కాంతార, ఓజీ.. లక్కీ ఛాన్స్
ఇక ఈ గురువారం రిలీజైన కాంతార ప్రీక్వెల్‌కు ఆరంభం నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది. శని, ఆదివారాల్లో దేశవ్యాప్తంగా ఈ చిత్రం వసూళ్ల మోత మోగించింది.
By: Garuda Media | 6 Oct 2025 9:26 AM ISTకలిసొచ్చే కాలానికి నడిచొచ్చే వసూళ్లు అని సామెతను మార్చి చెప్పుకోవాలేమో. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న కాంతార: చాప్టర్-1, ఓజీ చిత్రాలకు బాక్సాఫీస్ దగ్గర పూర్తి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. దసరా సెలవులను ఈ రెండు చిత్రాలూ బాగా ఉపయోగించుకున్నాయి. తొలి వీకెండ్లో అదరగొట్టాక.. వీక్ డేస్‌లో వీక్ అయిన ఓజీ సినిమా.. రెండో వీకెండ్లో బలంగా పుంజుకుంది. టికెట్ల ధరలు తగ్గించడం ఆ సినిమాకు ప్లస్ అయింది. ఆదివారం ఏపీ, తెలంగాణల్లో ఓజీకి మంచి వసూళ్లు వచ్చాయి.
ఇక ఈ గురువారం రిలీజైన కాంతార ప్రీక్వెల్‌కు ఆరంభం నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది. శని, ఆదివారాల్లో దేశవ్యాప్తంగా ఈ చిత్రం వసూళ్ల మోత మోగించింది. ఓజీ వసూళ్లు రూ.350 కోట్లను దాటిపోగా.. కాంతార 300 కోట్ల మైలురాయికి చేరువగా ఉంది. ఈ రెండు చిత్రాలకూ ఇంకో వారం రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర ఢోకా లేనట్లే కనిపిస్తోంది. దీపావళి వీకెండ్ వరకు ఏ భాషలోనూ చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం వీటికి ప్లస్ కానుంది.
తెలుగులో రాబోయే శుక్రవారం శశివదనే అనే చిన్న సినిమా మినహాయిస్తే చెప్పుకోదగ్గ రిలీజ్‌లు లేవు. తర్వాతి వారంలో దీపావళి కానుకగా మూణ్నాలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా, ప్రియదర్శి మిత్రమండలి, కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ ప్రదీప్ రంగనాథన్ డూడ్ లాంటి సినిమాలు బరిలో ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ కాంత కూడా వస్తే రావచ్చు. ఈ చిత్రాలు రిలీజయ్యే వరకు బాక్సాఫీస్‌లో కాంతార, ఓజీ చిత్రాలకు పోటీనే ఉండదు.
శశివదనే సినిమాకు మంచి టాక్ వచ్చినా.. డామినేషన్ ఈ రెండు చిత్రాలదే కావచ్చు. ఓజీకి రేట్లు తగ్గించాక ఆక్యుపెన్సీలు పెరిగాయి. ఇంకో వారం రోజులు మంచి రన్‌తో నడిచే అవకాశం వచ్చింది. కాంతార కోసం జనం ఎగబడుతున్నారు. వచ్చే వీకెండ్లో ఈ సినిమా కొత్త చిత్రంలా ఆడితే ఆశ్చర్యమేమీ లేదు. ఇటు ఓజీ, అటు కాంతారపై భారీ పెట్టుబడులు పెట్టిన బయ్యర్లు.. ఈ వారం రన్ అయ్యేసరికి బ్రేక్ ఈవెన్ అయి లాభాలు కూడా అందుకునే అవకాశముంది. ఓజీకి ఒక దశలో నష్టాలు తప్పవనుకున్నారు కానీ.. రన్ పెరగడం వల్ల బయ్యర్లకు ఇబ్బంది లేకపోవచ్చు.
