కొత్త టికెట్ రేట్లు.. ఆ రెండు సినిమాల సంగతేంటి?
సినిమా టికెట్ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం. రాష్ట్రంలో సినిమా టిక్కెట్లు అత్యధికంగా రూ.200 (పన్నులు మినహాయించి)కి పరిమితం చేసింది.
By: M Prashanth | 13 Sept 2025 11:29 AM ISTసినిమా టికెట్ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం. రాష్ట్రంలో సినిమా టిక్కెట్లు అత్యధికంగా రూ.200 (పన్నులు మినహాయించి)కి పరిమితం చేసింది. తద్వారా సినీ ప్రేక్షకులకు మంచి వార్త చెప్పింది. సినిమా విడుదల కాగానే టికెట్ ధరలు తరచుగా భారీగా పెరుగుతూ ఉండగా, ఇకపై అది కష్టమే.
కొత్త నియమం అమల్లోకి రానుండడం వల్ల సాధారణ సౌకర్యం కలిగిన థియేటర్లలో టికెట్ ధరలు చౌకగా ఉండనున్నాయి. అయితే 75 సీట్లు లేదా అంతకంటే తక్కువగా ఉన్న ప్రీమియం స్క్రీన్ కలిగిన థియేటర్లకు ఆ పరిమితి వర్తించదు. చిన్న ప్రీమియం మల్టీ స్క్రీన్ థియేటర్లు సొంత విధానానుసారం టికెట్ ధరలు నిర్ణయించుకోవచ్చు.
కర్ణాటక సినిమాస్ (నియంత్రణ) (సవరణ) నియమాల చట్టంలో భాగంగా ఇప్పుడు పలు మార్పులు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. జూలై 15 2025న ముసాయిదా నోటిఫికేషన్ రూపంలో విడుదల చేసింది. కొత్త నియమానికి తమ అభ్యంతరాలు సమర్పించడానికి వీలు కల్పించింది. ఆ తర్వాత సవరించిన నిబంధనలు ధ్రువీకరించింది.
అయితే అధికారిక గెజిట్‌లో తుది ప్రచురణ తేదీ నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. 2017లో కూడా సినిమా టికెట్ ధరలు తగ్గించడానికి ఇలాంటి ప్రయత్నం జరగ్గా, అప్పుడు కర్ణాటక హైకోర్టు ఆ ప్రణాళిక నిలిపివేసింది. ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సినీ ప్రియులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది.
అది ఓకే అయినా.. ఇప్పుడు త్వరలో రిలీజ్ కానున్న కన్నడ భారీ సినిమాలు కాంతారా చాప్టర్-1, టాక్సిక్ కోసం చర్చ జరుగుతోంది. భారీ బడ్జెట్లతో రూపొందిన మూవీల టికెట్ రేట్లు సాధారణంగా అయితే భారీగా పెంచేవారు. కానీ ఇప్పుడు కుదరదు. దీంతో బడ్జెట్ కు తగ్గట్టు రేట్లు ఉండవు. కాబట్టి ఏం జరుగుతుందోనని మాట్లాడుకుంటున్నారు.
అయితే ఆ రిషబ్ శెట్టి, యష్ వేర్వేరుగా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఆ సినిమాలు.. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానున్నాయి. ఇప్పటికే భారీ బజ్ ను క్రియేట్ చేసుకున్నాయి. కానీ కర్ణాటకలో రేట్లు తక్కువగా ఉండడం వల్ల మేకర్స్ కు కాస్త నష్టమే. కానీ పాన్ ఇండియా మూవీస్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని, కవర్ అయిపోతుందని సినీ ప్రియులు చెబుతున్నారు.
