Begin typing your search above and press return to search.

హై కోర్ట్‌ వైపు చూస్తున్న కన్నడ సినిమా..!

దేశ వ్యాప్తంగా సినిమా టిక్కెట్‌ ధరలు భారీగా పెరిగాయి. సింగిల్ స్క్రీన్‌, మల్టీప్లెక్స్‌ అన్ని చోట్ల టికెట్ల రేట్లు గత పదేళ్లలో భారీగా పెరిగిన విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   17 Sept 2025 4:06 PM IST
హై కోర్ట్‌ వైపు చూస్తున్న కన్నడ సినిమా..!
X

దేశ వ్యాప్తంగా సినిమా టిక్కెట్‌ ధరలు భారీగా పెరిగాయి. సింగిల్ స్క్రీన్‌, మల్టీప్లెక్స్‌ అన్ని చోట్ల టికెట్ల రేట్లు గత పదేళ్లలో భారీగా పెరిగిన విషయం తెల్సిందే. సినిమా ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు, థియేటర్ల మెయింటెన్స్‌, ఇతర విషయాల కారణంగా టికెట్ల రేట్లు భారీగా పెంచడం జరిగింది. అంతగా పెంచినా సినిమా నిర్మాతలు తమకు నష్టాలు వస్తున్నాయని, టికెట్ల రేట్లు ఇంకా పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంకా పెంచితే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి ఉండదు. అందుకే పెద్ద హీరోల సినిమాలు విడుదల సమయంలో వారం లేదా రెండు వారాలు ఒక మోస్తరు వరకు టికెట్ల రేట్లను పెంచుకునే అవకాశంను చాలా రాష్ట్రాలు కల్పిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలంగా ఈ పద్దతి ఉన్న విషయం తెల్సిందే. ఆ మధ్య తెలంగాణలో టికెట్ల రేట్ల పెంపుకు నో చెప్పినా ఆ తర్వాత ఓకే అన్నారు.

కర్ణాటకలో టికెట్‌ రేట్లు రూ.200

సినిమా ఇండస్ట్రీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది అంటూ ఆందోళన వ్యక్తం అవుతున్న ఈ సమయంలో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అక్కడి స్టార్‌ హీరోలపై, పెద్ద సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలపై తీవ్రమైన ప్రభావం ను పడేసింది. కర్ణాటక ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభంలో సినిమా థియేటర్లలో టికెట్ల రేట్ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తూ చట్టం తీసుకు వచ్చింది. కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్‌ ధరను రూ.200లకు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత చిన్న సినిమా అయినా ఆ రేటులోనే టికెట్లు అమ్మాలి. అలా కాని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, చట్ట పరమైన చర్యలకు పాల్పడాల్సి ఉంటుంది అంటూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.

కర్ణాటక హై కోర్ట్‌ తీర్పు రిజర్వ్‌

ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టంపై ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. కానీ ఫిల్మ్‌ మేకర్స్ మాత్రం తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి విడ్డూరం బాబోయ్‌ అంటూ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో నిర్మాతలు, థియేటర్ల ఓనర్స్ అసోషియేషన్‌, ఎగ్జిబ్యూటర్స్‌ కోర్టును ఆశ్రయించారు. కర్ణాటక హై కోర్ట్‌ లో సుదీర్ఘ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున టికెట్ల రేట్ల పెంపును సమర్ధించుకుంటూ, ప్రజా ప్రయోజనార్థం అంటూ చట్టంను సమర్ధించారు. కానీ నిర్మాతలు మాత్రం తమ సినిమాల పరిస్థితిని వివరిస్తూ వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. టికెట్ల రేట్ల ను తగ్గించడం, పెంపుకు అనుమతి ఇవ్వకపోవడం వల్ల చాలా నష్టం కలుగుతుందని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను చూపిస్తూ నిర్మాతల తరపు లాయర్ వాదనలు వినిపించారట.

కాంతార 1, టాక్సిక్‌ సినిమాలపై ప్రభావం

సుదీర్ఘ వాదనల తర్వాత కర్ణాటక హైకోర్ట్‌ తన తీర్పును రిజర్వ్‌ చేసింది. వచ్చే వాయిదాలో తీర్పును వెలువరించే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ తీర్పులో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా, సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగా టికెట్ల రేట్లు పెంపుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చే విధంగా తీర్పు ఉండవచ్చు అంటున్నారు. ప్రస్తుతం కన్నడ సినిమా రంగానికి చెందిన ప్రముఖ నిర్మాతలు, పెద్ద హీరోలు అంతా కర్ణాటక హై కోర్ట్‌ వైపు చూస్తున్నారు. తీర్పు పాజిటివ్‌గా వస్తేనే విడుదల చేయాలని కొన్ని సినిమాలను వాయిదా వేస్తూ వస్తున్నారు. టికెట్ల రేట్లు పెంపుకు హై కోర్ట్‌ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది తర్వాత విచారణ సమయంలో వెలువరించే అవకాశాలు ఉన్నాయి. అందుకే త్వరలో విడుదల కాబోతున్న కాంతార చాప్టర్‌ 1, టాక్సిక్‌ సినిమాలపై ఈ టికెట్ల రేట్ల ప్రభావం ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.