Begin typing your search above and press return to search.

మ‌ధ్య‌వ‌ర్తి ప్రవేశంతో 30,000 కోట్ల ఆస్తి వివాదంలో కీల‌క మ‌లుపు!

ఒక‌ప్పుడు కుటుంబంలో ఏదైనా గొడ‌వ ముదిరితే ఇంటి పెద్ద దానిని గుట్టు చ‌ప్పుడు కాకుండా ప‌రిష్క‌రించేవారు. అన్ని కుటుంబాల్లోను గొడ‌వ‌లుంటాయి. కానీ ప‌రిష్క‌రించేందుకు ఒక పెద్ద ఉండేవారు. కానీ ఇప్పుడున్న కుటుంబ అవ్య‌వ‌స్థ‌లో పెద్ద‌రికాల్లేవ్.

By:  Sivaji Kontham   |   8 May 2026 10:00 PM IST
మ‌ధ్య‌వ‌ర్తి ప్రవేశంతో 30,000 కోట్ల ఆస్తి వివాదంలో కీల‌క మ‌లుపు!
X

ఒక‌ప్పుడు కుటుంబంలో ఏదైనా గొడ‌వ ముదిరితే ఇంటి పెద్ద దానిని గుట్టు చ‌ప్పుడు కాకుండా ప‌రిష్క‌రించేవారు. అన్ని కుటుంబాల్లోను గొడ‌వ‌లుంటాయి. కానీ ప‌రిష్క‌రించేందుకు ఒక పెద్ద ఉండేవారు. కానీ ఇప్పుడున్న కుటుంబ అవ్య‌వ‌స్థ‌లో పెద్ద‌రికాల్లేవ్. ఎవ‌రికి వారే పెద్ద‌లు. ఆస్తి త‌గాదాలు లేదా ప్రెస్టేజ్ గొడ‌వ‌లతో కుటుంబం రోడ్డున ప‌డ‌టం, ఆపై కోర్టుకెక్క‌డం ష‌రామామూలే! ఇటీవ‌ల క‌పూర్ ఫ్యామిలీ 30వేల కోట్ల ఆస్తి వివాదం కూడా ఇదే తీరుగా సాగుతోంది. సంజ‌య్ క‌పూర్ మూడో భార్య‌కు వ్య‌తిరేకంగా రెండో భార్య‌, తల్లి పోరాటం సాగిస్తుండ‌టంతో ఇది కీల‌క మ‌లుపు తిరిగింది. ఇప్పుడు ఈ స‌మ‌స్య‌ను కోర్ట్ రూమ్ లో కాకుండా రోడ్డున ప‌డాల్సిన ప‌ని లేకుండా ఒక పెద్ద ప‌రిష్క‌రించేందుకు నియ‌మితుల‌య్యారు. ఈ పెద్ద‌ను నియ‌మించింది మాత్రం కోర్టు! పూర్తి వివ‌రాల్లోకి వెళితే....

పారిశ్రామికవేత్త, నటుడు, నిర్మాతగా సుపరిచితుడైన దివంగత సంజయ్ కపూర్ ఆస్తి వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. సుమారు 30,000 కోట్ల విలువైన ఆస్తులు- ఫ్యామిలీ ట్రస్ట్ నియంత్రణపై గత కొంతకాలంగా సంజయ్ తల్లి రాణి కపూర్ - మూడో భార్య ప్రియా సచ్‌దేవ్ కపూర్ మధ్య తీవ్రమైన న్యాయపోరాటం సాగుతోంది. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్‌ను ఈ కేసులో మధ్యవర్తిగా నియమిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయ‌స్థాన‌ బెంచ్ అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం 80 ఏళ్ల వయస్సులో ఉన్న సంజయ్ తల్లి రాణి కపూర్‌ను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానిస్తూ ..ఈ వయస్సు పోరాడటానికి సరైనది కాద‌ని హితవు పలికింది. అలాగే ఈ వివాదం ఇతరులకు ఒక వినోదంగా మారకూడదని.. ఇది పూర్తిగా ఒక కుటుంబానికి సంబంధించిన అంతర్గత విషయమని కోర్టు స్పష్టం చేసింది. వివాదంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని..దా బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని ఇరు పక్షాలను కఠినంగా ఆదేశించింది.

వివాద నేపథ్యాన్ని పరిశీలిస్తే... అక్టోబర్ 2017లో రాణి కపూర్ పేరు మీద స్థాపించిన ఫ్యామిలీ ట్రస్ట్ నిర్వహణపై ప్రధాన విభేదాలు తలెత్తాయి. సదరు ట్రస్ట్ ఫోర్జరీ చేసిన.. నకిలీ పత్రాల ఆధారంగా ఏర్పడిందని... కావున దానిని చెల్లనిదిగా ప్రకటించాలని రాణి కపూర్ కోర్టును ఆశ్రయించారు. కేసు తేలే వరకు ట్రస్ట్ ఆస్తులను బదిలీ చేయడం లేదా విక్రయించడం వంటివి చేయకుండా యధాతథ స్థితిని కొనసాగించాలని అభ్యర్థించారు. అటు ఢిల్లీ హైకోర్టులోనూ ఆస్తుల పంపకాలపై ఇప్పటికే చట్టపరమైన పోరాటం పెండింగ్‌లో ఉండటం పరిస్థితి సంక్లిష్టతను తెలియజేస్తోంది.

మరోవైపు.. ఈ వివాదంలో సంజయ్ కపూర్ మాజీ భార్య, బాలీవుడ్ స్టార్ నటి కరిష్మా కపూర్ పిల్లలు కూడా భాగస్వాములయ్యారు. ప్రియా సచ్‌దేవ్ సంజయ్ విల్లును ఫోర్జరీ చేసిందని వారు తీవ్రమైన ఆరోపించారు. ఇటీవల ఈ కేసులో కరిష్మా పిల్లలకు కోర్టు మధ్యంతర ఊరటనిస్తూ... సంజయ్ కపూర్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. దీనివల్ల కరిష్మా కపూర్ వర్సెస్ ప్రియా కపూర్ మధ్య వైరం మరింత ముదిరినట్లయింది. ఈ ఆర్థిక, చట్టపరమైన చిక్కుముడిని విప్పే బాధ్యత ఇప్పుడు మాజీ సీజేఐ చంద్రచూడ్‌పై ఉంది.

ప్రస్తుతం ఏప్రిల్ 27న కోర్టు చేసిన మధ్యవర్తిత్వ ప్రతిపాదనకు ఇరు పక్షాల తరపు న్యాయవాదులు అంగీకరించారు. మాజీ సీజేఐ చంద్రచూడ్ ఇచ్చే ప్రాధమిక నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఆగస్టు నెలలో చేపట్టనుంది. బాహాబాహీ లేకుండా.. పరస్పర చర్చల ద్వారా ఈ భారీ ఆస్తి వివాదానికి స్వస్తి పలకాలని అత్యున్నత న్యాయస్థానం భావిస్తోంది. మరి దేశంలోని అత్యంత ధనిక కుటుంబాలలో ఒకటైన కపూర్ ఫ్యామిలీలో ఈ రాజీ చర్చలు ఎంతవరకు సఫలమవుతాయో వేచి చూడాలి.