3 కోట్లతో సినిమా.. జాక్ పాట్ కలెక్షన్స్.. ఇవేం లాభాలు సామీ
కానీ, తాజాగా ఓ సినిమా మాత్రం అదిరే వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. భారీ కలెక్షన్లతో ఔరా అనిపిస్తుంది.
By: M Prashanth | 4 Aug 2025 1:29 PM ISTసినిమా ఇండస్ట్రీలో పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తే చాలు అనుకునే మేకర్స్ ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. మార్కెటింగ్, ప్రొడక్షన్ ఖర్చు, ప్రమోషన్స్, రెమ్యూనరేషన్స్, గ్రాఫిక్స్ ఇలా అన్నీ పోనూ కొద్దొ గొప్పో లాభం వస్తే అదే మహా భాగ్యంగా మారింది. ఇలా అనుకునే మేకర్స్ కూడా ప్రస్తుతం ఎక్కువైపోయారు. వందల కోట్లు పెడితే, సగం కూడా వెనక్కిరాని పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకే రిస్క్ తీసుకోవడానికి కూడా ప్రొడ్యూసర్లు ధైర్యం చేయడం లేదు.
కానీ, తాజాగా ఓ సినిమా మాత్రం అదిరే వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. భారీ కలెక్షన్లతో ఔరా అనిపిస్తుంది. కన్నడ తాజా సినిమా సు ఫ్రమ్ సో సంచలన వసూళ్లతో అదరగొడుతోంది. గత నెల 25న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నిర్మాతలపై కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే పలు భారీ రికార్డులపై కన్నేసింది.
ఈ సినిమాను మేకర్స్ కేవలం రూ.3 కోట్ల బడ్జెత్లోనే నిర్మించారు. కానీ ఇది విడుదలైన 10 రోజుల్లోనే రూ.40 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది. అదే నెట్ కలెక్షన్లు తీసుకుంటే రూ.30 కోట్ల పైమాటే. అలా పెట్టుబడి ప్రకారం చూసుకుంటే.. ఈ సినిమాకు రూ.3 కోట్లు పెడితే, రూ.30 కోట్ల మార్క్ క్రాస్ అయ్యింది. అంటే వ్యాపార లెక్కల ప్రకారం ఇది 878 శాతం ప్రాఫిట్ అన్నమాట. ఇప్పటికే సినిమాకు మంటి టాక్ రావడంతో లాంగ్ రన్ లో ఇది ఇంకా ఎక్కువ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి.
అటు ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో లో కూడా కన్నడ సినిమాల లిస్ట్ లో ఇప్పటిదాకా టాప్ లో ఉన్నవి సుదీప్ మ్యాక్స్, దర్శన్ కాటేరా. ఈ రెండు సినిమాల తర్వాత స్థానంలో సు ఫ్రమ్ సో ఉడడం విశేషం. బెంగళూరు నగరంలో ఆదివారం ఉదయం ఆరు గంటలకే తొలి షో పడింది. ఇంత చిన్న సినిమాకు అంత పొద్దున షో వేస్తున్నప్పటికీ థియేటర్ హౌస్ ఫుల్ కావడం విశేషం.
కాగా, సినిమా విషయానికొస్తే.. కొత్త దర్శకుడు జెపి తుమినాధన్ ఈ సినిమా తెరకెక్కించాడు. ఇది హారర్ కామెడీ డ్రామాగా రూపొందింది. ఓ పల్లెటూరి కుర్రాడికి సులోచన అనే దయ్యం పడుతుంది. అక్కడి నుంచి కథ కామెడీ టర్న్ తీసుకుంటుంది. ఫన్నీ సన్నివేశాలతో ఆద్యంతం ఎంటర్టైన్ గా ఉంటుంది. ఒక్క బూతు పదం లేకుండా.. తుమినాధన్ ఈ సినిమా తెరకెక్కించడంలో 100 శాతం సక్సెస్ అయ్యారు.
అలాగే ఈ సినిమా ఎక్స్ పీరియన్స్ తెలుగు ప్రేక్షకులకు కూడా అందించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఆగస్టు 8న విడుదల చేయనుంది. తెలుగులో ఇప్పటికే మంచి విజయం సాధించిన కమిటీ కుర్రొళ్లు తరహాలో ఇది కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి.
