కాంతర 2 .. ఇంకా మరణాలు ఆగడం లేదు
కాంతార గ్రాండ్ సక్సెస్ తర్వాత రిషబ్ శెట్టి ప్రీక్వెల్ (కాంతార 2) కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 26 Aug 2025 1:38 AM ISTకాంతార గ్రాండ్ సక్సెస్ తర్వాత రిషబ్ శెట్టి ప్రీక్వెల్ (కాంతార 2) కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఏ ముహూర్తాన ప్రారంభమైందో కానీ, కొన్ని వరుస అపశృతులు చిత్రయూనిట్ ని కంగారు పెట్టడం ఆపలేదు. ఇప్పటికే కాంతార ప్రీక్వెల్ కోసం పని చేస్తున్న ఐదుగురు మరణించడం ఫిలింసర్కిల్స్ లో చర్చగా మారింది. ఈ సినిమాకి పని చేసిన రాకేష్ పూజారి, కపిల్, కళాభవన్, ప్రభాకర్ కళ్యాణి మృతి చెందారని కథనాలొచ్చాయి. తాజాగా ఈ సిరీస్ లో మరో మరణం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. కిచ్చా, కిరిక్ పార్టీ, కేజీఎఫ్ వంటి చిత్రాల్లో అద్భుత నటనతో ఆకట్టుకున్న కన్నడ నటుడు, కళా దర్శకుడు దినేష్ మంగళూరు గుండెపోటుతో కన్నుమూశారు. ఉడిపిలోని తన నివాసంలో తెల్లవారుజామున 3:30 గంటలకు తుదిశ్వాస విడిచారని పోలీసులు చెబుతున్నారు.
శోక సంద్రంలో పరిశ్రమ:
అయితే అతడి ఆకస్మిక మరణం కన్నడ ఇండస్ట్రీని శోక సంద్రంలో ముంచెత్తింది. ఈరోజు పరిశ్రమ సహచరుల నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. కేజీఎఫ్ లో బాంబే డాన్ పాత్రలో అతడు నటించాడు. ప్రస్తుతం వరుస చిత్రాలతో అతడు నటుడిగా బిజీగా ఉన్నాడు. కానీ కాంతారా షూటింగ్ సమయంలో దినేష్‌కు స్ట్రోక్ వచ్చింది. బెంగళూరులో చికిత్స పొందిన తర్వాత అతడు మొదట్లో కోలుకున్నట్టు కనిపించినా కానీ, ఇటీవల వారం రోజులుగా అనారోగ్యంగా ఉన్నాడు. దీంతో అతడిని సురేగాన్ ఆసుపత్రిలో చేర్పించారు. మెదడు రక్తస్రావం కారణంగా ఆసుపత్రిలో చేరాడని కొన్నాళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని కూడా కథనాలొచ్చాయి. కానీ అతడు అకస్మాత్తుగా గుండె పోటు కారణంగా మరణించినట్టు మీడియాలో కథనాలు రావడం అందరికీ షాకిచ్చింది. మంగళవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబీకులు తెలిపారు. దినేష్ కన్నడ రంగంలో నటుడిగా, కళా దర్శకుడిగాను గొప్ప పేరు తెచ్చుకున్నారు. 2004 -05లో, శివరాజ్‌కుమార్ నటించిన రాక్షస చిత్రంలో ఆయన చేసిన కృషికి కర్ణాటక రాష్ట్ర ఉత్తమ కళా దర్శకుడి అవార్డును అందుకున్నారు.
కొట్టి పారేసిన నిర్మాతలు..
అయితే అకస్మాత్తుగా ఆర్టిస్టుల మరణాలపై సాగుతున్న చర్చకు చెక్ పెడుతూ నిర్మాత ఇప్పుడు కాంతార ప్రీక్వెల్ షూట్ సమయంలో ఈ సినిమాతో సంబంధం ఉన్న వ్యక్తులు మరణించడం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. అగ్ని ప్రమాదాలు, నదిలో పడవ మునక వంటివి షాకిచ్చాయి. ఇక కాంతార ప్రీక్వెల్ నిర్మాతలు మాత్రం దీనిని కొట్టి పడేస్తున్నారు. ఇదంతా యాథృచ్ఛికం. ప్రచారంలో ఉన్న కొందరితో మాకు ఏ సంబంధం లేదు అని నిర్మాతలు ఇదివరకూ కొట్టి పారేసారు. కొన్ని ప్రమాదాలు జరిగాయి.. కానీ వాటి నుంచి బయటపడ్డారని కూడా తెలిపారు.
అసలేం జరుగుతోంది?
కర్నాటకలోని ఒక గ్రామంలో పురాతన సంస్కృతి- సాంప్రదాయాలు, ఆచారాలపై తెరకెక్కిన `కాంతార` కంటెంట్ కారణంగా విజయం సాధించింది. ఇప్పుడు ప్రీక్వెల్ లో కంటెంట్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుని రిషబ్ తెరకెక్కిస్తున్నారు. కాంతారలో నటించిన పలువురు నటులు చాలా చిన్న వయసులో రకరకాల కారణాలతో మరణించడం ఆశ్చర్యపరిచింది. రాకేష్ పూజారి (36), కపిల్ (32) మేలో చనిపోయారు. జూన్ లో కళాభవన్ మృతి చెందారు. ప్రభాకర్ కళ్యాణి మృతి తర్వాత ఇప్పుడు ఆర్టిస్ట్ దినేష్ మృతి చెందడంతో అసలేం జరుగుతోందో తెలుసుకోవాలని ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ మరణాలు ఆగడం లేదు. దీంతో ఇది మరోసారి చర్చగా మారింది.
