Begin typing your search above and press return to search.

నాడు రీల్ జోడీ..నేడు రియల్ బంధువులు!

'హమ్ సాథ్ సాథ్ హై' సినిమాలో సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్ కలిసి డ్యాన్స్ చేసిన పాత వీడియోపై కరీనా కపూర్ స్పందించారు. తన భర్త, అక్క కలిసి నటించిన సన్నివేశాన్ని గుర్తుచేసుకుంటూ సరదా క్యాప్షన్ పెట్టారు. సూరజ్ బర్జాత్య సినిమాలంటే ఇష్టమని, ఆయుష్మాన్ ఖురానా, శర్వరీ నటించిన 'యే ప్రేమ్ మోల్ లియా' కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఈ సినిమా నవంబర్ 27న విడుదల కానుంది.

By:  Srikanth Kontham   |   25 Nov 2026 7:00 PM IST
నాడు రీల్ జోడీ..నేడు రియల్ బంధువులు!
X

సూరజ్ బర్జాత్య దర్శకత్వంలో తెర‌కెక్కిన ఎన్నో కుటుంబ కథా చిత్రాలు హిందీ సినిమా చరిత్రలో ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చాయి. `హమ్ ఆప్కే హై కౌన్` నుంచి `హమ్ సాథ్ సాథ్ హై` వరకు ప్రతి సినిమాలోనూ ప్రత్యేకమైన ఆత్మీయత కనిపిస్తుంది. తాజాగా సూరజ్ నుంచి మరో ఫ్యామిలీ చిత్రం `యే ప్రేమ్ మోల్ లియా` విడుదలవుతున్న వేళ కరీనా కపూర్ ఖాన్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. బుధవారం ఉదయం నిద్రలేవగానే అక్క కరిష్మా కపూర్.. భర్త సైఫ్ అలీ ఖాన్ కలిసి నటించిన `హమ్ సాథ్ సాథ్ హై` చిత్రంలో ఓ వీడియోను చూసి సరదాగా స్పందించారు.

ఆ సినిమాలో సైఫ్.. కరిష్మా కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించిన సన్నివేశాన్ని ప్రస్తావించారు. ఆ చిత్రంలో వినోద్ పాత్రలో సైఫ్.. సప్న పాత్రలో కరిష్మా నటించగా కొత్తగా పెళ్లయిన కోడలు సాధన (ట‌బు)కు కుటుంబ సభ్యులను సరదాగా అనుకరిస్తూ పరిచయం చేసే సీన్ అది. ఆ సినిమాలో కరిష్మా పాత్రను సైఫ్‌కు జోడీగా చూపించారు.ఆ క్లిప్ ఆధారంగా కరీనా ఆసక్తికర క్యాప్షన్ రాశారు. `ఉదయం లేవగానే ఇది కనిపించింది.. సైఫు తన కాబోయే బావమరిదితో ఇలా డ్యాన్స్ చేస్తాడని అప్పుడు ఎవరికి తెలుసు? నాకు ఇది చాలా ఇష్టం. అలాగే సూరజ్ జీ సినిమాలు అంటే కూడా ఇష్టం.. `యే ప్రేమ్ మోల్ లియా` కోసం ఎదురుచూస్తున్నా.. సినిమా హాల్‌కు వెళ్తున్నా` అంటూ ఉత్సాహాన్ని వ్యక్తం చేసారు.

నిజానికి `హమ్ సాథ్ సాథ్ హై` విడుదలైనప్పుడు సల్మాన్ ఖాన్.. ట‌బు.. సోనాలి బింద్రే.. నీలం కొఠారి వంటి భారీ తారాగణంతో ఆ చిత్రం పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత 2008లో వచ్చిన `టషన్` షూటింగ్ సమయంలో కరీనా.. సైఫ్ మధ్య ప్రేమ చిగురించింది. అంతకుముందే అమృతా సింగ్‌తో వివాహం ద్వారా సైఫ్‌కు ఇబ్రహీం, సారా ఇద్దరు పిల్లలు ఉండగా కరీనా కూడా షాహిద్ కపూర్‌తో విడిపోయారు. ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2012లో ఇద్ద‌రు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి తైమూర్ , జహంగీర్ ఇద్దరు కుమారులు ఉన్నారు.

సూరజ్ బర్జాత్య విషయానికొస్తే జాతీయ అవార్డులు అందుకున్న `ఊంచాయ్` తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం `యే ప్రేమ్ మోల్ లియా`. అమితాబ్ బచ్చన్, బొమన్ ఇరానీ, అనుపమ్ ఖేర్, నీనా గుప్తా నటించిన `ఊంచాయ్` తర్వాత సూరజ్ నుంచి వస్తున్న సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది.

ఆయుష్మాన్ ఖురానా, శర్వరీ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలో అనుపమ్ ఖేర్, సుప్రియా పాఠక్, సీమా పహ్వా, సౌమ్యా టాండన్, షాద్ రంధ్వా కీలక పాత్రలు పోషించారు. పెళ్లి తర్వాత అబ్బాయే అమ్మాయి కుటుంబంలో ఒకడిగా మారితే ఎలా ఉంటుందనే కథాంశంతో రూపొందిన చిత్రం నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.