Begin typing your search above and press return to search.

శివాజీ వ్యాఖ్యలు కరెక్టే.. అనసూయకు కరాటే కల్యాణి స్ట్రాంగ్ కౌంటర్!

నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై జరుగుతున్న కాంట్రవర్సిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కల్యాణి ఆయనకు మద్దతుగా నిలిచారు.

By:  M Prashanth   |   24 Dec 2025 1:32 PM IST
శివాజీ వ్యాఖ్యలు కరెక్టే.. అనసూయకు కరాటే కల్యాణి స్ట్రాంగ్ కౌంటర్!
X

నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై జరుగుతున్న కాంట్రవర్సిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కల్యాణి ఆయనకు మద్దతుగా నిలిచారు. ఓ టీవీ డిబేట్ లో పాల్గొన్న ఆమె.. శివాజీ మాట్లాడిన విధానంలో ఆ రెండు పదాలు తప్పే కానీ, ఆయన చెప్పిన ఉద్దేశం నూటికి నూరు పాళ్లు నిజమని సమర్ధించారు. భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఒక గౌరవం ఉందని, కట్టు బొట్టుతో ఉండటమే మన సంప్రదాయమని ఆమె గుర్తుచేశారు.

ముఖ్యంగా యాంకర్ అనసూయ తీరును కరాటే కల్యాణి తప్పుబట్టారు. మొన్న అనసూయ వాళ్ళ అబ్బాయి ఒడుగు వేడుకలో పట్టుచీర కట్టుకుని ఎంతో పద్ధతిగా కనిపించారు కదా, అంటే ఆమెకు సంప్రదాయం తెలుసు కదా అని ప్రశ్నించారు. ఇంట్లో శుభకార్యాలకు పద్ధతిగా ఉంటూ, బయట మాత్రం పొట్టి దుస్తులు వేసుకుని 'నా ఇష్టం' అనడం సరికాదని హితవు పలికారు. సినిమా వాళ్లు సమాజానికి రోల్ మోడల్స్ గా ఉంటారు కాబట్టి, వారిని చూసి జనం ఫాలో అవుతారని, అందుకే బాధ్యతగా ఉండాలని సూచించారు.

ఇక చిన్మయిని ఉద్దేశించి కూడా ఆమె కొన్ని ప్రశ్నలు వేశారు. గతంలో వచ్చిన పాటల్లో కూడా అభ్యంతరకరమైన పదాలు ఉన్నాయని, అప్పుడు చిన్మయి ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కేవలం శివాజీని మాత్రమే టార్గెట్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. డ్రెస్సింగ్ అనేది పర్సనల్ ఛాయిస్ అని అనసూయ అంటున్నారని, కానీ పబ్లిక్ లో ఉన్నప్పుడు అది పర్సనల్ కాదని, నలుగురిని ప్రభావితం చేస్తుందని కల్యాణి వాదించారు.

ప్రస్తుతం సమాజంలో యువత పెడదోవ పడుతోందని, గంజాయికి, డ్రగ్స్ కు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడితనం పెరిగిపోతోందని, సినిమాల్లో చూపించేదే బయట యువత ఫాలో అవుతున్నారని అన్నారు. నిధి అగర్వాల్ డ్రెస్ విషయంలో కూడా నెటిజన్లు కామెంట్స్ చేశారని, ఎంత పొట్టిగా వేసుకుంటే అంత పెద్ద డిజైనర్ అయిపోరని చురకలు అంటించారు.

శివాజీ వాడిన ఆ రెండు అన్ పార్లమెంటరీ పదాలను తాను కూడా ఖండిస్తున్నానని, వాటికి ఆయన కచ్చితంగా క్షమాపణ చెప్పాలని కల్యాణి డిమాండ్ చేశారు. కానీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు పద్ధతిగా ఉండాలని ఆయన చెప్పిన పాయింట్ లో తప్పులేదని స్పష్టం చేశారు. ఆడవాళ్లను తక్కువ చేయడం ఆయన ఉద్దేశం కాదని, మన సంప్రదాయాన్ని కాపాడుకోవాలనే ఆవేదన మాత్రమే అందులో ఉందని ఆమె చెప్పుకొచ్చారు.

మొత్తానికి అనసూయ, చిన్మయి వాదనలకు కరాటే కల్యాణి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. డ్రెస్సింగ్ స్వేచ్ఛ వేరు, సామాజిక బాధ్యత వేరు అని ఆమె క్లారిటీ ఇచ్చారు. శివాజీ వ్యాఖ్యలను పూర్తిగా తప్పుబట్టకుండా, అందులో ఉన్న వాస్తవాన్ని గ్రహించాలని ఆమె కోరారు. ఇప్పుడు కరాటే కల్యాణి కామెంట్స్ ఈ వివాదంలో కొత్త చర్చకు దారితీశాయి. మరి అనసూయ, చిన్మయి ఆ కామెంట్స్ పై ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.