కార్పొరెట్ బుకింగులు అనైతికం.. అగ్ర నిర్మాత చీవాట్లు
బుక్ మై షో లేదా ఏదైనా ఆన్ లైన్ టికెటింగ్ ప్లాట్ ఫామ్ ఓపెన్ చేయగానే, కొన్ని వరుసల్లో సీట్లు బుకింగులు అయిపోయినట్టు చూపించడం సినీప్రియులకు నిత్య అనుభవమే.
By: Sivaji Kontham | 6 Oct 2025 4:00 AM ISTబుక్ మై షో లేదా ఏదైనా ఆన్ లైన్ టికెటింగ్ ప్లాట్ ఫామ్ ఓపెన్ చేయగానే, కొన్ని వరుసల్లో సీట్లు బుకింగులు అయిపోయినట్టు చూపించడం సినీప్రియులకు నిత్య అనుభవమే. నిజానికి అమ్ముడుపోని సీట్లు (సోల్డ్ ఔట్ చూపించేవి) ఏవో ఆన్ లైన్ టికెటింగ్ లో ముందే తెలిసిపోతోంది. అయినా కార్పొరెట్ బుకింగ్స్ పేరుతో కొన్ని సీట్లను అలానే దాచి ఉంచుతున్నారు. వీటిని ముందే ఆ సినిమాని నిర్మించిన నిర్మాత లేదా హీరో అడ్వాన్సుగా డబ్బు చెల్లించి బుక్ చేస్తారనేది అందరికీ తెలిసిన వాస్తవం.
తమ సినిమాలకు కృత్రిమ హైప్ క్రియేట్ చేసేందుకు, ఈ సినిమా ఎంతో గొప్పగా ఉందని భ్రమింపజేసేందుకు ఇలా చేస్తారని ఇప్పటికే సాధారణ ప్రజలకు కూడా అవగాహన వచ్చేసింది. అయినా `పాలు తాగుతూ పిల్లి తనను ఎవరూ చూడలేద`ని భావించినట్టే ఈ కార్పొరెట్ బుకింగులకు పాల్పడే వ్యక్తులు కూడా భ్రమల్లోనే ఉన్నారు.
ఒక సినిమా చెత్త సినిమానా మంచి సినిమానా? అనేది తేల్చేది ప్రేక్షకుల మౌత్ టాక్. వారు బయటకు రాగానే యూట్యూబ్ చానెళ్లలో ఆ సినిమా గొప్పతనం లేదా లోపాల గురించి లైవ్ లోనే చెబుతున్నారు. ఇక్కడ కూడా పెయిడ్ మాఫియాలు ఉన్నాయి కాబట్టి జెన్యూన్ టాక్ ఏమిటన్నది కనిపెట్టడం ఇటీవల కష్టంగా మారింది. కానీ సినిమా చూసి వచ్చిన ఏ వ్యక్తి అయినా ఈ సినిమా చూడాలా వద్దా కచ్ఛితంగా తన సహచరుడికి పక్కింటోళ్లకు నిజాయితీగా చెప్పి తీరతాడు. ఇలాంటి కార్పొరెట్ బుకింగులు లేదా సెల్ఫ్ బుకింగులతో థియేటర్లలో సీట్లలో సగం ముందే నిండిపోయాయని భ్రమింపజేయాలనుకోవడం మూర్ఖత్వం.
ఇప్పుడు బాలీవుడ్ అగ్ర దర్శకనిర్మాత కరణ్ జోహార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఇలాంటి తప్పుడు సమాచార వ్యాప్తి ద్వారా సినిమా విజయం సాధించదని ఆయన ఆందోళన చెందారు. కార్పొరెట్ బుకింగులు, సెల్ఫ్ బుకింగులు అనేవి ఇండస్ట్రీలో ఉన్నాయని, ఇది చెత్త కల్చర్ అని కూడా కరణ్ జోహార్ విమర్శించారు. అర్థం పర్థం లేని ఇలాంటి తప్పుడు టెక్నిక్ లు ఉపయోగిస్తే అసలుకే మోసం వస్తుందని కూడా హెచ్చరించారు. టికెట్ల అమ్మకాలలో తాత్కాలిక పెరుగుదల కనిపించినా కానీ, ఇది శాశ్వతం కాదని అభిప్రాయపడ్డారు. అయినా నిర్మాతలే సొంత డబ్బు పెట్టి టికెట్లు కొనుక్కోవడం ఏమిటి? ఇంతకంటే చెత్తపని మరొకటి ఉండదని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి చెత్త టెక్నిక్ లతో సినీపరిశ్రమలకు చెడ్డ పేరు తెస్తున్నారని కూడా పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి అనైతిక పద్ధతులు సినిమాలను నాశనం చేస్తాయని అన్నారు. అంతిమంగా ప్రజలు సినిమా బావుంటే ఆదరిస్తారు.. బాగోకపోతే లైట్ తీస్కుంటారని కూడా విశ్లేషించారు.
