టైమ్ దాటిందంటే తాట తీస్తానంటోంది!
అయితే ఈ విషయంలో బాలీవుడ్ స్టార్ మదర్ కరీనా కపూర్ ఖాన్ మాత్రం చాలా కఠినమైన నియమాలను పాటిస్తున్నట్లు తెలిపారు. తన పిల్లలు టైమ్ దాటి ఫోన్ వాడితే తాట తీస్తానంటూ గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
By: Srikanth Kontham | 15 Sept 2026 7:00 PM ISTడిజిటల్ యుగంలో పిల్లల పెంపకం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారింది. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌ల మోజులో పడి చిన్నతనం నుంచే స్క్రీన్లకు అతుక్కుపోతున్న పిల్లలను కంట్రోల్ చేయడం అంత సులభం కావడం లేదు. అయితే ఈ విషయంలో బాలీవుడ్ స్టార్ మదర్ కరీనా కపూర్ ఖాన్ మాత్రం చాలా కఠినమైన నియమాలను పాటిస్తున్నట్లు తెలిపారు. తన పిల్లలు టైమ్ దాటి ఫోన్ వాడితే తాట తీస్తానంటూ గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ దంపతులకు తైమూర్, జెహ్ అనే ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. స్టార్ కిడ్స్ కావడంతో చిన్నతనం నుంచే మీడియా, గ్లామర్ ప్రపంపంలో పెరిగినప్పటికీ ఇంట్లో మాత్రం వారిని సాధారణ పిల్లలట్లే పెంచుతున్నామని కరీనా తరచూ చెబుతుంటారు. అందులో భాగంగానే డిజిటల్ డివైజ్‌ల వినియోగంపై ఇంట్లో కఠినమైన పరిమితులు విధించినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
పిల్లలు ఫోన్ లేదా ప్యాడ్ వాడటానికి రోజులో నిర్దిష్ట సమయాన్ని మాత్రమే కరీనా కేటాయిస్తారట. ఆ కేటాయించిన సమయం దాటిన తర్వాత ఒక్క నిమిషం కూడా డివైజ్‌లను చేతిలో ఉంచుకోవడానికి వీల్లేదని కరాఖండీగా చెప్పేశారు. చెప్పిన టైమ్ ముగియగానే డివైజ్‌ను పక్కన పెట్టేయాలని.. ఒకవేళ తన మాట వినకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం గట్టిగా కోటింగ్ ఇవ్వడానికి కూడా వెనుకాడనన్నారు. ఈ విషయంలో సైఫ్ అలీఖాన్ మొత్తగా ఉన్నా? కరీనా మాత్రం కఠినంగానే ఉంటానంది.
కఠినంగా ఉండటమే కాదు పిల్లల దృష్టిని డిజిటల్ ప్రపంచం నుంచి మళ్లించేందుకు ఇతర వ్యాపకాలను కరీనా ప్రోత్సహిస్తున్నారు. ఫోన్లకు బదులుగా పుస్తకాలు చదవడం, అవుట్‌డోర్ గేమ్స్ ఆడటం, పెయింటింగ్ లేదా ఇతర సృజనాత్మక పనుల్లో నిమగ్నం చేయడం వంటి అలవాట్లను నూరిపోస్తున్నారు. స్క్రీన్ సమయాన్ని తగ్గించడం వల్ల పిల్లల్లో శారీరక, మానసిక వికాసం మెరుగవుతుందని కరీనా బలంగా నమ్ముతున్నారు.
ఇంట్లో పిల్లలకే కాకుండా తల్లిదండ్రులుగా తాము కూడా కొన్ని నియమాలు పాటిస్తున్నామని కరీనా తెలిపారు. పిల్లల ముందే తాము గంటల తరబడి ఫోన్లలో గడపడం సరైన పద్ధతి కాదని.. తాము ఆదర్శంగా ఉంటేనే పిల్లలు కూడా క్రమశిక్షణతో ఉంటారని అభిప్రాయపడ్డారు. అందుకే కుటుంబంతో గడిపే సమయంలో ఫోన్‌ను వీలైనంత దూరంగా ఉంచుతామని చెప్పుకొచ్చారు.
నేటి తరం తల్లిదండ్రులందరికీ కరీనా కపూర్ అనుసరిస్తున్న పద్ధతి మంచి సందేశాన్ని ఇస్తోంది. గారాబం పేరిట పిల్లలకు చిన్న వయసులోనే ఫోన్లు చేతికి ఇచ్చి వారి భవిష్యత్తును పాడుచేయకుండా సరిహద్దులు గీసి పెంచడం ఎంతైనా అవసరమని కరీనా నిరూపిస్తున్నారు. టైమ్ దాటితే తాట తీస్తానంటూ కరీనా తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో నెటిజన్లు .. ఇతర పోషకుల ప్రశంసలు అందుకుంటోంది.
