Begin typing your search above and press return to search.

రా (RAW) వ్యవస్థాపకుడిపై భారీ చిత్రం!

బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.

By:  Srikanth Kontham   |   22 Sept 2026 1:26 PM IST
రా (RAW) వ్యవస్థాపకుడిపై  భారీ చిత్రం!
X

బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. భారత విదేశీ నిఘా సంస్థ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) వ్యవస్థాపకుడు, దిగ్గజ స్పైమాస్టర్ రామేశ్వర్‌నాథ్ కావ్ (ఆర్.ఎన్. కావ్) జీవిత కథ ఆధారంగా ఓ పవర్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. దేశభక్తి నేపథ్యంలో అత్యంత ఆసక్తికరంగా రూపొందనున్న ఈ సినిమా ప్రకటన సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

భారతదేశ భద్రతా రంగంలో ఆర్.ఎన్. కావ్ వహించిన పాత్ర అత్యంత కీలకమైనది. 1968లో రా (RAW) సంస్థను స్థాపించిన ఆయన 1971 భారత-పాకిస్థాన్ యుద్ధం , బంగ్లాదేశ్ ఆవిర్భావంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి దేశానికి చిరస్మరణీయమైన విజయాలను అందించారు. తెరవెనుక ఉండి దేశ రక్షణ కోసం ఆయన నడిపిన సీక్రెట్ ఆపరేషన్లు, నిఘా వ్యూహాలను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ధర్మ ప్రొడక్షన్స్ సన్నాహాలు చేస్తోంది.

ప్రముఖ రచయిత నితిన్ గోఖలే రాసిన ఆర్.ఎన్. కావ్: జెంటిల్‌మన్ స్పైమాస్టర్ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఆర్.ఎన్. కావ్ శూన్యం నుంచి అంతర్జాతీయ స్థాయి నిఘా వ్యవస్థను ఎలా నిర్మించారనేది ఈ పుస్తకంలో సమగ్రంగా వివరించబడింది. అదే ప్రామాణికతతో వెండితెరపై ఆ నిజ జీవిత సంఘటనలను ఆవిష్కరించేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

గతంలో `రాజీ`, `షేర్‌షా` వంటి విజయవంతమైన దేశభక్తి .. థ్రిల్లర్ చిత్రాలను అందించిన ధర్మ ప్రొడక్షన్స్ ఈ బయోపిక్‌ను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. అయితే భారత్‌లో స్పైమాస్టర్‌గా పేరుగాంచిన ఆర్.ఎన్. కావ్ పాత్రను ఏ బాలీవుడ్ స్టార్ నటుడు పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని సంస్థ తెలియజేసింది.

ఇటీవలి కాలంలో భారతీయ సినిమాలో స్పై థ్రిల్లర్ జోనర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. కానీ కేవలం కల్పిత కథలతో కాకుండా `రా` వ్యవస్థాపకుడి నిజమైన జీవిత కథ ఆధారంగా చారిత్రక అంశాలతో రూపుదిద్దుకుంటుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. రాజకీయ చదరంగం, ఇంటెలిజెన్స్ ఆపరేషన్లతో కూడిన పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించి చిత్రీకరణను ప్రారంభించనున్నారు. దక్షిణ ఆసియా భౌగోళిక రాజకీయాలను మార్చివేసిన అజ్ఞాత వీరుడి కథను వెండితెరపై చూడటానికి సినీ ప్రియులు, చరిత్రకారులు అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.