నెపోటిజం- మాఫియా కామెంట్లపై నిర్మాత సీరియస్!
స్వేచ్ఛను సద్వినియోగం చేయకుండా, వాక్ స్వాతంత్య్రం ముసుగులో విషాన్ని వ్యాప్తి చేస్తున్నారని జ్యోతిష్కులు, పాడ్ కాస్టర్లపై విరుచుకుపడ్డారు అగ్ర నిర్మాత కరణ్ జోహార్.
By: Sivaji Kontham | 24 Aug 2025 5:00 PM ISTస్వేచ్ఛను సద్వినియోగం చేయకుండా, వాక్ స్వాతంత్య్రం ముసుగులో విషాన్ని వ్యాప్తి చేస్తున్నారని జ్యోతిష్కులు, పాడ్ కాస్టర్లపై విరుచుకుపడ్డారు అగ్ర నిర్మాత కరణ్ జోహార్. పాడ్ కాస్టర్లు కొత్త తరపు భాషను ఉపయోగిస్తూ, అసలు పరిశ్రమకు సంబంధం లేని అతిథులను లైవ్ లకు పిలిచి ఇష్టానుసారం విషం కక్కుతున్నారని కరణ్ విమర్శించారు. అంతేకాదు జ్యోతిష్కులు, మానసిక నిపుణులు ప్రజలను మరణం పేరుతో భయపెడుతూ భయానక విషయాలను వెల్లడించడం అసహ్యకరమైనదని దుయ్యబట్టారు. రెండో ప్రపంచ యుద్ధం నుండి సంబంధం లేని అతిథులను లైవ్ కార్యక్రమాలకు పిలుస్తున్నారని, వారంతా పరిశ్రమ సోదరభావంపై విషం కక్కుతారని విమర్శించారు. క్లిక్ లు, లైక్ ల కోసం పాకులాటలో ఇదంతా చేస్తారని అన్నారు.
ఇటీవలి కాలంలో పాడ్ కాస్టర్ల అతి గురించి చాలా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సినీపరిశ్రమలో నెపోటిజం , మాఫియా గురించి మాట్లాడుతుంటే అది కరణ్ జోహార్ లాంటి ప్రముఖులకు నచ్చడం లేదని కూడా విమర్శలు వచ్చాయి. కరణ్ తనను అంటున్నారనే ఈ రోజు ఇలా విరుచుకుపడ్డారా? అంటే.. దానికి ప్రస్తుతానికి స్పష్ఠత లేదు.
ఇటీవల కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ లో మెజారిటీ వాటాను విక్రయంచారు. ఆ తర్వాత పరిమిత బడ్జెట్ సినిమాలకు మాత్రమే అతడు అండగా నిలుస్తున్నాడు. సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి దిమ్రీ జంటగా నటించిన ధడక్ 2 ని కరణ్ నిర్మించారు. మూడు దశాబ్ధాల కెరీర్ లో నిర్మాతగా కరణ్ తాను సాధించిన దాని గురించి ఏనాడూ మాట్లాడలేదు. కానీ ఇటీవల ఆయన వేదికలపై ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు. కుచ్ కుచ్ హోతా హై మొదలు రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ వరకు కరణ్ ఎన్నో అద్భుత చిత్రాలను నిర్మించారు. పరిశ్రమ దిగ్గజ నిర్మాతగా, దర్శకుడిగా ఆయన విలువైన పాఠాలను కూడా నవతరానికి బోధిస్తున్నారు. కానీ తనను కావాలని అంటున్న వారిపై అప్పుడప్పుడు చురకలు వేస్తూనే ఉన్నారు.
