హక్కుల పోరాటం: స్టార్ కపుల్ తర్వాత డైరెక్టర్ విజయం
ఒకరి పేరు, ఫోటో, గుర్తింపును అనుమతి లేకుండా ఉపయోగించుకుని తమ ఉత్పత్తులకు ప్రచారం చేసుకోవాలంటే ఇకపై కుదరదు.
By: Sivaji Kontham | 18 Sept 2025 10:00 AM ISTఒకరి పేరు, ఫోటో, గుర్తింపును అనుమతి లేకుండా ఉపయోగించుకుని తమ ఉత్పత్తులకు ప్రచారం చేసుకోవాలంటే ఇకపై కుదరదు. ఎవరైనా సెలబ్రిటీ ఫోటోలు, వారి వాయిస్ ని కానీ, ఐడెంటిటీని కానీ ఉపయోగించుకుని అశ్లీల పంథాలో దుర్వినియోగం చేస్తూ, తమ ఉత్పత్తికి ప్రచారం చేసుకోవాలని చూసినా దాని పర్యవసానం తీవ్రంగా ఉంటుందని ఇటీవలి దిల్లీ హైకోర్టు తీర్పులు సంచలనంగా మారాయి. ఆన్ లైన్ సామాజిక మాధ్యమాలకు ఇప్పుడు ఇష్టానుసారం ప్రవర్తించకుండా ముకుతాడు వేసేందుకు ఈ తీర్పు పని చేయనుంది.
ఇంతకుముందు తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న, హక్కులు కాలరాస్తున్న పలు వెబ్ సైట్లు, సామాజిక పోస్టులు, డిజిటల్ మాధ్యమాలపై ప్రముఖ సెలబ్రిటీ కపుల్ ఐశ్వర్యారాయ్- అభిషేక్ బచ్చన్ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. తమ పేరు, ఫోటోలు, వీడియోలు సహా గుర్తింపును తప్పుడు విధానంలో తమ అనుమతి లేకుండా ఉత్పత్తుల పబ్లిసిటీ కోసం ఉపయోగించుకుంటున్నారని ఈ జంట కోర్టు కెక్కింది. ఈ కేసును విచారించిన దిల్లీ హైకోర్టు వారి హక్కులను కాపాడుకునేందుకు అనువుగా తీర్పును వెలువరించింది. వారి ఐడెంటిటీని తప్పుగా వాడుతున్న పలు వెబ్ సైట్లు, డిజిటల్ మాధ్యమాలు సహా వ్యక్తులకు సమన్లు జారీ చేసింది. వ్యక్తిత్వ హక్కులను కాపాడుకోవాలనే పోరాటంలో ఐష్- అభిషేక్ విజయాలు సాధించడంతో ఇప్పుడు అదే బాటలో ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ కూడా దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దావా ప్రకారం.. వాణిజ్య ప్రయోజనాల కోసం తన పేరును, ఫోటోను అనధికారికంగా ఉపయోగించడం గురించి కరణ్ జోహార్ ఆందోళన వ్యక్తం చేశారు.
జోహార్ తన వ్యక్తిత్వం, ప్రచార హక్కులను కాపాడుకోవాలనే తన పిటిషన్‌లో ఢిల్లీ హైకోర్టు నుండి మధ్యంతర ఉపశమనం పొందనున్నారు. కోర్టు అనుకూలంగా ఒక ఉత్తర్వు జారీ చేయనుంది. ఆన్‌లైన్ డిజిటల్ వేదికలు, వెబ్‌సైట్‌లకు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. సోషల్ మీడియాల్లో ప్రచారం చేసే వారికి కూడా సమన్లు అందేలా కోర్టు వివరాల సేకరణ కోసం అధికారులను ఆదేశించింది. ఐటీ లాగ్ వివరాలను షేర్ చేయాలని సోషల్ మీడియా మధ్యవర్తులను కోరింది. వ్యాపార సంస్థలు లాభం కోసం అనుమతి లేకుండా తన పేరు, ఫోటో, వ్యక్తిత్వం, పోలికను ఉపయోగిస్తున్నాయని కోర్టుకు కరణ్ చెప్పారు. తన ఫోటోను తప్పుదారి పట్టించే లేదా అశ్లీలంగా ఉపయోగించారని కూడా ఆధారాలు చూపించారు. దుర్వినియోగం, వంచన, నకిలీ ప్రొఫైల్‌లు వంటి సమస్యలున్నాయని ఆరోపించారు. పలు వెబ్ సైట్లు తన ఫోటో ఉన్న మగ్గులు, టీ-షర్టుల వంటి ఉత్పత్తులను విక్రయించకుండా ఆపాలని కూడా అతను కోర్టును కోరాడు.
