25 ఏళ్ల తర్వాత మళ్లీ హిట్ జోడీ!
‘కభీ ఖుషీ కభీ ఘమ్’లో పూ, లడ్డూ పాత్రలతో అలరించిన కరీనా కపూర్, హృతిక్ రోషన్ 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్కటయ్యారు. కరణ్ జోహార్ షేర్ చేసిన ప్రోమోతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఇది కొత్త సినిమా కోసం కాదు.. ఓ ట్రావెల్ కంపెనీ ప్రకటన కోసం చేసిన రీయూనియన్. దీంతో వీరిద్దరితో పూర్తి స్థాయి సినిమా తీయాలంటూ అభిమానులు కరణ్‌ను కోరుతున్నారు.
By: Srikanth Kontham | 18 Nov 2026 3:31 PM ISTబాలీవుడ్ క్లాసిక్ ఫ్యామిలీ డ్రామాల్లో `కభీ ఖుషీ కభీ ఘమ్`ఒకటి. అమితాబచ్చన్, జయాబచ్చన్, షారుక్ ఖాన్, కాజోల్, హృతిక్ రోషన్, కరీనా కపూర్ జోడీగా కరణ్ జోహార్ తెరకెక్కించిన సినిమా రెండు దశాబ్దాల క్రితమే 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రత్యేకించి సినిమాలో పూ పాత్రలో (కరీనా కపూర్).. `రోహన్` అలియాస్ లడ్డూ (హృతిక్ రోషన్) పాత్రల్లో అద్భుతంగా అలరించారు. దీంతో ఆ జోడీ అంటే ఇప్పటికీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ సినిమా వచ్చి పాతికేళ్లు అవుతున్నా ఇద్దరి మధ్య కెమిస్ట్రీని.. ఆ స్టైలిష్ సీన్స్‌ను అభిమానులు ఇంకా మర్చిపోలేరు.
సరిగ్గా 25 ఏళ్ల తర్వాత ఈ ఐకానిక్ జంట మళ్ళీ ఒక్కటవుతోందంటూ కరణ్ జోహార్ తాజాగా ఓ వీడియో తో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నారు. కరణ్ జోహార్ షేర్ చేసిన ప్రోమో వీడియోలో కరీనా కపూర్ పూ పాత్రను గుర్తుచేస్తూ అద్దం ముందు లిప్‌స్టిక్ రాసుకుంటూ కనిపిస్తే.. మరోవైపు హృతిక్ రోషన్ లెదర్ జాకెట్.. స్టైలిష్ షూస్ వేసుకుంటూ రెడీ అవుతున్నట్లు చూపించారు. ఇద్దరి ముఖాలను పూర్తిగా రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేసారు. `కొన్ని కథలు 25 ఏళ్ల తర్వాత కూడా ముగిసిపోవు` అంటూ కరణ్ పెట్టిన క్యాప్షన్ అభిమానుల్లో ఒక్కసారిగా అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది.
అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఈ క్రేజీ రీయూనియన్ జరిగింది మరో భారీ సినిమా కోసం కాదు. కేవలం ట్రావెల్ కంపెనీ ప్రకటన కోసం. అవును పాతికేళ్ల తర్వాత ఈ జంటను మళ్ళీ వెండితెరపై చూస్తామని ఆశపడిన అభిమానులకు ఇది ఒక కమర్షియల్ యాడ్ అని తెలియడంతో నిరాశ కలిగినా? ఆ పాత జ్ఞాపకాలను మళ్ళీ కళ్లముందు ఉంచినందుకు సంతోష పడుతున్నారు.
టీజర్ చూసిన సినీ ప్రముఖులు..నెటిజన్లు కరణ్ జోహార్‌పై డిమాండ్ల వర్షం కురిపిస్తున్నారు. `మాకు యాడ్స్ వద్దు కరణ్. వీళ్లిద్దరితో పూర్తిస్థాయి సినిమా తీయండి` అంటూ దర్శకురాలు తాహిరా కశ్యప్‌తో పాటు వేలాది మంది ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. 2001లో రిలీజ్ అయిన ` క్లాసిక్ ఫ్యామిలీ డ్రామా తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ అలాంటి మ్యాజిక్ చేయాలని ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే కరీనా కపూర్ ఇటీవలే పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి నటించిన `దాయ్రా` రిలీజ్ అయింది. కానీ సినిమా ఆశించిన ఫలితాలు సాధించలేదు. ప్రస్తుతం షారుక్ ఖాన్ `కింగ్` లో నటిస్తోంది. అలాగే హృతిక్ రోషన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `క్రిష్ 4` పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
