హీరోహీరోయిన్ల నమ్మకం చూస్తే భయమేస్తోంది: 'కరికాల' డైరెక్టర్
సినిమా గురించి దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ.. 'శంబాల' ప్రయాణం పూర్తయిందని, ఇప్పుడు 'కరికాల' ప్రయాణం మొదలైందని చెప్పారు.
By: M Prashanth | 15 Oct 2026 12:35 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న కొత్త సినిమా 'కరికాల'. ఆ సినిమా కథపై హీరోహీరోయిన్లు పెట్టుకున్న నమ్మకం చూస్తుంటే తనకు భయమేస్తోందని దర్శకుడు యుగంధర్ ముని అన్నారు. వారంతా తనను మరింత రెస్పాన్సబుల్ గా మార్చారని తెలిపారు. 'కరికాల' సినిమా పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగ్గా, మూవీ టీమ్ సినిమా విశేషాలను షేర్ చేసుకుంది.
'శంబాల' సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన యుగంధర్ ముని ఇప్పుడు 'కరికాల'తో మరో కొత్త ప్రపంచాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది సోషియో ఫాంటసీ కథతో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా. కథ పెద్దది కావడంతో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. మొదటి భాగాన్ని 2027 జులై 2న, రెండో భాగాన్ని అదే ఏడాది అక్టోబర్ 28న విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది.
సినిమా గురించి దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ.. 'శంబాల' ప్రయాణం పూర్తయిందని, ఇప్పుడు 'కరికాల' ప్రయాణం మొదలైందని చెప్పారు. తనను నమ్మి సినిమా చేస్తున్న నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. సందీప్ కిషన్ వెంటనే కథకు అంగీకరించారని, హీరోయిన్లు కూడా స్టోరీని నమ్మి ప్రాజెక్టులో భాగమయ్యారని పేర్కొన్నారు. వారి నమ్మకం తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు.
'కరికాల' కథ చందమామ స్టోరీలా ఉంటుందని యుగంధర్ ముని వివరించారు. అలాంటి కథల్లో కనిపించే ఎన్నో కొత్త లోకాలు ఇందులో ఉంటాయని చెప్పారు. స్టోరీ చాలా పెద్దది కావడంతో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ.. తన పార్టనర్ మహిధర్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు.
యుగంధర్ ముని ఇంట్రెస్టింగ్ స్టోరీతో తన వద్దకు వచ్చారని, కథ నచ్చడంతో ఆ ప్రాజెక్టును మొదలుపెట్టినట్లు వివరించారు. సందీప్ కిషన్ కు స్టోరీ చెప్పగానే అంగీకరించారని, హీరోయిన్లు కూడా వెంటనే ఓకే చెప్పారని వెల్లడించారు. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ.. 'కరికాల'లో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. సందీప్ కిషన్ నటిస్తున్న 58వ సినిమా ఇదని చెప్పారు.
సినిమాలో మంచి సాంగ్స్ తో పాటు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ఛాన్స్ ఉందన్నారు. ఆడియన్స్ ను మరో వరల్డ్ లోకి తీసుకెళ్లేలా మ్యూజిక్ అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ ఎంతో ఇం ట్రెస్ట్ తో ఆ సినిమాను నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. 'శంబాల' నుంచి రాజశేఖర్ తో తన జర్నీ కొనసాగుతోందని చెప్పారు.
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్ సరసన కేథరిన్ థ్రెసా, సాక్షి మడోల్కర్ నటిస్తున్నారు. గాయత్రి భరద్వాజ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఆ సినిమాతో దర్శకుడు యుగంధర్ ముని ఎలాంటి కొత్త వరల్డ్ ను చూపిస్తారో అంతా వేచి చూడాలి.
