Begin typing your search above and press return to search.

వార‌సుల‌ను మేక‌ప్ హెయిర్ డిజైన‌ర్ల‌ను చేస్తాడ‌ట‌

ప‌రిశ్ర‌మ‌లో మేక‌ప్ ఆర్టిస్టులు, హెయిర్ డిజైన‌ర్లు ఒక రోజుకు ఎంత సంపాదిస్తారు? డిజైన‌ర్ రేంజును బ‌ట్టి, ఏ స్టార్ ద‌గ్గ‌ర ప‌ని చేస్తున్నారు? అనేదానిని బ‌ట్టి ప్ర‌తిదీ మారుతుంది.

By:  Sivaji Kontham   |   6 Oct 2025 9:36 AM IST
వార‌సుల‌ను మేక‌ప్ హెయిర్ డిజైన‌ర్ల‌ను చేస్తాడ‌ట‌
X

ప‌రిశ్ర‌మ‌లో మేక‌ప్ ఆర్టిస్టులు, హెయిర్ డిజైన‌ర్లు ఒక రోజుకు ఎంత సంపాదిస్తారు? డిజైన‌ర్ రేంజును బ‌ట్టి, ఏ స్టార్ ద‌గ్గ‌ర ప‌ని చేస్తున్నారు? అనేదానిని బ‌ట్టి ప్ర‌తిదీ మారుతుంది. ప్ర‌భాస్ లాంటి పెద్ద స్టార్ ద‌గ్గ‌ర ట‌చ‌ప్ బోయ్ రోజుకు రూ.3000- రూ.5000 అందుకుంటాడు. మేక‌ప్ మేన్, హెయిర్ డిజైన‌ర్ రేంజు ఎలా ఉంటుందో దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. ల‌క్ష‌ల్లో పారితోషికాల్ని వారు అందుకుంటున్నారు.

అయితే ఇది బాలీవుడ్ అగ్ర నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ని చాలా వెంటాడుతోంది. సినిమాల నిర్మాణ బ‌డ్జెట్ విప‌రీతంగా పెరిగిపోయింద‌ని, స్టార్ల సోకులు, గొంతెమ్మ కోర్కెల‌కు ఖ‌ర్చు అదుపు త‌ప్పిపోవ‌డంతో నిర్మాణం భారంగా మారింద‌ని క‌ర‌ణ్ జోహార్ చాలాసార్లు బ‌హిరంగంగా విమ‌ర్శించారు. ఒక్కో స్టార్ 15 మంది అసిస్టెంట్ల‌ను నియ‌మించుకుని నిర్మాత‌ను జీతాలు చెల్లించాల‌ని డిమాండ్ చేసిన రోజుల‌ను క‌ర‌ణ్ మ‌ర్చిపోలేదు. అత‌డు ప్ర‌తిసారీ ఇలాంటి విష‌యాల‌ను గుర్తు చేస్తూ సెటైర్లు వేస్తుంటారు.

ఇప్పుడు మేక‌ప్, హెయిర్ డిజైనింగ్ డిపార్ట్ మెంట్ లో భారీ పారితోషికాల‌పైనా అత‌డు త‌న‌దైన శైలిలో సెటైర్ వేసారు. తాను త‌న పిల్ల‌లను న‌టులు కావాల‌ని కోర‌న‌ని చెప్పాడు. మేకప్, హెయిర్ డిజైన‌ర్లు కావాల‌ని కోరుకుంటున్న‌ట్టు తెలిపాడు. రూహి, య‌ష్ పెరిగి పెద్ద‌వార‌వుతున్నారు.. వారు ఎలాంటి కెరీర్ కావాల‌నుకుంటున్నారు? అన‌డిగితే క‌ర‌ణ్ ఇలా స్పందించారు. ప‌రిశ్ర‌మ‌కు ఎంద‌రో న‌ట‌వార‌సుల‌ను ప‌రిచ‌యం చేసిన క‌ర‌ణ్ చాలామంది ఔట్ సైడ‌ర్స్ కి కూడా లైఫ్ ఇచ్చారు. ఆలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా వంటి నెపో కిడ్స్ ని ప‌రిచ‌యం చేసి చాలా విమ‌ర్శ‌ల్ని కూడా ఎదుర్కొన్నాడు.

అందుకే నేపోకిడ్ విమర్శ‌ల‌ను ఎదుర్కోకుండా ఇలా మాట్లాడుతున్నాడా? అనే సందేహం ఉంది. అత‌డు అదుపుత‌ప్పిన ప్రొడ‌క్ష‌న్ కాస్ట్ కి అన్ని శాఖ‌ల్లో పెరిగిన పారితోషికాల గురించి ప్ర‌స్థావిస్తున్నాడ‌ని ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నారు. నిర్మాత‌ల‌కు స్టార్లు చుక్క‌లు చూపిస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్లు హీరోల‌కు త‌క్కువ కాకుండా పారితోషికాలు డిమాండ్ చేస్తున్నారు. 24 శాఖ‌ల్లో పారితోషికాల ప‌రంగా ఎవరూ త‌గ్గ‌డం లేద‌ని అత‌డు భావిస్తున్నాడు. అందుకే పిల్ల‌ల కెరీర్ పేరుతో అత‌డు ఇండ‌స్ట్రీపై మ‌రోసారి త‌న‌దైన శైలిలో పంచ్ వేసాడు.

రూహి, యష్ మేకప్ -హెయిర్ ఆర్టిస్టులుగా మారాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు ఇతరుల కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు.. అని క‌ర‌ణ్ అన్నారు. స్టార్ల సిబ్బంది బడ్జెట్‌లపైనా కరణ్ ప్రస్తావించారు. నిర్మాత‌ ఆర్థిక సమస్యల కంటే నైతిక సమస్యల గురించి మాట్లాడారు. ఎక్కువ‌మంది సిబ్బందిని నియ‌మించుకుంటే వారికి స్టార్లు విధిగా చెల్లించుకోవాల‌ని కూడా క‌ర‌ణ్ సూచించారు. స్టార్ల‌తో 6-8 మంది అసిస్టెంట్లు ఎందుకు అవసరం? అని కూడా ప్ర‌శ్నించారు. తార‌లు భారీ పారితోషికాలు సంపాదిస్తున్నట్లయితే వారు తమంతట తాముగా అదనపు ఖర్చులను మేనేజ్ చేయాల‌ని కూడా క‌ర‌ణ్ అన్నారు.

రూహి, య‌ష్ ల‌ను స‌రోగ‌సీ ద్వారా స్వాగ‌తించిన క‌ర‌ణ్ సింగిల్ పేరెంట్ గా వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు. అతడి తల్లి హిరూ జోహార్ వారిని పెంచడానికి సహాయం చేస్తున్నారు. సింగిల్ పేరెంట్ గా త‌న అనుభ‌వాల‌ను క‌ర‌ణ్ చాలాసార్లు గుర్తు చేసుకున్నారు.