కాంతార చాప్టర్ 1.. తెలుగులో టాప్ ఇదే..
కన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1.
By: M Prashanth | 1 Nov 2025 12:59 PM ISTకన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. మూడేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా రూపొందిన ఆ మూవీ దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. భారీ విజయాన్ని అందుకుంది.
రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో కూడా కాంతార ప్రీక్వెల్ అదిరిపోయే రెస్పాన్స్ సాధించింది. అందరినీ ఫిదా చేసి.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున కలెక్షన్లు సాధించింది. ఇప్పటి వరకు రూ.800 కోట్లకు పైగా వసూలు చేసి.. 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాగా నిలిచింది.
ఇప్పటి వరకు రూ.867 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి.. ఈ ఏడాది ప్రారంభంలో రూ.800 కోట్లకు పైగా రాబట్టిన ఛావా మూవీని వెనక్కి నెట్టింది. అది కూడా మూడు వారాల్లోనే చేయడం విశేషం. అయితే రీసెంట్ గా ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో లోకి మూవీ వచ్చినా.. ఇంకా అనేక చోట్ల థియేటర్స్ లో కాంతార ప్రీక్వెల్ ఆడుతోంది.
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక తెలుగు యేతర వసూళ్లు సాధించిన చిత్రంగా కాంతార చాప్టర్ 1 నిలిచింది. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో రూ.108 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కొత్త చరిత్ర సృష్టించింది. ఆ జాబితాలో ఇప్పటికే మరో స్టార్ హీరో యష్.. కేజీఎఫ్ చాప్టర్ 2 ఉందన్న సంగతి తెలిసిందే.
అప్పట్లో ఆ మూవీ రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు కాంతార ప్రీక్వెల్.. ఆ సినిమా కన్నా ఎక్కువ కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ రూపొందించిన కాంతార చాప్టర్ 1 మూవీని తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేసింది.
సినిమా క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెద్ద ఎత్తున విడుదల చేసిన మైత్రీ సంస్థ.. మంచి హిట్ ను అందుకుంది. అదే సమయంలో హోంబలే ఫిల్మ్స్ కూడా కేజీఎఫ్ చాప్టర్ 2, కాంతార చాప్టర్ 1తో తెలుగు రాష్ట్రాల్లో చరిత్ర సృష్టించింది. తమ టాలీవుడ్ మార్కెట్ ను దృఢంగా పదిలం చేసుకుంది. కంటెంట్ కు విలువనిచ్చే విజయవంతమైన నిర్మాణ సంస్థగా క్రేజ్ ను సొంతం చేసుకుంది.
