ధనుష్ 'కర' మూవీ.. ఆ బ్యాక్ డ్రాప్ క్లిక్ అవుతుందా?
ముఖ్యంగా బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని వరుస దోపిడీలు చేస్తూ కనిపిస్తాడు. కరస్వామి ఎందుకు అలా చేస్తున్నాడు?
By: M Prashanth | 26 April 2026 3:00 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కర విడుదలకు సిద్ధమవుతోంది. మమితా బైజు హీరోయిన్ గా నటించిన ఆ సినిమాను డా. ఇషారి, కె. గణేష్ నిర్మించగా, విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ సంస్థలు కలిసి ఆ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఏప్రిల్ 30న ఆ సినిమా గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తి పెంచింది.
అయితే టీజర్ ను చూస్తే.. కర మూవీ పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కినట్టు స్పష్టమవుతోంది. ఇందులో ధనుష్ కరస్వామి అనే పాత్రలో కనిపించనున్నారు. ఓ పల్లెటూరికి చెందిన యువకుడైన కరస్వామి మొదట దొంగగా జీవిస్తాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ జీవితం మానేసి తిరిగి తన ఊరికి వస్తాడు. కానీ పరిస్థితులు మారిపోవడంతో మళ్లీ దొంగతనాల మార్గంలోకి వెళ్లాల్సి వస్తుంది.
ముఖ్యంగా బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని వరుస దోపిడీలు చేస్తూ కనిపిస్తాడు. కరస్వామి ఎందుకు అలా చేస్తున్నాడు? చివరికి కథ ఎటువైపు తిరుగుతుంది? అన్న అంశాలు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. అయితే టీజర్ ఆధారంగా చూస్తే కర మూవీ కథ స్టువర్టుపురం బ్యాక్ డ్రాప్ తో ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో స్టువర్టుపురం గ్రామం ఉందన్న విషయం తెలిసిందే.
అక్కడి గజదొంగల జీవితం ఆధారంగా ఇప్పటికే టాలీవుడ్ లో అనేక సినిమాలు వచ్చాయి. అయితే ఆ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాల ఫలితాలు భిన్నంగా ఉండటం గమనార్హం. 1991లో విడుదలైన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించినప్పటికీ, భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. అదే ఏడాది విడుదలైన స్టువర్టుపురం దొంగలు మాత్రం మంచి విజయాన్ని సాధించింది.
భానుచందర్ హీరోగా నటించిన ఆ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుని హిట్‌గా నిలిచింది. ఇటీవల కాలంలో కూడా ఆ బ్యాక్ డ్రాప్ తో కొన్ని సినిమాలు వచ్చాయి. 2023లో విడుదలైన రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా మిశ్రమ స్పందనను అందుకుంది. 2019లో వచ్చిన స్టువర్టుపురం అనే చిన్న సినిమా కూడా ప్రేక్షకులపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
దీంతో ఇప్పుడు కర మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రేక్షకుల ఆలోచనా విధానం మారుతున్న నేపథ్యంలో.. స్టోరీ నెరేషన్, ఎమోషన్స్, మేకింగ్ స్టైల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి కేవలం బ్యాక్ డ్రాప్ తో కాకుండా, కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే కర హిట్ అవ్వడం ఖాయమని చెప్పాలి. మొత్తానికి కర సినిమాకు స్టువర్టుపురం తరహా బ్యాక్ డ్రాప్ ఎంతవరకు కలిసివస్తుందో చూడాలి. ధనుష్ నటన, దర్శకుడి మేకింగ్, కథ.. అన్నీ కలిసొస్తే చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకునే అవకాశం ఉంది.
