కాంతార నటులు.. వరుస మరణాల సస్పెన్స్?
అయితే కాంతార సినిమాలో నటించిన పలువురు నటులు వరుస ఇన్సిడెంట్లలో మరణించడం ఆశ్చర్యపరుస్తోంది.
By: Sivaji Kontham | 9 Aug 2025 1:24 AM ISTరిషబ్ శెట్టి కథానాయకుడిగా నటించిన `కాంతార` పాన్ ఇండియాలో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆయనే దర్శకుడు కూడా. కన్నడ నాట పురాతన సంస్కృతి, జానపదుల కథలో సస్పెన్స్ ఎలిమెంట్ ప్రజల్ని విపరీతంగా ఆకర్షించాయి. ఈ సినిమాలో రిషబ్ నటన, సంగీతం సహా ప్రతిదీ ఆశ్చర్యపరిచాయి. చిత్ర కథానాయకుడు రిషబ్ ప్రస్తుతం కాంతారకు ప్రీక్వెల్ ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే కాంతార సినిమాలో నటించిన పలువురు నటులు వరుస ఇన్సిడెంట్లలో మరణించడం ఆశ్చర్యపరుస్తోంది. తాజా సమాచారం మేరకు... కాంతరలో నటించిన నాటక కళాకారుడు టి ప్రభాకర్ కళ్యాణి గురువారం ఉదయం హిరియాడ్కాలోని తన నివాసంలో కుప్పకూలి మరణించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి రిటైర్డ్ అధికారి అయిన ప్రభాకర్ కాంతారాలో న్యాయవాది పాత్రను పోషించారు.
కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం... ప్రభాకర్ కళ్యాణి ఇంట్లో జారిపడి చికిత్స పొందుతున్నాడు. సడెన్ గా తన చేతులు, కాళ్లలో నొప్పి ఉందని భార్యకు చెప్పగా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసారు. కానీ ఇంతలోనే అతడు మరణించాడు. అతడు స్టేజీ కళాకారుడు. కాంతారాలో తన పాత్ర కోసం దాదాపు ఒక సంవత్సరం పాటు గడ్డం పెంచి మెయింటైన్ చేశాడు. అయితే చివరి నిమిషంలో తనకు మొదట కేటాయించిన పాత్రను వేరే నటుడితో భర్తీ చేసినప్పుడు అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడని సన్నిహితులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం అతడి అంత్యక్రియలు పూర్తయ్యాయి.
కాంతారలో నటించిన పలువురు నటులు చాలా చిన్న వయసులో రకరకాల కారణాలతో మరణించడం ఆశ్చర్యపరిచింది. రాకేష్ పూజారి (36), కపిల్ (32) మేలో చనిపోయారు. జూన్ లో కళాభవన్ మృతి చెందారు. ఇప్పుడు ప్రభాకర్ కళ్యాణి మృతి చెందడంతో అసలేం జరుగుతోందో తెలుసుకోవాలనే ఆందోళన నెలకొంది.
