కాంతార.. వరుస మరణాలపై నిర్మాత ఏమన్నారు?
దీనిపై చాలా కాలంగా కాంతార టీమ్ నుంచి ఎలాంటి వివరణా రాకపోవడంతో తాము అనుకుంటున్నదే నిజమని ప్రజలు నమ్ముముతున్నారు.
By: Sivaji Kontham | 13 Aug 2025 12:22 AM ISTఅమ్మవారి కథలు, శక్తి స్వరూపిణుల కథలు లేదా, పౌరాణిక జానపదుల థ్రిల్లర్ కథలతో సినిమాలు తీసినప్పుడు నిగూఢంగా దాగి ఉండే శక్తులు అడ్డంకులు సృష్టిస్తాయని కొన్ని కథలు, చరిత్ర పాఠాలు ఉన్నాయి. అలాంటి అడ్డంకులేవో `కాంతార చాప్టర్ 1` టీమ్ ని వెంటాడుతున్నాయని అందరూ భావించేలా కొన్ని ఘటనలు ఆశ్చర్యపరిచాయి. ఏదో శక్తి కాంతార టీమ్ ని వెంటాడుతోంది. అందుకే టీమ్ సభ్యుల్లో వరస మరణాలు సంభవిస్తున్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే చిత్రబృందంలోని నలుగురు మరణించారు. ఇటీవలే కాంతరలో కనిపించిన దున్నపోతు కూడా మరణించడంతో ఈ ప్రచారానికి మరింతగా రెక్కలొచ్చాయి. మీడియాలు ఊకదంపుడుగా అదే పనిగా ప్రచారం చేస్తుండటంతో ఏదో మాయ లేదా దుష్టశక్తి కాంతార టీమ్ ని వెంటాడుతోందని అందరూ సందేహించారు.
దీనిపై చాలా కాలంగా కాంతార టీమ్ నుంచి ఎలాంటి వివరణా రాకపోవడంతో తాము అనుకుంటున్నదే నిజమని ప్రజలు నమ్ముముతున్నారు. అయితే దీనిపై ఇప్పుడు కొంత స్పష్ఠత వచ్చింది. మాపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. కొంత తప్పుడు సమాచారం ఉంది! అంటూ చిత్రనిర్మాత చలువే గౌడ క్లారిటీ ఇచ్చారు. రకరకాల అడ్డంకులు, ప్రమాదాలు వాస్తవమే కానీ, చిత్రబృందంలో ఎవరికీ ఏమీ కాలేదు. అసలు ఏ సంబంధం లేని వాటిని తెరపైకి తేవొద్దు! అని ఆయన అన్నారు. సెట్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. మిగిలినవన్నీ మాకు సంబంధం లేనివి! అని కూడా అతడు అన్నారు. గత ఏడాది కర్నాటక కొల్లూరులో జరిగిన చిత్రీకరణలో జరిగిన ప్రమాదంలో చిత్రబృందం కొద్దిపాటి గాయాలతో బయటపడింది. 2025లో సెట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు. తర్వాత నదిలో పడవ మునిగిన ఘటనలో అందరూ బయటపడ్డారు. కెమెరాలు, ఇతర పరికరాలు నీట మునిగాయి అంతే! అని వివరణ ఇచ్చారు.
షూటింగుకి వెళ్లే ముందే అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నామని, పంజుర్లి అమ్మవారు (తమిళనాడు దేవాలయం) దివ్యదర్శిని ప్రకారం.. కొన్ని అడ్డంకులు వచ్చినా , చిత్రీకరణ పూర్తి చేసి సినిమాని సవ్యంగా రిలీజ్ చేస్తారని మాకు అమ్మవారు చెప్పారని కూడా అయన అన్నారు. తెల్లవారు ఝామున 4గం.లకే నిద్ర లేచి 6గం.లకు షూటింగ్ ప్రారంభించేవాళ్లమని, సినిమా అంతకంతకు ఆలస్యమవుతుంటే విమర్శలు ఎదుర్కొన్నామని, కానీ ఇప్పుడు ఫుటేజ్ చూసుకుని ఆనందంగా ఉన్నామని తెలిపారు. కొన్ని సినిమాల చిత్రీకరణల సమయంలో వ్యయప్రయాసలు సహజం. అలాంటి ప్రయాసలు చాలా ఉన్నాయని కాంతార టీమ్ అనుభవాలు చెబుతున్నాయి.
