వ్యాపారం కోసమే ఇండస్ట్రీలో ఉన్నాను.. అగ్ర నిర్మాత!
ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ ఇటీవల చాలా విషయాలను మీడియా ఎదుట బహిరంగంగా మాట్లాడుతున్నారు.
By: Sivaji Kontham | 9 Oct 2025 6:00 AM ISTధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ ఇటీవల చాలా విషయాలను మీడియా ఎదుట బహిరంగంగా మాట్లాడుతున్నారు. నటవారసులను తెరకు పరిచయం చేస్తూ, ప్రతిభావంతులైన బయటి వ్యక్తులను దూరం పెడుతున్నాడని, గ్రూపులతో బంధుప్రీతిని ప్రోత్సహించారని ఆరోపణలు వచ్చాయి. బంధుప్రీతిపై వివరణ ఇస్తూ, పరిశ్రమలో స్నేహాలు పూర్తిగా వ్యాపార ఆధారితమైనవి. ఆర్థిక విషయాలలో ఎవరూ రాజీ పడటానికి ఇష్టపడరని కూడా ఆయన పరోక్షంగా పేర్కొన్నారు.
తన యూట్యూబ్ ఛానల్ గేమ్ ఛేంజర్స్‌లో ఫిల్మ్ ట్రేడ్ విశ్లేషకుడు కోమల్ నహ్తా ఇంటర్వ్యూలో కరణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. నటులు ఎప్పుడూ నిర్మాతలతో నష్టాలను పంచుకోవడానికి ఇష్టపడరని, పారితోషికాలు వసూలు చేయడంలో మాత్రమే ఆసక్తి చూపుతున్నారని కరణ్ ఎత్తి చూపారు. స్నేహాలు పార్టీలకే పరిమితం అని కూడా ఆయన పేర్కొన్నారు.
నా గత రెండు సినిమాలు సరిగా ఆడలేదు. కాబట్టి నేను మీ డబ్బును తిరిగి ఇస్తున్నాను అని ఏ నటుడు అనలేదు! అని కరణ్ వివరించారు. ఎవరూ డబ్బు తిరిగి ఇవ్వడానికి ఆసక్తి చూపరు.. ఎవరైనా ఇస్తే తీసుకుంటారు .. నా (వృత్తిపరమైన) జీవితంలో స్నేహితులు నాకు ఎప్పుడూ ప్రయోజనం చేకూర్చలేదు. అందరూ వ్యాపారం చేసేవాళ్లే.. నేను కూడా వ్యాపారం కోసం పరిశ్రమలో ఉన్నాను.. దాతృత్వం కోసం కాదు! అని కరణ్ అన్నారు.
