స్టార్ మేకర్‌కి ఏం అయ్యింది?
బాలీవుడ్ గత కొన్ని సంవత్సరాలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కరోనా తర్వాత తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 6 Aug 2025 12:59 PM ISTబాలీవుడ్ గత కొన్ని సంవత్సరాలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కరోనా తర్వాత తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన ఎన్నో సినిమాలను అందించిన బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ నుంచి ఈ మధ్య కాలంలో హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువగా వచ్చాయి. కరణ్ జోహార్ గతంలో ఎంతో మంది హీరో, హీరోయిన్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆయన బ్యానర్‌లో సినిమా అంటే ఖచ్చితంగా మంచి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు వస్తాయని ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కరణ్ జోహార్ బ్యానర్ మూవీ అంటే పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. జనాల్లో మెల్ల మెల్లగా ధర్మ ప్రొడక్షన్స్ సినిమాలపై ఉన్న బజ్ తగ్గుతూ వస్తుంది.
కరణ్ జోహార్ సినిమాలపై నెగిటివ్ టాక్
కరణ్ జోహార్ దర్శకత్వంలో సినిమా వచ్చినా కూడా జనాలు ఇప్పుడు పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకప్పుడు కరణ్ జోహార్ సినిమా అంటే మంచి ప్రేమ కథ చిత్రాలు గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆయన ఫ్లాప్ సినిమాలు ఎక్కువగా గుర్తుకు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆయన పై ఈ మధ్య విపరీతమైన నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. కరణ్ జోహార్ ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాలను తీయడం లేదు, ఆయన కథల ఎంపిక విషయంలోనూ చాలా తప్పుడు నిర్ణయాలు ఉంటున్నాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా కరణ్ జోహార్ ఒక యాక్షన్ మూవీని తీయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకు సంబంధించి ఒక స్క్రిప్ట్‌ను ఎంపిక చేసుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా దర్శకత్వ బాధ్యతలను మరో దర్శకుడికి అప్పగించి కేవలం నిర్మాణం చూసుకుంటున్నాడు.
ధడక్ 2 విషయంలో నిరాశ
హీరో, హీరోయిన్స్ చాలా మంది ఇప్పటికీ కరణ్ జోహార్ అడిగితే ఎన్ని డేట్లు అంటే అన్ని డేట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. కానీ ఆయన మాత్రం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉన్నాడు. అయినా కూడా ఆయన బ్యానర్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌లుగానే నిలుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన ధడక్ 2 సినిమా ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని అంతా భావించారు. కానీ ధడక్ 2 సినిమా కనీసం మొదటి సినిమా స్థాయిలో కూడా ఆడలేదు. సినిమాలో ప్రముఖ నటీ నటులు ఉన్నప్పటికీ మంచి కాన్సెప్ట్ అయినప్పటికీ దాన్ని తీసిన విధానం సరిగా లేదని చాలా మంది రివ్యూలు ఇచ్చారు.
ధర్మ ప్రొడక్షన్ లో పెద్ద సినిమాలు
కరణ్ జోహార్ వంటి స్టార్ ఫిల్మ్ మేకర్, స్టార్స్ క్రియేటర్ ఈ మధ్య కాలంలో సినిమాల ఎంపిక విషయంలో విఫలం కావడంతో ఆయన అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో సినిమాలు కూడా వచ్చే పరిస్థితి ఎక్కువగా కనిపించడం లేదు. ఈ మధ్య కాలంలో కరణ్ జోహార్ ఫెయిల్యూర్స్‌కి భయపడి సినిమాలను తగ్గించాడు అనే విమర్శలు వస్తున్నాయి. సుదీర్ఘ చరిత్ర ఉన్న ధర్మ ప్రొడక్షన్స్ పూర్వ వైభవం ను చాటుకోవడం కోసం ఒక్క సినిమా వచ్చినా చాలు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సయ్యారా వంటి ఒక్క మంచి కమర్షియల్ లవ్ స్టోరీ వస్తే ధర్మ ప్రొడక్షన్స్ మళ్లీ పూర్వ ఉత్తేజం ని దక్కించుకుంటుంది అనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు కోసం కరణ్ జోహార్ ను అభిమానించే వారు ఎదురు చూస్తున్నారు.
