Begin typing your search above and press return to search.

శంభాల డైరెక్టర్ తో సందీప్ కిషన్.. కొత్త మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్!

'కరికాల' చాప్టర్ 1 జూలై 02, 2027న విడుదల కానుండగా, చాప్టర్ 2 అదే సంవత్సరం అక్టోబర్ 28, 2027న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

By:  Madhu Reddy   |   5 Aug 2026 3:55 PM IST
శంభాల డైరెక్టర్ తో సందీప్ కిషన్.. కొత్త మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్!
X

శంబాల' సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టి క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ యుగంధర్ ముని ఇప్పుడు యంగ్ హీరో సందీప్ కిషన్‌తో జతకట్టారు. 'సందీప్ 33'గా రాబోతున్న ఈ భారీ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ చిత్రానికి ‘కరికాల’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ ఫస్ట్ లుక్‌తో పాటు రిలీజ్ డేట్లను ప్రకటించారు. మాయాజాలం, రాజులు, యోధుల నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా పోస్టర్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని, భారీ అంచనాలను పెంచేసింది.

సింహంలా కరికాల ఫస్ట్ లుక్:

ఈ సినిమా నుంచి విడుదల చేసిన సందీప్ కిషన్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో సందీప్ కిషన్ గుర్రంపై వేటాడుతున్న సింహంలా చాలా రోషంగా, పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ ఫాంటసీ మూవీలో సందీప్ గెటప్ చాలా కొత్తగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్ పరంగా ఈ సినిమాను 'శంబాల'ని మించేలా ఎంతో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమవుతోంది.

రెండు భాగాలుగా రెండు రిలీజ్ డేట్లు:

ఈ భారీ ప్రాజెక్ట్‌ను మేకర్స్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనే రెండు భాగాల విడుదల తేదీలను ఒకేసారి ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 'కరికాల' చాప్టర్ 1 జూలై 02, 2027న విడుదల కానుండగా, చాప్టర్ 2 అదే సంవత్సరం అక్టోబర్ 28, 2027న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. రెండు భాగాల మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా కొద్ది నెలల వ్యవధిలోనే సినిమాలను తీసుకురావాలనే సరికొత్త ప్లాన్‌తో చిత్రబృందం ముందుకు వెళ్తోంది.

పాన్ ఇండియా రేంజ్‌లో హంగామా:

ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.ఇక సినిమా విడుదలకు ముందు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు సందీప్ కిషన్ ప్రత్యేకమైన ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మాయా ప్రపంచం, రాజుల కాలంనాటి అడ్వెంచర్ కాన్సెప్ట్ కావడంతో అన్ని భాషల ప్రేక్షకులను ఈ మూవీ ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని టీమ్ ధీమాగా ఉంది.

సందీప్ కిషన్, యుగంధర్ ముని కాంబినేషన్‌లో వస్తున్న 'కరికాల' టాలీవుడ్‌లో మరో విజువల్ వండర్‌గా నిలిచేలా కనిపిస్తోంది. ఇక పవర్ ఫుల్ టైటిల్, దానికి తగ్గట్టుగా ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని రెట్టింపు చేశాయి. విజువల్ ఎఫెక్ట్స్ మరియు కథనంతో అలరించడానికి సిద్ధమవుతున్న ఈ ఫాంటసీ రైడ్ ప్రేక్షకులకు ఎలాంటి అద్భుతమైన థియేటర్ అనుభూతిని ఇస్తుందో చూడాలి.