Begin typing your search above and press return to search.

RRR త్ర‌యం.. మాట‌ల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్!?

క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో RRR త్ర‌యం- రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి, రాజ్ బి శెట్టి.. ముగ్గురు సోద‌రులు పూర్తిగా ప‌రిశ్ర‌మకే అంకిత‌మై ప‌ని చేస్తున్నారు.

By:  Sivaji Kontham   |   16 Dec 2025 6:00 AM IST
RRR త్ర‌యం.. మాట‌ల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్!?
X

క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో RRR త్ర‌యం- రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి, రాజ్ బి శెట్టి.. ముగ్గురు సోద‌రులు పూర్తిగా ప‌రిశ్ర‌మకే అంకిత‌మై ప‌ని చేస్తున్నారు. త‌మ ప్ర‌తిభ‌తో క‌న్న‌డ చిత్రరంగానికి వారు అందిస్తున్న సేవ‌ల‌పై చాలా ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. కొన్నిసార్లు పుర‌స్కారాల రూపంలో ఈ ప్ర‌తిభావంతులకు త‌గిన గుర్తింపు, గౌర‌వం ద‌క్కాయి.

అయితే ఈ త్ర‌యం గురించి ఇటీవ‌ల‌ క‌న్న‌డ మీడియాలో ఒక గుస‌గుస వినిపిస్తోంది. ఆ ముగ్గురు అన్న‌ద‌మ్ముల న‌డుమ అంత‌గా స‌ఖ్య‌త- యూనిటీ క‌నిపించ‌డం లేదు. ఎవ‌రికి వారే య‌మునా తీరే త‌ర‌హాలో ఉన్నారు. ఒక‌రి విజ‌యాన్ని మ‌రొక‌రు సెల‌బ్రేట్ చేయ‌డం లేదు. కాంతార్ చాప్ట‌ర్ -1 అంత పెద్ద స‌క్సెస్ సాధించినా కానీ, రిష‌బ్ శెట్టి సోద‌రులైన ర‌క్షిత్ కానీ, రాజ్ శెట్టి కానీ అంత‌గా ప్ర‌శంస‌లు కురిపించ‌లేదు. పొడిపొడిగా మాట్లాడి వ‌దిలేసారు. అలాగే సోద‌రుడికి శుభాకాంక్ష‌లు అని చెప్పారు త‌ప్ప అంత‌కుమించి నాలుగు ప్ర‌శంసాపూర్వ‌క మాట‌లు లేవు. ఇది నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రిచే విష‌య‌మ‌ని ఇండియా టుడే త‌న క‌థ‌నంలో పేర్కొంది.

కన్నడ చిత్రం `45` బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ రిషబ్ ఇటీవల విడుదల చేసిన వీడియోలో రాజ్ బి శెట్టి పేరును ప్రస్తావించకపోవడంతో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయనే ఊహాగానాలకు బలం చేకూరింది. ఈ వీడియోలో సినిమా ట్రైలర్‌ను చూసిన రిష‌బ్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇది దర్శకుడిగా అర్జున్ జన్యాకు మొదటి సినిమా. నా తొలి సినిమాకు ఆయనే సంగీతం అందించారు. ప్రతి దర్శకుడికి సినిమా తీసేటప్పుడు చాలా ఆందోళనలు ఉంటాయి.. ఎలాంటి సినిమా తీయాలి.. ఏ జానర్‌లో.. ఏ స్థాయిలో తీయాలి అనే సందేహాలుంటాయి. కానీ ఒక కొత్త ద‌ర్శ‌కుడు ఈ స్థాయి ప్ర‌ణాళిక తో ముందుకు సాగ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ట్రైల‌ర్ చూసాను.. అద్భుతంగా వ‌చ్చింది. 45 చిత్రంలో నా అభిమాన నటులైన శివన్న (శివ రాజ్‌కుమార్), ఉప్పి సర్ (ఉపేంద్ర) నటించారు. ఇద్దరి పాత్రలు చాలా బాగా వచ్చాయి. వారిని వెండితెరపై చూడటం చాలా ఉత్సాహంగా ఉంది.. అని తెలిపారు. అయితే ట్రైల‌ర్ ని పొగిడిన రిష‌బ్, సినిమాలో కీల‌క పాత్ర‌ధారి అయిన‌ త‌న సోద‌రుడు రాజ్.బి. శెట్టి పేరును క‌నీస‌మాత్రంగా ప్ర‌స్థావించ‌లేదు. ఉపేంద్ర‌, శివ‌న్న‌ల‌ను హైలైట్ చేసారు.

రిషబ్ తన వీడియోలో త‌న సోద‌రుడి పేరును ప్రస్తావించకపోవడం ఇప్పుడు రిషబ్, రక్షిత్, రాజ్ మధ్య విభేదాల గురించిన ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. అలాగే ర‌క్షిత్ కి కర్నాట‌క‌ రాష్ట్ర ప్ర‌భుత్వ పుర‌స్కారం ద‌క్కిన‌ప్పుడు అత‌డి సోద‌రులు పొడి పొడిగా మాత్ర‌మే అత‌డికి శుభాకాంక్ష‌లు చెప్పారు.

కాంతార స‌మ‌యంలో ఉన్న సోద‌ర‌భావం, ఇప్పుడు స‌న్న‌గిల్లింది. `కాంతార చాప్ట‌ర్ -1` విజ‌యాన్ని అన్న‌ద‌మ్ములు అంద‌రూ క‌లిసి మ‌న‌స్ఫూర్తిగా సెలబ్రేట్ చేసుకోలేద‌ని కూడా క‌న్న‌డ మీడియాలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కాంతార -1 పాన్ ఇండియాలో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. అయినా రిష‌భ్ సోద‌రులు పొడిపొడిగా మాట్లాడారు. ఈ సినిమాకు బ‌హిరంగంగా ఏనాడూ మ‌ద్ధ‌తు ఇవ్వ‌లేదు. రిషబ్, రక్షిత్ లేదా రాజ్ మ‌ధ్య ఎలాంటి బహిరంగ విభేదాలు, గొడ‌వ‌లు లేదా ప్రత్యక్ష కామెంట్లు లేవు. RRR త్రయం మధ్య సంబంధాలు మునుప‌టి కంటే చేదుగా మారాయనే అభిప్రాయాన్ని ఇది మరింత బలపరుస్తోంది.

రిష‌బ్ సోద‌రుడు రాజ్ బి శెట్టి న‌టుడిగా, ద‌ర్శ‌క‌నిర్మాత‌గాను రాణిస్తున్నారు. ఆల్ రౌండ‌ర్ ప‌నిత‌నం క‌న‌బ‌రుస్తున్నారు. తాజా చ‌త్రం 45 విజ‌యం కోసం అత‌డు చాలా ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నాడు. ఈ స‌మ‌యంలో త‌న సోద‌రుల నుంచి స‌రైన మ‌ద్ధ‌తు క‌నిపించ‌లేదు. మరోవైపు రక్షిత్ తన చివరి చిత్రం `సప్త సాగరదాచే ఎల్లో` విడుదలైన తర్వాత స్వీయ‌ దర్శకత్వంలో `రిచర్డ్ ఆంటోనీ` చిత్రాన్ని ప్రకటించారు. కానీ అప్పటి నుండి ఈ ప్రాజెక్ట్ అప్‌డేట్ ఏమిటో చెప్ప‌లేదు. రిష‌బ్ ప్ర‌స్తుతం కాంతార చాప్ట‌ర్ 1 విజ‌యాన్ని ఆస్వాధిస్తూనే, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో `జై హనుమాన్` చిత్రంలో న‌టిస్తున్నాడు. మరికొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కూడా సంతకం చేశారు.