కపూర్ ఇంట్లో సండే మస్తీ కజిన్స్ కోసం కిచెన్‌లోకి!
కపూర్ కుటుంబంలో ఆదివారం ఫ్యామిలీ విందు సందడి చేసింది. ‘డైనింగ్ విత్ ది కపూర్స్’ డాక్యుమెంటరీకి ఏడాది పూర్తైన సందర్భంగా నిర్మాత అర్మాన్ జైన్ స్వయంగా వంట చేసి కరీనా, కరిష్మా కపూర్‌లతో పాటు కుటుంబ సభ్యులకు విందు ఇచ్చారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అర్మాన్ సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్‌గా మారాయి.
By: Srikanth Kontham | 23 Nov 2026 2:50 PM ISTసినిమా కుటుంబాలంటే తెరపై గ్లామర్.. బాక్సాఫీస్ హడావుడే కాదు. ఇంట్లో కలిసి భోజనం చేసే సంప్రదాయం కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది. కపూర్ వంశంలో తరతరాలుగా వస్తున్న ఆహారపు జ్ఞాపకాలను కళ్లకు కట్టిన `డైనింగ్ విత్ ది కపూర్స్` డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయి ఏడాది పూర్తయింది. సరిగ్గా ఆ మరుసటి రోజే ఆదివారం కావడంతో డాక్యుమెంటరీ నిర్మాత అర్మాన్ జైన్ స్వయంగా వంట చేసి కజిన్స్ కరీనా కపూర్, కరిష్మా కపూర్‌లతో పాటు కుటుంబ సభ్యులకు రుచికరమైన విందు వడ్డించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అర్మాన్ పంచుకున్న ఫోటోలు.. వీడియోలు ఆన్‌లైన్‌లో సరదా చర్చకు దారితీశాయి. సీఫుడ్, మ్యారినేట్ చేసిన చేపలను వేయించే దృశ్యాలతో పాటు `సండే ఫ్యామిలీ టైమ్ అండ్ సం గుడ్ ఫ్రైడ్ ఫుడ్` అంటూ పెట్టిన క్యాప్షన్ ఆకట్టుకుంటుంది. తల్లి రీమా జైన్ వెనుక అర్మాన్.. ఆదర్ జైన్ నిలబడిన ఫోటోతో పాటు డైనింగ్ టేబుల్ వద్ద కరీనా.. కరిష్మాల పక్కన ఎంపీ సుప్రియా సూలే కూడా కనిపించడం విశేషం. కరీనా సైతం ఈ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో `సండే మస్తీ` అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
2025లో వచ్చిన `డైనింగ్ విత్ ది కపూర్స్`స్పెషల్ డాక్యుమెంటరీకి స్మృతి ముంధ్రా దర్శకత్వం వహించారు. అర్మాన్ జైన్ రూపకల్పన.. నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. రాజ్ కపూర్ శతజయంతి వేడుకల నేపథ్యంలో కపూర్ కుటుంబ వంటకాల వారసత్వం.. పాత జ్ఞాపకాల చుట్టూ గంట నిడివి డాక్యుమెంటరీని తీర్చిదిద్దారు. అందులో రణధీర్ కపూర్, నీతూ కపూర్, రణబీర్ కపూర్, రిద్ధిమ, సైఫ్ అలీ ఖాన్, నవ్య నవేలి నందా, అగస్త్య నందా వంటి వారంతా ఒకే బల్ల వద్ద చేరి అర్మాన్ చేసిన వంటలను ఆస్వాదించగా అదే ఆసక్తితోనే ఆయన క్లౌడ్ కిచెన్ కూడా ప్రారంభించారు.
మరోవైపు కరిష్మా కపూర్, కరీనా కపూర్ తాజా ప్రాజెక్టులతో బిజీగా గడిపారు. ఈ ఏడాది జీ5లో వచ్చిన `బ్రౌన్` వెబ్ సిరీస్‌లో కరిష్మా కోల్‌కతా నేపథ్యంలో సాగే కథలో ట్రామాతో పోరాడే పోలీస్ అధికారిణి రీటా బ్రౌన్ పాత్రలో కనిపించి మిశ్రమ స్పందనలు అందుకున్నారు. మేఘ్నా గుల్జార్ దర్శకత్వంలో వచ్చిన `దాయ్రా` చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి కరీనా నటించారు. ఎన్కౌంటర్ ఘటన.. దాని వెనుక నిజాలను తవ్వే పోలీసుల కథగా రూపొందింది.
