Begin typing your search above and press return to search.

అన్వేష్ ఒక వైరస్.. చైనాలో ఉన్నా వదిలేది లేదు..

యూట్యూబర్ 'నా అన్వేషణ' అన్వేష్ చుట్టూ ముసురుకున్న వివాదాలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.

By:  M Prashanth   |   2 Jan 2026 11:37 PM IST
అన్వేష్ ఒక వైరస్.. చైనాలో ఉన్నా వదిలేది లేదు..
X

యూట్యూబర్ 'నా అన్వేషణ' అన్వేష్ చుట్టూ ముసురుకున్న వివాదాలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇప్పటికే గరికపాటి వారి ఇష్యూతో వార్తల్లో నిలిచిన అన్వేష్ పై, లేటెస్ట్ గా నటి కరాటే కళ్యాణి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, అన్వేష్ చేస్తున్న వీడియోలు, వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతన్ని ఒక "వైరస్"తో పోల్చడం చర్చనీయాంశమైంది.

కరాటే కళ్యాణి ప్రధానంగా అన్వేష్ పై మండిపడటానికి కారణం.. అతను రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నాడని ఆమె ఆరోపించారు. భారతీయులను, హిందువులను కించపరిచేలా మాట్లాడటం ఒక ఫ్యాషన్ గా మారిపోయిందని, ఇలాంటి వ్యక్తులను సమాజం పెంచి పోషించకూడదని ఆమె ఘాటుగా హెచ్చరించారు. "భారతదేశం గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు" అంటూ ఆమె తనదైన శైలిలో ఫైర్ అయ్యారు.

ముఖ్యంగా ఇటీవల మలేషియాలోని మురుగన్ ఆలయం వద్ద అన్వేష్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. అక్కడ "ఆరెంజ్ బత్తాయిలను పిండేస్తా, ఆరెంజ్ జ్యూస్" అని అన్వేష్ అనడం వెనుక అర్ధం వేరే ఉందని ఆమె వివరించారు. కాషాయం ధరించే సాధువులను, హిందుత్వవాదులను, బీజేపీ నాయకులను ఉద్దేశించే అతను "బత్తాయిలు" అనే పదాన్ని వాడి అవమానించాడని ఆమె ఆరోపించారు.

అన్వేష్ మతపరమైన అంశాలను కూడా ఆమె ప్రస్తావించారు. గతంలో ఒక వర్గం గ్రంథం పట్టుకుని చేసిన వీడియోలను గుర్తుచేస్తూ, ఒక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే ఇలాంటి పదజాలాన్ని వాడుతారని పరోక్షంగా కామెంట్ చేశారు. హిందువుల గురించి మాట్లాడే ముందు కనీస జ్ఞానం ఉండాలని హితవు పలికారు.

ఇక అన్వేష్ పై లీగల్ యాక్షన్ విషయంలో కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే సజ్జనార్ గారి వరకు ఫిర్యాదు వెళ్ళిందని, పోలీసులు అన్వేష్ కోసం వెతుకుతున్నారని తెలిపారు. అతని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఖాతాలు క్లోజ్ అయ్యేదాకా ఈ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే తనను సంప్రదిస్తే ఫార్మాట్ ఇస్తానని చెప్పారు.

ప్రస్తుతం అన్వేష్ చైనాలో ఉన్నాడని సమాచారం ఉందన్న కళ్యాణి, అతను ఎక్కడున్నా చట్టం నుంచి తప్పించుకోలేడని అన్నారు. భారతదేశానికి తిరిగి వచ్చేదాకా, లేదా చట్టపరంగా శిక్ష పడేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి అన్వేష్ వీడియోల వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కి సీరియస్ టర్న్ తీసుకుంది. మరి ఈ చర్యలకు అన్వేష్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.