ఉపేంద్ర ఓపెన్ చేసిన మార్కెట్.. యశ్ ఎక్కడికి తీసుకెళ్లాడు
హీరో పేరు మీద భారీ రిలీజ్ అనే పరిస్థితి చాలా తక్కువ. ఆ లెక్కను మొదట బలంగా మార్చిన వాళ్లలో ఉపేంద్ర ఒకరు.
By: M Prashanth | 26 Aug 2026 1:05 PM ISTతెలుగు రాష్ట్రాల్లో కన్నడ హీరోలకు ఇప్పుడున్న మార్కెట్ ఒక్కసారిగా రాలేదు. ఒకప్పుడు కన్నడలో హిట్ అయిన సినిమా తెలుగులో డబ్ అయితే ఇక్కడ ఎంతవరకు వెళ్తుందో చూసేవారు. హీరో పేరు మీద భారీ రిలీజ్ అనే పరిస్థితి చాలా తక్కువ. ఆ లెక్కను మొదట బలంగా మార్చిన వాళ్లలో ఉపేంద్ర ఒకరు. ఇప్పుడు యశ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్ వచ్చే స్థాయికి మార్కెట్ వచ్చింది. కానీ మధ్యలో దాదాపు మూడు దశాబ్దాల జర్నీ ఉంది.
ఉపేంద్రకు A, ఉపేంద్ర సినిమాలు కన్నడతో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చాయి. A తెలుగు వెర్షన్ అప్పట్లో 100 రోజులు ఆడగా, ఉపేంద్ర కూడా ఆంధ్రప్రదేశ్‌లో మంచి రన్ తీసుకుంది. ఆ గుర్తింపుతోనే ఆయనకు కన్యాదానం లాంటి స్ట్రెయిట్ తెలుగు సినిమా వచ్చింది. తర్వాత రా కూడా చేశాడు. అంటే కన్నడ నుంచి వచ్చి తెలుగులో తన పేరుతో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొచ్చిన తొలి హీరోల్లో ఉపేంద్ర ముందుంటాడు.
తర్వాత సుదీప్‌కు ఇక్కడ పేరు బాగా తెలిసింది. అయితే అది పూర్తిగా కన్నడ డబ్బింగ్ మార్కెట్‌తో వచ్చింది కాదు. రాజమౌళి ఈగలో చేసిన నెగెటివ్ పాత్ర ఆయనను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. తర్వాత విక్రాంత్ రోణను తెలుగులో కూడా పెద్ద స్థాయిలో రిలీజ్ చేశారు. తొలి వారంలో తెలుగు వెర్షన్‌కు దాదాపు 370 స్క్రీన్స్ దొరికాయి. దర్శన్ కూడా రాబర్ట్‌తో తెలుగు మార్కెట్‌ను ట్రై చేశాడు. ఏపీ, తెలంగాణలో భారీ సంఖ్యలో థియేటర్లు తీసుకున్నా, ఆ ప్రయత్నం తర్వాత ఆయనకు ఇక్కడ ప్రత్యేకమైన మార్కెట్ మాత్రం స్థిరపడలేదు.
ఇక రిషబ్ శెట్టి మరో రూట్ చూపించాడు. కాంతార వచ్చేముందు తెలుగులో ఆయనకు స్టార్ మార్కెట్ లేదు. కానీ సినిమా కన్నడలో హిట్ అయిన తర్వాత తెలుగు వెర్షన్ వచ్చింది. చివరకు ఏపీ, తెలంగాణ కలిపి దాదాపు రూ.58.85 కోట్ల గ్రాస్ వరకు వెళ్లింది. అంటే ముందు హీరో మార్కెట్ ఉండాలి అనే లెక్కను కాంతార పూర్తిగా పక్కన పెట్టింది. సినిమా నచ్చితే తర్వాత హీరో పేరే మార్కెట్‌గా మారొచ్చని చూపించింది.
యశ్ దగ్గరకు వచ్చేసరికి ఈ లెక్క మరో స్థాయికి వెళ్లింది. కేజీఎఫ్ మొదటి భాగం తెలుగు రాష్ట్రాల్లో రూ.12.18 కోట్ల షేర్‌తో క్లోజ్ అయ్యింది. రెండో భాగం వచ్చేసరికి అదే మార్కెట్ ఏకంగా రూ.86.15 కోట్ల షేర్ వరకు పెరిగింది. ఇప్పుడు టాక్సిక్‌కు పరిస్థితి ఇంకా వేరుగా ఉంది. ఇది కేజీఎఫ్ ఫ్రాంచైజీ సినిమా కాదు. అయినా ఏపీ, తెలంగాణలో భారీ రిలీజ్‌తో పాటు ప్రభుత్వాలు టికెట్ ధరల పెంపునకు కూడా అనుమతి ఇచ్చాయి. అంటే కన్నడ సినిమా తెలుగులో ఏదో జస్ట్ డబ్ అవ్వడం లేదు. ఇప్పుడు కన్నడ హీరో సినిమా ఏకంగా తెలుగు మార్కెట్ ను డామినేట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇక ఈ ట్రాక్ ను నెక్స్ట్ ఎవరు ఏ స్థాయిలో పెంచుతారో చూడాలి.
