Begin typing your search above and press return to search.

కాంతార పోస్టల్ కార్డ్స్.. భారత ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం

ఈ సీక్వెల్‌లోనూ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా, దర్శకత్వం వహించడం విశేషం. ఆయనతో పాటు రుఖ్మిణి వసంత్ కీలక పాత్ర పోషిస్తోంది.

By:  M Prashanth   |   24 Sept 2025 5:51 PM IST
కాంతార పోస్టల్ కార్డ్స్.. భారత ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం
X

రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. కన్నడ సంస్కృతిలో ప్రత్యేకంగా ఉండే భూత కొల ఆచారాన్ని ప్రధానంగా తీసుకుని తెరకెక్కిన ఈ సినిమా, ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కన్నడ ఇండస్ట్రీ స్థాయిని పెంచింది. ఇక ఈ అద్భుత విజయానంతరం రిషబ్ శెట్టి తన కలల ప్రాజెక్ట్‌గా కాంతార చాప్టర్ 1 ని సిద్ధం చేస్తున్నారు.

ఈ సీక్వెల్‌లోనూ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా, దర్శకత్వం వహించడం విశేషం. ఆయనతో పాటు రుఖ్మిణి వసంత్ కీలక పాత్ర పోషిస్తోంది. మేకర్స్ అయిన హంబలే ఫిలిమ్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో మల్టీ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ ద్వారా సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు రిలీజ్‌కి ముందు మరో ప్రత్యేక గౌరవం లభించింది.

భారత ప్రభుత్వం అధికారికంగా కాంతార ఆధారంగా స్పెషల్ పోస్టల్ కవర్స్, పోస్టల్ కార్డ్స్‌ను ఆవిష్కరించింది. భూత కొల సంప్రదాయానికి గౌరవప్రదంగా ఈ ప్రత్యేక సంచికను విడుదల చేయడం ద్వారా సినిమా తెచ్చిన సంస్కృతి ప్రాధాన్యం మరింత వెలుగులోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా, యూనియన్ కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు హంబలే ఫిలిమ్స్, టీమ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

ఈ సందర్భంగా నటుడు దర్శకుడు రిషబ్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా నా జీవితం మొత్తం కాంతారకే అంకితం అయ్యింది. మొదటి భాగం ద్వారా ఒక దిశ చూపించాం. ఇప్పుడు చాప్టర్ 1లో మరింత లోతైన మూలాలు చూపించబోతున్నాం. ఈ రెండు సినిమాలతో పూర్తి కథ తెలుస్తుంది. నా ప్రయాణానికి గౌరవప్రదంగా భారత ప్రభుత్వం పోస్టల్ కార్డ్స్ విడుదల చేయడం నాకు చాలా గర్వకారణం అని అన్నారు.

సినిమాలో భూత కొల ఆచారంతో పాటు ఆ భూమి కోసం భక్తితో తిరుగుబాటు అంశాలను హైలెట్ చేయనున్నారు. ఆ విషయం ట్రైలర్‌తోనే అర్థమైంది. అజనీష్ లోకనాథ్ సంగీతం, అద్భుతమైన విజువల్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తున్నాయట. హంబలే ఫిలిమ్స్ కూడా నిర్మాణంలో ఎక్కడా రాజీపడకపోవడంతో, ఈ సినిమా విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌గా ఉండబోతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న కాంతార చాప్టర్ 1 ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ఇక పోస్టల్ కార్డ్స్ రూపంలో భారత ప్రభుత్వ గుర్తింపు ఈ సినిమా క్రేజ్‌ను మరింతగా పెంచింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కేవలం సినిమా ప్రియులే కాకుండా ప్రముఖులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.