కన్న బిడ్డల కంటే చెల్లికే పెద్ద పీట వేసిన అక్క!
బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో కపూర్ సిస్టర్స్ అనగానే గుర్తొచ్చే పేర్లు కరిష్మా కపూర్- కరీనా కపూర్.
By: Srikanth Kontham | 9 Jun 2026 8:00 AM ISTబాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో కపూర్ సిస్టర్స్ అనగానే గుర్తొచ్చే పేర్లు కరిష్మా కపూర్- కరీనా కపూర్. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ ఎంతో ప్రత్యేకమైనవి. అక్కాచెల్లెళ్లుగా కంటే కూడా మంచి స్నేహితుల్లా మెలిగే ఇద్దరు భామలు తాజాగా ఓ ఆసక్తికర విషయంతో వార్తల్లో నిలిచారు. సోదరి కరిష్మా కపూర్ గురించి మాట్లాడుతుండగా కరీనా కపూర్ రిలేషన్‌షిప్‌పై చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తామిద్దరం అక్కాచెల్లెళ్లం మాత్రమే కాదని.. అంతకుమించిన ప్రత్యేక బంధం తమ మధ్య ఉందని కరీనా పేర్కొన్నారు.
సాధారణంగా పెద్దవారే చిన్నవారిని తల్లిలాగా చూసుకుంటూ ఉంటారు. కరిష్మా కపూర్ కూడా కరీనాను చిన్నప్పటి నుండి ఎంతో గారాబంగా, బాధ్యతగా పెంచింది. అయితే కరీనా కపూర్ మాత్రం దీనిని కాస్త భిన్నమైన కోణంలో చూస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో తమ ఇద్దరి రిలేషన్ గురించి ఏమన్నారంటే? `చాలామంది లోలోపల కరిష్మా నన్ను తన పెద్ద కూతురిలా భావిస్తుందని అనుకుంటారు. కానీ అసలు నిజం ఏమిటంటే కరిష్మాకు నేనే మొదటి కూతుర్ని అంటూ కరీనా సరదాగా వ్యాఖ్యానించారు. తానే కరిష్మా జీవితంలో అంతటి ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించానని చెప్పుకొచ్చారు.
కరిష్మా కపూర్‌కు ఇద్దరు పిల్లలు (సమీరా, కియాన్) ఉన్నప్పటికీ ఆ పిల్లల కంటే ముందే తాను కరిష్మా జీవితంలో ఒక కూతురిలా మారిపోయానని కరీనా గుర్తు చేసుకున్నారు. కరిష్మా కూడా కరీనాను ఎప్పుడూ తన సొంత బిడ్డలాగే చూసుకునేదని.. తన కెరీర్ ఎదుగుదలలో, వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ కరిష్మా వెన్నంటి ఉండి నడిపించిందని తెలిపారు. ఈ క్రమంలోనే తామిద్దరి మధ్య ఉన్నది తోబుట్టువుల అనుబంధం మాత్రమే కాదని ఒక రకమైన మాతృత్వపు బంధం కూడా దాగి ఉందనే అర్థంలో కరీనా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదే ఇంటర్వ్యూలో కరీనా కపూర్ తన భర్త సైఫ్ అలీ ఖాన్ అలాగే కొడుకు తైమూర్ అలీ ఖాన్‌లకు సంబంధించిన సరదా విషయాలను పంచుకున్నారు. తన ఇంట్లో ఉన్న మగవారంతా ఒక ఎత్తయితే.. కరిష్మాతో తనకున్న అనుబంధం మరో ఎత్తని స్పష్టం చేశారు. సైఫ్ అలీ ఖాన్ కూడా కరిష్మా.. కరీనాల మధ్య ఉన్న ఈ విడదీయరాని బంధాన్ని ఎంతో గౌరవిస్తారని.. వారిద్దరూ కలిసి ఉన్నప్పుడు మూడో వ్యక్తికి అక్కడ స్థానం ఉండదని ఆయన సరదాగా అంటుంటారని కరీనా పేర్కొన్నారు.
కపూర్ కుటుంబంలో సినిమా వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లిన ఇద్దరు సోదరిమణులు, వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఒకరికొకరు అండగా నిలిచారు. 90ల కాలంలో కరిష్మా కపూర్ స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో కరీనా ఆమెను చూసి ఎంతో నేర్చుకున్నానని, కరిష్మా కష్టపడే తత్వమే తను కూడా హీరోయిన్ కావడానికి స్ఫూర్తినిచ్చిందని పలుమార్లు వెల్లడించారు. ఇప్పుడు ఇద్దరు కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉన్నా? సమయం దొరికితే తప్పక కలుస్తారు.
