర‌కెక్కించ‌డానికి రూల్స్ ఏవీ ఉండ‌వ‌ని, ఎవ‌రి అభిరుచి నాలెజ్ కి త‌గ్గ‌ట్టు వారు సినిమాలు తీస్తార‌ని, అంతిమంగా అవి ప్ర‌జ‌ల‌ను మెప్పించాయా లేదా?

By:  Sivaji Kontham   |   11 Dec 2025 4:00 AM IST
మెరిట్ స్టూడెంటువి సినిమాల్లోకి ఎందుకు అన్నారు!-కార్తీ
X

``నేను సినీరంగంలోకి ప్ర‌వేశించ‌క ముందు అమెరికాలో చ‌దువుకున్నాను. అక్క‌డ పార్ట్ టైమ్ జాబ్ కూడా చేసాను. అయితే అక్క‌డ చ‌దువు పూర్త‌య్యాక సినిమాల్లోకి వెళ‌తాను అన‌గానే నా స్నేహితులంతా షాక‌య్యార``ని తెలిపారు హీరో కార్తీ. మంచి మెరిట్ స్టూడెంట్ వి.. ఆ రంగంలోకి ఎందుకు? రంగుల ప‌రిశ్ర‌మ‌కు వెళితే కెరీర్ పాడైపోతుంద‌ని హెచ్చ‌రించార‌ని చెప్పారు.

కార్తీ న‌టించిన `వా వాతియార్` ఈనెల 12న‌ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో కార్తీ ఒక పోలీసు అధికారిగా, MGR అభిమానిగా న‌టించారు. నలన్ కుమారస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో కృతి శెట్టితో పాటు బలమైన సహాయక తారాగణం కూడా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో `అన్న‌గారు వ‌స్తారు` పేరుతో అనువ‌దించి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో అద్భుత‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాలు ఉంటాయ‌ని కార్తీ తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

అలాగే సినిమాలు తెర‌కెక్కించ‌డానికి రూల్స్ ఏవీ ఉండ‌వ‌ని, ఎవ‌రి అభిరుచి నాలెజ్ కి త‌గ్గ‌ట్టు వారు సినిమాలు తీస్తార‌ని, అంతిమంగా అవి ప్ర‌జ‌ల‌ను మెప్పించాయా లేదా? అన్న‌దే ముఖ్య‌మ‌ని కార్తీ ఈ ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించారు. వా వాతియార్ చిత్రంలో కార్తీ విభిన్న‌మైన షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించనున్నారు. ఇది త‌న కెరీర్ కి మ‌రో పెద్ద విజ‌యాన్ని అందిస్తుంద‌ని ఆశిస్తున్నాడు.

మ‌రోవైపు కార్తీ త‌న త‌దుప‌రి ద్విభాషా చిత్రానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి. కార్తీ ప్రస్తుతం మార్షల్ చిత్రీకరణలో ఉన్నాడు . సర్దార్ 2 కూడా 2026 వేసవిలో విడుదలకు సిద్ధమ‌వుతోంది. మ‌రో ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ‌తో సినిమాని లాంచ్ చేయాల‌ని కూడా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది.

తాజా స‌మాచారం మేర‌కు `వా వాతియార్` సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుని యుఎ సర్టిఫికేట్ తో విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. ఈ విష‌యాన్ని మేకర్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లో ధృవీక‌రించారు. యుఎ స‌ర్టిఫికెట్ వచ్చిందని చూపించే పోస్టర్‌ను కూడా చిత్రబృందం షేర్ చేసింది. ఈ చిత్రంలో జిప్సీ స్పిరిట్ రీడర్ పాత్రలో కృతి శెట్టి న‌ట‌న ఆక‌ట్టుకోనుంది. కార్తీతో పాటు, కరుణాకరన్ అతని సబార్డినేట్‌గా కనిపిస్తారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. జి. రామచంద్రన్‌కి వీరాభిమానిగా కూడా కార్తీ న‌టిస్తార‌ని తెలిసింది.

ఈ చిత్రంలో సత్యరాజ్, రాజ్‌కిరణ్, ఆనంద్ రాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్, జి. ఎం. సుందర్, రమేష్ తిలక్, పి.ఎల్. తేనప్పన్, విద్యా బోర్గియా, నివాస్ ఆదితన్ త‌దిత‌రులు కూడా న‌టించారు.