Begin typing your search above and press return to search.

30,000 కోట్ల ఎస్టేట్ వివాదం.. భ‌ర్త‌ను త‌ల‌చి క‌రిష్మా ఎమోష‌న‌ల్ పోస్ట్!

కరిష్మా కపూర్ ఈ భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేసిన తరుణంలోనే.. అటు సంజయ్ కపూర్ కుటుంబంలో భారీ ఆస్తి వివాదం నడుస్తోంది.

By:  Sivaji Kontham   |   14 Jun 2026 8:15 AM IST
30,000 కోట్ల ఎస్టేట్ వివాదం.. భ‌ర్త‌ను త‌ల‌చి క‌రిష్మా ఎమోష‌న‌ల్ పోస్ట్!
X

దాదాపు 30 వేల కోట్ల ఎస్టేట్ కి సంబంధించిన వివాదం గురించి ఇటీవ‌లి కాలంలో ప్ర‌జ‌ల్లో బోలెడంత చ‌ర్చ సాగుతోంది. ఈ వివాదం బాలీవుడ్ సీనియర్ నటి కరిష్మా కపూర్ తన మాజీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ కుటుంబానికి చెందిన‌ది కావ‌డంతో సినీ వ‌ర్గాల్లోను ఆస‌క్తి నెల‌కొంది. సంజయ్ మొదటి వర్ధంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా క‌రిష్మా క‌పూర్ నివాళులర్పించారు. ఇన్ స్టాలో ఒక చిన్నదైనా.. ఎంతో అర్థవంతమైన మెసేజ్ ని ఇచ్చారు క‌రిష్మా. ఆయన కన్నుమూసిన తేదీ 12 జూన్ 2025 ను ప్రస్తావిస్తూ.. సంజయ్.. ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచిపోతార‌ని ఎమోష‌న‌ల్ గా రాసుకొచ్చారు. దీనికి న‌మ‌స్కారం ఈమోజీ... వైట్ హార్ట్, పావురం ఈమోజీలను కూడా జతచేశారు.

సంజయ్ కపూర్ మరణం ఒక విచిత్రమైన ప్రమాదం కారణంగా సంభవించింది. ఇంగ్లండ్‌లో పోలో ఆడుతున్న సమయంలో ఆయన అనుకోకుండా ఒక తేనెటీగను మింగేయడంతో శ్వాస ఆడ‌క‌ గుండెపోటు వచ్చి మరణించినట్లు పోలీసులు ధృవీక‌రించారు. గతేడాది ఢిల్లీలో జరిగిన ఆయన అంత్యక్రియలకు కరిష్మా కపూర్ తన పిల్లలైన సమైరా, కియాన్‌లతో కలిసి హాజరయ్యారు. ఆ కష్టసమయంలో కరిష్మాకు అండగా ఉండేందుకు ఆమె సోదరి కరీనా కపూర్ ఖాన్, బావ సైఫ్ అలీ ఖాన్ కూడా ఢిల్లీకి తరలివచ్చారు.

కరిష్మా కపూర్ ఈ భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేసిన తరుణంలోనే.. అటు సంజయ్ కపూర్ కుటుంబంలో భారీ ఆస్తి వివాదం నడుస్తోంది. సంజయ్ కపూర్ మరణానంతరం ఆయన వదిలివెళ్లిన సుమారు 30,000 కోట్ల రూపాయల విలువైన ఎస్టేట్ కోసం లీగల్ వార్ సాగుతోంది. కరిష్మా కపూర్ పిల్లలతో పాటు సంజయ్ ప్రస్తుత భార్య ప్రియా సచ్‌దేవ్ కపూర్, ఆయన తల్లి రాణి కపూర్ ..కపూర్ కుటుంబానికి చెందిన ఇతర సభ్యులు ఈ సుదీర్ఘ న్యాయపోరాటంలో కోర్టుల‌కు తిరుగుతున్నారు.

మరోవైపు సంజయ్ కపూర్ ప్రస్తుత భార్య ప్రియా సచ్‌దేవ్ కూడా తన దివంగ‌త‌ భర్తను స్మరించుకుంటూ సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి ఏడాది గడిచినా నీ ఉనికి ప్రతిరోజూ మాకు మార్గదర్శకంగా నిలుస్తోంది. నువ్వు జీవితాన్ని ఎంతో శక్తితో, ఉత్సాహంతో ఆస్వాధించావు. నీ జ్ఞాపకాలు, నువ్వు పాటించిన విలువలు ఎప్పటికీ మాకు దీవెనలు! అంటూ ఎమోషనల్ అయ్యారు. కాగా కరిష్మా కపూర్, సంజయ్ కపూర్‌ల వివాహం 2003 సెప్టెంబర్ 29న సిక్కు సాంప్రదాయం ప్రకారం జరిగింది.

అయితే వీరి వైవాహిక జీవితంలో తలెత్తిన విభేదాల కారణంగా 2014లో పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత 2016లో వీరికి చట్టబద్ధంగా విడాకులు మంజూరయ్యాయి. విడాకుల ప్రక్రియ సమయంలోనే సంజయ్ కపూర్ - అతడి త‌ల్లిపై క‌రిష్మా తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ గృహ‌హింస కేసు పెట్ట‌డం అప్పట్లో సంచలనం సృష్టించింది. వీరికి సమైరా అనే కుమార్తె, కియాన్ అనే కుమారుడు ఉన్నారు. విడాకుల తర్వాత సంజయ్ ప్రియా సచ్‌దేవ్‌ను వివాహం చేసుకోగా.. కరిష్మా ఒంటరిగానే ఉంటూ పిల్లల బాధ్యతలను చూసుకుంటున్నారు.