కాంతార ఫ్రీక్వెల్.. 800 కోట్లు దాటినా ఆగట్లేదుగా!
ఈ సినిమా ప్రయాణం మొదలైనప్పుడు, ఎవరూ ఈ రేంజ్ విజయాన్ని ఊహించలేదు.
By: M Prashanth | 24 Oct 2025 12:04 PM ISTకొన్ని సినిమాలుంటాయి.. సైలెంట్‌గా వస్తాయి, బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తాయి. ఆడియన్స్ ఊహలకు అందకుండా, ట్రేడ్ పండితుల లెక్కలను బద్దలు కొడుతూ చరిత్ర సృష్టిస్తాయి. ఇప్పుడు ఇండియన్ సినిమాలో సరిగ్గా అలాంటి చరిత్రనే తిరగరాస్తోంది 'కాంతార చాప్టర్ 1'. మూడు వారాల క్రితం దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపం చూపిస్తూనే ఉంది. ప్రతీ వారం కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ, అసలైన బాక్సాఫీస్ కింగ్ ఎవరో చూపిస్తోంది.
ఈ సినిమా ప్రయాణం మొదలైనప్పుడు, ఎవరూ ఈ రేంజ్ విజయాన్ని ఊహించలేదు. మొదటి 'కాంతార'కు ప్రీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నా, మహా అయితే ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లు వసూలు చేస్తుందని చాలామంది ట్రేడ్ పండితులు లెక్కలు వేశారు. ఓపెనింగ్స్ కూడా మోస్తరుగానే ఉన్నాయి. కానీ, ఒక్కసారి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యాక, 'కాంతార' ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది. భాషతో, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఈ దైవిక గాథకు బ్రహ్మరథం పట్టారు. ఆ దెబ్బకు అన్ని అంచనాలు తలకిందులయ్యాయి.
మూడు వారాలు గడిచేసరికి, ఈ సినిమా ఊహకందని రికార్డ్ లను అందుకుంది. లేటెస్ట్ గా చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ విడుదల చేసిన అధికారిక పోస్టర్ ద్వారా సినిమా లెక్క అసలు తగ్గట్లేదని అనిపిస్తుంది. 'కాంతార చాప్టర్ 1' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 818 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ నెంబర్ తో, మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సగర్వంగా ప్రకటించారు.
ఈ విజయంతో, 'కాంతార చాప్టర్ 1' ఆల్ టైమ్ ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ల జాబితాలోనూ పైపైకి దూసుకుపోతోంది. గతంలో 750 కోట్ల మార్క్‌తో 15వ స్థానంలో నిలిచిన ఈ చిత్రం, ఇప్పుడు 800 కోట్లను దాటేసి, ఆ లిస్ట్‌లో మరింత మెరుగైన స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల్లో కేవలం రెండు వారాల్లోనే 105 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించడం, ఇక్కడి ప్రేక్షకులు ఈ సినిమాకు ఎంతలా కనెక్ట్ అయ్యారో చూపిస్తుంది. ఐదు భాషల్లోనూ నిలకడగా వసూళ్లు సాధిస్తుండటం దీనికి అతిపెద్ద బలం.
ఈ సినిమా విజయం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. అక్టోబర్ 31న ఈ చిత్రం ఇంగ్లీష్ వెర్షన్‌లో కూడా విడుదల కాబోతోంది. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే ఒక కొత్త ట్రెండ్ కావచ్చు. ఒక ఇండియన్ సినిమా ఇంగ్లీష్‌లో డబ్ అయి విడుదల కావడం ఇదే తొలిసారి. ఈ ఇంగ్లీష్ వెర్షన్ కూడా క్లిక్ అయితే, సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమాలోని యూనివర్సల్ ఎమోషన్, రిషబ్ శెట్టి నటన, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం.. ఇవన్నీ భాషా హద్దులను చెరిపేసి ప్రేక్షకులను కట్టిపడేశాయి. మొత్తం మీద, ఒక మోస్తరు అంచనాలతో ప్రయాణం మొదలుపెట్టి, 'కాంతార చాప్టర్ 1' 2025 బాక్సాఫీస్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇక రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకా ఏ స్థాయిలో కలెక్షన్లు అందుకుంటుందో చూడాలి.
