గొర్రెల మంద అంటూ స్టార్ హీరోయిన్ కౌంటర్!
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా తెరకెక్కిన `యానిమల్` చిత్రాన్ని ఉదాహరణగా చూపుతూ కరీనా ఈ వ్యాఖ్యలు చేశారు.
By: Srikanth Kontham | 10 Sept 2026 6:00 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ హిందీ చిత్ర పరిశ్రమలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న మూస ధోరణిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో ఒకే తరహా సినిమా విజయం సాధిస్తే ఎలాంటి ఆలోచన లేకుండా అందరూ అదే బాటలో ప్రయాణించడానికి ప్రయత్నిస్తారని విమర్శించారు. ఇటీవల పాల్గొన్న ఓ కార్యక్రమంలో కరీనా హిందీ చిత్ర పరిశ్రమలో ఉన్న మంద మనస్తత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా తెరకెక్కిన `యానిమల్` చిత్రాన్ని ఉదాహరణగా చూపుతూ కరీనా ఈ వ్యాఖ్యలు చేశారు.
`గతంలో కేవలం ప్రేమకథలే ఆడతాయని భావించేవారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన మారింది. యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అవ్వగానే `పదండి, అందరం హింస నేప థ్యంలోనే సినిమాలు తీద్దాం అని పరిశ్రమ భావిస్తోంది. పరిశ్రమలో గుడ్డిగా అనుకరించే గొర్రెల మంద మనస్తత్వం ఎక్కువగా ఉంది` అని అసహనం వ్యక్తం చేసారు. ఒక జానర్ లేదా ఒక చిత్రం హిట్ అవ్వగానే అదే తరహా కథలతో సినిమాలు తీసి ప్రేక్షకులకు రుద్దడం సరికాదని కరీనా అభిప్రాయపడ్డారు.
కేవలం విపరీతమైన హింసను చూపించడం లేదా కామెడీ సన్నివేశాలు పెట్టడం వల్లే ప్రతి సినిమా 200 కోట్లు .. 500 కోట్లు వసూలు చేయదని పేర్కొన్నారు. కథలో బలం లేకుండా ట్రెండ్‌ను గుడ్డిగా అనుసరిస్తే ప్రేక్షకులు ఆదరించరని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రేక్షకులు చాలా తెలివైనవారని.. పరిశ్రమ అనుకుంటున్న దానికంటే ఎక్కువ పరిణతి చెందారని కరీనా స్పష్టం చేశారు. సినిమా ట్రైలర్ చూసి మాత్రమే థియేటర్లకు రావాలా వద్దా అని నేటి తరం ప్రేక్షకులు నిర్ణయిం చుకుంటున్నారని తెలిపారు. కంటెంట్ ఉన్న చిత్రాలనే ప్రేక్షకులు కోరుకుంటున్నారని, ఆలోచింపజేసే కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు.
పరిశ్రమలో కొందరు దర్శకులు మూస ధోరణిని విచ్ఛిన్నం చేస్తూ తమదైన శైలిలో వైవిధ్యమైన సినిమాలు తీస్తున్నారని కరీనా ప్రశంసించారు. అలాంటి ఆలోచనాత్మక చిత్రాలకే ప్రేక్షకుల నుంచి లభిస్తున్న మద్దతు ట్రెండ్‌ను మారుస్తోందన్నారు. ప్రేక్షకులు అడిగే ప్రశ్నలే క్రియేటర్లను సరికొత్త కథల వైపు నడిపిస్తున్నాయని కరీనా అభిప్రాయపడ్డారు.
రెండు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో విభిన్న పాత్రలు పోషించిన కరీనా నేరుగా ఓ హిట్ సినిమా పేరును ప్రస్తావిస్తూ ఇండస్ట్రీ పోకడలను నిలదీయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రయోగాత్మక కథలతో ముందుకు రావాల్సిన అవసరం మేకర్లకు ఉందని కరీనా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో సరికొత్త ఆలోచనలకు తెర తీస్తున్నాయి. ఈ వ్యాఖ్యల పట్ల మెజార్టీ వర్గం నిజమే కదా? అని కరీనా వ్యాఖ్యల్ని సమర్దించడం విశేషం.
