Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో కాంతార-1.. ప్రీమియర్స్ పై అసలు క్లారిటీ ఇదే..

ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న కాంతార ప్రీక్వెల్.. అక్టోబర్ 2వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సందడి చేయనుంది.

By:  M Prashanth   |   1 Oct 2025 8:11 PM IST
తెలుగు రాష్ట్రాల్లో కాంతార-1.. ప్రీమియర్స్ పై అసలు క్లారిటీ ఇదే..
X

మూడేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన కాంతార మూవీ భారీ విజయం సాధించింది. శాండల్ వుడ్ లో భారీ వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్: 1 ప్రాజెక్టు రూపొందుతున్న విషయం తెలిసిందే. మరికొన్ని గంటల్లో ఆ చిత్రం విడుదల కూడా అవ్వనుంది.

కన్నడ నటుడు రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో నటిస్తూనే.. సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రిషబ్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆమెతోపాటు మరికొందరు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న కాంతార ప్రీక్వెల్.. అక్టోబర్ 2వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సందడి చేయనుంది. అదే సమయంలో నేడు రాత్రి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెద్ద ఎత్తున ఎర్లీ ప్రీమియర్స్ ను కాంతార ప్రీక్వెల్ మేకర్స్ ప్రదరించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ లేవని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ, గీతా ప్రకటించాయి. నైజాంలో ప్రీమియర్ షోలు లేవని మైత్రీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలిపింది. కాంతార చాప్టర్ 1 మొదటి షో రేపు ఉదయం 7:45 గంటలకు నిజాం అంతటా ప్రారంభమవుతుందని చెప్పింది. గ్రాండ్ గా సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది.

అయితే నైజాం రైట్స్ ను మైత్రీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అడ్వాన్స్ పద్ధతిలో రూ.40 కోట్లకు పైగా వ్యయంతో రైట్స్ ను దక్కించుకున్నట్లు సమాచారం. అదే సమయంలో కాంతార చాప్టర్ 1 ప్రీమియర్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ లో కూడా ఉండవని తాజాగా గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ పేర్కొంది.

రేపు నుంచి రెగ్యులర్ షోలతో సినిమాను ప్రదరిస్తున్నామని తెలిపింది. అయితే ఉభయ గోదావరి జిల్లాల థియేట్రికల్ హక్కులను గీతా బ్యానర్ సొంతం చేసుకుంది. కాగా.. ఏపీలో సినిమాకు రూ. 50 అదనపు టికెట్ ధర పెంచుకునేందుకు మేకర్స్ ఇప్పటికే అనుమతులు అందుకున్నారు. ఆ విషయంలో పలు అభ్యంతరాలు వ్యక్తమైనా.. డిప్యూటీ సాబ్ పవన్ కళ్యాణ్ ఎంట్రీతో అనుకున్నది సాధించారు.