Begin typing your search above and press return to search.

తుపాకులు, ఆవేశం అవ‌స‌రం లేని రియలిస్టిక్ లేడీ కాప్‌!

బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ 25 ఏళ్ల నటనా జీవితంలో సరికొత్త పాత్రలో కనిపించేందుకు సిద్ధమయ్యారు.

By:  Srikanth Kontham   |   17 Sept 2026 6:00 PM IST
తుపాకులు, ఆవేశం అవ‌స‌రం లేని రియలిస్టిక్ లేడీ కాప్‌!
X

బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ 25 ఏళ్ల నటనా జీవితంలో సరికొత్త పాత్రలో కనిపించేందుకు సిద్ధమయ్యారు. దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం `దాయరా` లో అమ్మ‌డు తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. సెప్టెంబరు 18న విడుద‌ల కానున్న చిత్రంలో కరీనా డీసీపీ `అజూనీ కోహ్లీ` అనే కీలక పాత్ర పోషించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న క‌రీనా సినిమాలో తన పాత్ర శైలి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

భారతీయ సినిమాలో లేడీ కాప్ అనగానే గన్‌ పట్టుకుని, పురుషుల తరహాలో కాస్త రఫ్‌గా, ఆవేశంతో కనిపించే మూస పాత్రలే ఎక్కువగా గుర్తుకొస్తాయని కరీనా అన్నారు. అయితే `దాయరా` చిత్రంలో తన పాత్ర ఆ రొటీన్ శైలికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని స్పష్టం చేశారు. సినిమాలో అజూనీ పాత్ర కేవలం ఒక పోలీస్ అధికారిణిగానే కాకుండా తనలోని మహిళాత్వాన్ని కోల్పోకుండానే విధులను నిర్వర్తిస్తుందని పేర్కొన్నారు.

పాత్ర అవ‌స‌రాన్ని బ‌ట్టి నిజమైన మహిళా పోలీస్ అధికారి ఎలా ఉంటారో? అలాగే చూపించాలని దర్శకురా లుమేఘనా గుల్జార్ భావించారని కరీనా వివరించారు. ఈ పాత్ర లిప్‌స్టిక్ వేసుకుంటుంది. మొహంలో చిరునవ్వుతోనే కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది తప్ప.. అనవసరంగా చేతిలో తుపాకీ పట్టుకుని డిష్యూం డిష్యూం యాక్షన్ సీన్లు చేయదని చెప్పారు. ఒకవైపు స్త్రీత్వపు హుందాతనాన్ని కాపాడుకుంటూనే వృత్తిపరమైన బాధ్యతలను నెరవేర్చే అధికారిణిగా అజూనీ పాత్ర ప్రేక్షకులను అలరిస్తుందన్నారు.

నేరస్థులకు శిక్ష విధించే విధానంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్న ఇద్దరు పోలీసు అధికారుల మధ్య సాగే మానసిక సంఘర్షణ ఆధారంగా `దాయరా` కథ సాగుతుంది. కరీనా కపూర్‌తో పాటు మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మరో ప్రధాన పోలీస్ అధికారిగా (రామన్) నటించారు. వ్యక్తిగతంగా తనకు జీవితం అంటే బ్లాక్ అండ్ వైట్ అని నమ్ముతానని, కానీ ఈ సినిమాలో కథాంశం అంతా గ్రే షేడ్స్ లో సాగుతుందని.. అందుకే అజూనీ పాత్ర మానసిక స్థితిని అర్థం చేసుకుని నటించడం తనకు ఎంతో సవాలుగా అనిపించిందని కరీనా పేర్కొన్నారు.

పాతికేళ్ల కెరీర్ పూర్తయినా ఇప్పటికీ నటనపై తనకున్న ఇష్టమే విభిన్న పాత్రలు ఎంచుకోవడానికి కారణమని కరీనా అన్నారు. దర్శకత్వం వహించడంపై గానీ, సినిమాలు నిర్మించడంపై గానీ ఎలాంటి ఆసక్తి లేదని క‌రీనా స్పష్టం చేశారు. నటనను మాత్రమే ప్రాణంగా ప్రేమిస్తానని, అందుకే ప్రతీసారి సరికొత్త కథలు, సవాలుతో కూడిన పాత్రలను అన్వేషించడానికి ప్రయత్నిస్తుంటానని తెలిపారు. 2024లో రిలీజ్ అయిన `సింగం అగైన్` తర్వాత కరీనా బిగ్ స్క్రీన్‌పై కనిపించనున్న చిత్రం ఇదే కావడం గమనార్హం.