Begin typing your search above and press return to search.

బేటా.. ఇది బర్బరీ కాదు.. బహుత్ బురీ!

ఈ సరదా జ్ఞాపకాలతో పాటు, తండ్రి జీవితంలో చివరి రోజులను కూడా కరణ్ భావోద్వేగంగా పంచుకున్నారు.

By:  Srikanth Kontham   |   7 Sept 2026 6:00 PM IST
బేటా.. ఇది బర్బరీ కాదు.. బహుత్ బురీ!
X

బాలీవుడ్ దర్శక,నిర్మాత కరణ్ జోహార్ దివంగత తండ్రి, దిగ్గజ నిర్మాత యష్ జోహార్ జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ సరదా పోస్ట్‌ను పంచుకున్నారు. తన తండ్రితో ఉన్న పాత జ్ఞాపకాలు, ఆయనలోని హాస్యచతురత , ఆయన నేర్పిన విలువల గురించి కరణ్ పోస్ట్‌లో సుదీర్ఘంగా వివరించారు. తండ్రితో ఉన్న బాల్య నాటి ఫొటోను షేర్ చేసారు. `హ్యాపీ బర్త్‌డే పప్పా.. మిస్ యు ఎవ్రీ డే` అని రాసుకొచ్చారు.

ఈ సందర్భంగా కరణ్ ఓ ఫన్నీ సంఘటనను గుర్తు చేసుకున్నారు. తాను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం `కుచ్ కుచ్ హోతా హై` ఘన విజయం సాధించిన అనంత‌రం సంబరాల్లో భాగంగా మొదటిసారిగా ఖరీదైన డిజైనర్ జాకెట్ కొనుగోలు చేసినట్లు తెలిపారు.

`ఆ రోజుల్లో నేను బాగా లావుగా (ప్లస్ సైజ్) ఉండేవాడిని. `బర్బరీ` షోరూమ్‌కి వెళ్లి నాకు సరిపోయే ఏకైక ఓవర్‌సైజ్ జాకెట్‌ను కొనుగోలు చేశాను. అది వేసుకుని నేను చాలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నానని ఫీలయ్యాను` అని కరణ్ పేర్కొన్నారు. అయితే ఆ జాకెట్‌లో కరణ్‌ను చూసిన ఆయన తండ్రి యష్ జోహార్ మురిసిపోవడానికి బదులుగా ఆశ్చర్యపోయి సరదాగా ట్రోల్ చేశారు. `బేటా.. ఏంటిది?` అని యష్ జోహార్ అడగ్గా అది అంతర్జాతీయ బ్రాండ్ `బర్బరీ` జాకెట్ అని కరణ్ చెప్పారు. దానికి యష్ జోహార్ బదులిస్తూ.. `బేటా.. ఇది బర్బరీ కాదు. బహుత్ బురీ (చాలా ఘోరంగా) ఉంది` అని పంచ్ విసిరినట్లు కరణ్ గుర్తుచేసుకున్నారు.

రణ్‌వీర్ సింగ్, కరీనా కపూర్, ఫరా ఖాన్, మనీష్ మల్హోత్రా, ఉర్మిళా మటోండ్కర్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ పోస్ట్‌పై స్పందించి యష్ జోహార్‌ను స్మరించుకున్నారు. ముఖ్యంగా దర్శకురాలు ఫరా ఖాన్ కామెంట్ ఓ కామెంట్ చేసారు `ఆయన ఎప్పుడూ అత్యుత్తమమైన వ్యక్తి. ఒకవేళ ఆయన ఈరోజు బ్రతికి ఉంటే నీ ఇప్పటి విచిత్రమైన అవుట్‌ఫిట్స్ (దుస్తులు) చూసి ఏమనేవారో అని నేనెప్పుడూ ఆలోచిస్తుంటాను` అంటూ ఫన్నీగా రాసుకొచ్చారు.

ఈ సరదా జ్ఞాపకాలతో పాటు, తండ్రి జీవితంలో చివరి రోజులను కూడా కరణ్ భావోద్వేగంగా పంచుకున్నారు. వెంటిలేటర్‌పై ఉన్న తండ్రి పక్కన ఉన్న క్షణాలను గుర్తుచేసుకున్నారు. తన తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటానని మాట ఇచ్చానని తెలిపారు. ఎంత ఎదిగినా తన తండ్రి అందించిన ప్రోత్సాహం, చూపించిన ప్రేమే తనను ఈ స్థాయిలో నిలబెట్టాయని కరణ్ ఆవేదన చెందారు.

యష్ జోహార్ 1976లో ధర్మ ప్రొడక్షన్స్ ను స్థాపించారు. దోస్తానా (1980), అగ్నిపథ్ (1990), గుమ్రా(1993), డూప్లికేట్ (1998) వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. 2004లో కన్నుమూసిన తర్వాత ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్‌ను బాలీవుడ్‌లోనే అగ్రగామి సంస్థగా విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.