Begin typing your search above and press return to search.

టికెట్ల ధరలు.. ప్రభుత్వం తగ్గించింది, కోర్టు ఆగమంది

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ టికెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. అది చాలదన్నట్లు క్రేజున్న పెద్ద సినిమాలకు అదనపు రేట్లు వడ్డిస్తున్నారు.

By:  Garuda Media   |   24 Sept 2025 9:02 PM IST
టికెట్ల ధరలు.. ప్రభుత్వం తగ్గించింది, కోర్టు ఆగమంది
X

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ టికెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. అది చాలదన్నట్లు క్రేజున్న పెద్ద సినిమాలకు అదనపు రేట్లు వడ్డిస్తున్నారు. దీని పట్ల ప్రేక్షకుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పట్టించుకోవడం లేదు. ఐతే కర్ణాటక ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా ప్రేక్షకుల కోణంలో ఆలోచించి ఇటీవలే ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏ సినిమాకైనా సరే.. మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర రూ.200కు మించకూడదంటూ రెండు నెలల కిందట జీవో ఇచ్చింది.

ఐతే ఇటీవలే ఆ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం కాగా.. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల నుంచి వ్యతిరేకత తప్పలేదు. ఒక ప్రాడక్ట్‌కు ఎంత ధర పెట్టాలన్నది దాని ఉత్పత్తిదారు నిర్ణయమని, ప్రభుత్వం ఈ విషయంలో నియంత్రణ ఎలా తెస్తుందని.. ఈ ధర ఎంతమాత్రం తమకు ఆమోదయోగ్యం కాదని.. కర్ణాటక మల్టీప్లెక్స్ సంఘం, నిర్మాతల మండలి కోర్టును ఆశ్రయించాయి. మరోవైపు ‘కాంతార’ సినిమా మేకర్స్ సైతం ఈ విషయమై విడిగా కోర్టుకు వెళ్లారు.

మల్టీప్లెక్స్ అసోసియేషన్, నిర్మాతల మండలి పిటిషన్‌ను విచారించిన బెంగళూరు హైకోర్టు.. ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించింది. టికెట్ల ధరల మీద రూ.200 క్యాప్ పెడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను తాత్కాలికంగా ఆపాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్ మీద విచారణ జరిపి తుది తీర్పు ఇచ్చే వరకు జీవోను అమలు చేయొద్దని, పాత ధరలనే కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది. ఇది కర్ణాటకలో రిలీజవుతున్న తర్వాతి పెద్ద చిత్రం ‘కాంతార’కు పెద్ద ఊరట అనడంలో సందేహం లేదు.

మామూలుగా దక్షిణాదిన టికెట్ల ధరలు అధికంగా ఉండే నగరాల్లో బెంగళూరు ఒకటి. అక్కడ మల్టీప్లెక్సుల్లో ఫ్లెక్సీ ప్రైసింగ్ అమల్లో ఉండేది. అంటే డిమాండును బట్టి ఎంతైనా రేటు పెంచుకుంటారన్నమాట. ఈ ప్రకారం కొన్ని సినిమాలకు రూ.800 నుంచి 1000 వరకు కూడా రేటు పెట్టేవాళ్లు. మల్టీప్లెక్సుల్లో క్రేజున్న పెద్ద సినిమాలకు 400 మించి రేటు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఐతే దీని మీద జనం నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం రూ.200 క్యాప్ పెడుతూ జీవో ఇచ్చింది. ఐతే ఆ జీవో అమలుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ పిటిషన్ మీద హైకోర్టు తుది తీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం.