యాక్షన్‌లో ఇరుక్కున్న కార్తికి.. మళ్లీ లవర్ బాయ్ రూట్!
ఆ తర్వాత కార్తి కెరీర్‌లో జోనర్లు మారుతూ వచ్చాయి. ఖాకీలో పోలీస్ ఆఫీసర్‌గా, ఖైదీలో జైలు నుంచి బయటకు వచ్చిన వ్యక్తిగా, సర్దార్‌లో స్పైగా కనిపించాడు.
By: M Prashanth | 8 Sept 2026 6:00 AM ISTకార్తి పేరు వినగానే ఇప్పుడు యాక్షన్ సినిమాలే ఎక్కువగా గుర్తుకొస్తున్నాయి. ఖాకీ, ఖైదీ, సర్దార్ తర్వాత ఇప్పుడు సర్దార్ 2తో కూడా అదే జోన్‌లో వస్తున్నాడు. అయితే ఆయన తర్వాతి తెలుగు సినిమా మాత్రం పూర్తిగా మరో రూట్లో వెళ్లబోతోంది. ఆవారాలో తెలుగు ప్రేక్షకులు చూసిన కార్తిని మళ్లీ గుర్తు చేస్తామని నిర్మాత నాగవంశీ ఇటీవల సర్దార్ 2 ఈవెంట్ లో చెప్పాడు.
తెలుగులో కార్తికి మంచి గుర్తింపు తెచ్చిన సినిమాల్లో ఆవారాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. తమన్నాతో కలిసి చేసిన ఆ రోడ్ లవ్ స్టోరీ, యువన్ శంకర్ రాజా పాటలు, కార్తి లుక్ అప్పట్లో యూత్‌కు బాగా చేరాయి. తమిళంలో పైయ్యాగా వచ్చిన ఈ సినిమా తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది. కార్తిని యాక్షన్ హీరోగా కాకుండా చాలా క్యాజువల్‌గా, ప్రేమలో పడిన యువకుడిగా చూసిన సినిమా అది.
ఆ తర్వాత కార్తి కెరీర్‌లో జోనర్లు మారుతూ వచ్చాయి. ఖాకీలో పోలీస్ ఆఫీసర్‌గా, ఖైదీలో జైలు నుంచి బయటకు వచ్చిన వ్యక్తిగా, సర్దార్‌లో స్పైగా కనిపించాడు. ఈ సినిమాలు తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చాయి. మధ్యలో వేరే కథలు చేసినా, ఇటీవలి కాలంలో కార్తి పేరు చెప్పగానే యాక్షన్, సీరియస్ పాత్రలే ముందుగా గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది.
అందుకే నాగవంశీ ఆవారా పేరును ప్రత్యేకంగా తీసుకురావడం ఇక్కడ ఇంట్రెస్టింగ్. అప్పట్లో తెలుగు ప్రేక్షకులు ఇష్టపడిన స్టైలిష్ కార్తిని మళ్లీ చూపిస్తామని ఆయన చెప్పారు. అయితే అప్పటి కార్తిని అలాగే కాపీ చేయడం ఇప్పుడు సాధ్యం కాదు. కార్తి వయసు, కెరీర్, ఇమేజ్ అన్నీ మారాయి. కాబట్టి ఇప్పుడు ఆయనకు సరిపోయే లవర్ బాయ్ పాత్రను కొత్తగా డిజైన్ చేయాల్సి ఉంటుంది.
ఈ సినిమాను మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించబోతున్నాడు. కార్తిని లవర్ బాయ్‌గా చూపించడంతో పాటు చిన్న సూపర్ హీరో ఎలిమెంట్ కూడా ఉంటుందని నాగవంశీ చెప్పాడు. అంటే ఇది రెగ్యులర్ ప్రేమకథగా ఉండబోదు. యూత్ కామెడీతో పేరు తెచ్చుకున్న కళ్యాణ్ శంకర్ ఇప్పుడు కార్తి కోసం రొమాన్స్, కామెడీ, ఫాంటసీని ఒకే కథలో కలపబోతున్నాడు.
ఆవారా వచ్చినప్పుడు కార్తి కెరీర్ మొదటి దశలో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు యాక్షన్ హీరోగా, నటుడిగా వేరే గుర్తింపు ఉంది. ఈ మధ్య ఎక్కువగా సీరియస్ పాత్రల్లో చూసిన కార్తిని మళ్లీ సరదాగా, స్టైలిష్‌గా చూపించే అవకాశం ఈ సినిమాతో దొరుకుతోంది. పైగా చిన్న సూపర్ హీరో టచ్ కూడా ఉంటుందని ముందే చెప్పేశారు కాబట్టి, కళ్యాణ్ శంకర్ కార్తి కోసం ఎలాంటి క్యారెక్టర్ ను డిజైన్ చేస్తాడో చూడాలి.
