కాంతార: హైప్.. డ్రాప్.. మళ్లీ జోష్
దసరా కానుకగా ఈ గురువారం భారీ అంచనాల మధ్య రిలీజైన సినిమా.. కాంతార: చాప్టర్-1. ఈ సినిమాకు తొలి రోజు పాన్ ఇండియా స్థాయిలో మంచి వసూళ్లే వచ్చాయి.
By: Garuda Media | 5 Oct 2025 12:11 PM ISTదసరా కానుకగా ఈ గురువారం భారీ అంచనాల మధ్య రిలీజైన సినిమా.. కాంతార: చాప్టర్-1. ఈ సినిమాకు తొలి రోజు పాన్ ఇండియా స్థాయిలో మంచి వసూళ్లే వచ్చాయి. వరల్డ్ వైడ్ రూ.89 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టిందీ కన్నడ సినిమా. తెలుగు, హిందీలో ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయి. కానీ రెండో రోజు కాంతార-2 జోరు కొంచెం తగ్గింది. అన్ని చోట్లా వసూళ్లు డ్రాప్ అయ్యాయి. ముఖ్యంగా హిందీలో, ఓవర్సీస్‌లో డ్రాప్ కొంచెం కంగారు పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా శుక్రవారం వసూళ్లు ఓ మోస్తరుగా వచ్చాయంతే. దీంతో కాంతార-2 బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడగలదా లేదా.. బయ్యర్ల పరిస్థితి ఏంటో అన్న కంగారు మొదలైంది. మరోవైపు బుక్ మై షోలో ఈ సినిమా టికెట్ల అమ్మకాలను మరీ హైప్ చేసి చూపిస్తున్నారని.. అక్కడ అమ్ముడవుతున్నట్లు చెబుతున్న టికెట్ల సంఖ్యకు, వస్తున్న వసూళ్లకు పొంతన లేదంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. దీని కారణంగా సినిమాపై కొంత నెగెటివిటీ ముసురుకుంది.
ఐతే శనివారం కాంతార-2కు సంబంధించి నెగెటివిటీ అంతా పక్కకు వెళ్లింది. ఈ సినిమా బలంగా పుంజుకుంది. వీకెండ్ కావడంతో థియేటర్లకు జనం బాగానే వచ్చిన సంకేతాలు కనిపిస్తున్నాయి. మార్నింగ్ షోల నుంచే వసూళ్లు పుంజుకున్నాయి. సాయంత్రం షోలకు ప్యాక్డ్ హౌస్‌లతో నడిచింది కాంతార: చాప్టర్-1. కన్నడతో పాటు తెలుగు, హిందీలో సినిమాకు స్పందన బాగుంది. తమిళంలో మాత్రం ఇడ్లీ కొట్టు డామినేషన్ నడుస్తోంది. హిందీలో జాన్వి కపూర్ సినిమా సన్నీ సంస్కారి కి తుల్సీ కుమారి సినిమాకు యావరేజ్ టాక్ రావడం కాంతార-2కు కలిసొచ్చింది.సీక్వెల్ హైప్, సినిమాలోని విజువల్ గ్రాండియర్ ప్లస్ అవుతున్నాయి. మరోవైపు బుక్ మై షోలో టికెట్ల అమ్మకాల విషయంలో ఎగ్జాజరేషన్లకు హోంబలే వాళ్లు తెరదించినట్లే కనిపిస్తున్నారు. ఈ వివాదం కూడా సద్దుమణిగినట్లే. ఆదివారం కూడా సినిమా బాగా ఆడే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి సోమవారం నుంచి పరిస్థితి ఎలా ఉంటుందన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం.
