మరోసారి అందరి దృష్టి అటువైపు..!
ఒకప్పుడు కన్నడ సినిమాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు, కన్నడంలో రూపొందిన సినిమాలు కేవలం కర్ణాటక వరకే అన్నట్లుగా పరిమితమై ఉండేవి.
By: Ramesh Palla | 8 Dec 2025 3:43 PM ISTఒకప్పుడు కన్నడ సినిమాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు, కన్నడంలో రూపొందిన సినిమాలు కేవలం కర్ణాటక వరకే అన్నట్లుగా పరిమితమై ఉండేవి. తమిళ, తెలుగు, మలయాళం సినిమాలు ఇతర భాషల్లో డబ్బింగ్ కావడం మనం ఎక్కువగా చూసేవాళ్ళం. కానీ కన్నడ సినిమాలు అరుదుగా మాత్రమే డబ్ అయ్యేవి. కన్నడంలో ఇతర భాషల సినిమాలు ఎక్కువగా డబ్బింగ్ అయ్యేవి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కే జి ఎఫ్ సినిమా తర్వాత మొత్తం మారిపోయింది, కన్నడ సినిమా ఒక పాన్ ఇండియా మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యింది. కాంతార సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందాం అందరికీ తెలిసిందే. అందుకే కన్నడ నుండి సినిమా వస్తుంది అంటే ఇండియన్ సినిమా ప్రేక్షకులు లైట్ తీసుకోవట్లేదు. అటువైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఒకప్పుడు కన్నడ సినిమా అంటే పెద్దగా పట్టించుకోని జనాలు ఇప్పుడు కన్నడ సినిమా ఇండస్ట్రీ వైపు తిరిగి చూసి అక్కడ నుంచి ఏం సినిమాలు వస్తున్నాయా అనే ఆసక్తిని కనబరుచుతున్నారు.
దర్శన్ హీరోగా రూపొందిన..
ప్రతి ఏడాది కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకి ఎన్నో రూపొంది ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందులో కొన్ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కావడం మనం చూస్తూ ఉన్నాం. సుదీప్, ఉపేంద్ర, శివరాజ్ కుమార్, దర్శన్ ఇలా కొద్దిమంది కన్నడ స్టార్ హీరోలు నటించిన సినిమాలు అంటే తెలుగుతో పాటు ఇతర భాషలకు సంబంధించిన ప్రేక్షకులు సైతం ఆసక్తిని కనబరుచుతున్నారు. అంతటి క్రేజ్ ఉన్న ఆ హీరోలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ డిసెంబర్ నెలలో రాబోయే మూడు వారాల పాటు అదే జరగబోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెద్ద సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకు రెడీ అవుతున్నాయి. ఏ సినిమాకు ఆ సినిమా అన్నట్లుగా క్రేజ్ కలిగి ఉన్నాయి. డిసెంబర్ 11న ద డెవిల్ అనే సినిమాతో దర్శన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈయన రేణుక స్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న విషయం తెలిసిందే. జైలు నుండి బెయిల్ పై బయటికి వచ్చి ఈ సినిమాను పూర్తి చేసి విడుదలకు రెడీ చేశాడు.
శివరాజ్ కుమార్ నటించిన మల్టీస్టారర్...
అభిమానిని హత్య చేయించాడు అనే దారుణమైన నింద మోస్తున్న దర్శన్ పై సాధారణంగా అయితే జనాల్లో కోపం ఉండాలి, కానీ కన్నడ ప్రేక్షకుల్లో అది ఎక్కువగా కనిపించడం లేదు. పైగా దర్శన్ నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దర్శన్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో డిసెంబర్ 11వ తారీఖున డెవిల్ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కేవలం కన్నడంలో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా విడుదల చేసే విధంగా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఈ మధ్యకాలంలో దర్శన్ సినిమా అంటే ప్రేక్షకుల్లోనే కాకుండా సినీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది, అందుకే ఈ సినిమాను ఇతర భాషల వారు కూడా చూసేందుకు ఆసక్తి కనబరుచుతున్నారు. ఆ తర్వాత కన్నడ సినిమా ఇండస్ట్రీలోనే అతిపెద్ద మల్టీస్టారర్ మూవీగా 45 సినిమా రాబోతుంది. ఈ సినిమాలో శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజు బి శెట్టి ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఒకే సినిమాలో ముగ్గురు హీరోలు నటించిన నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.
మార్క్ సినిమాతో సుదీప్...
గత ఏడాది చివర్లో మ్యాక్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సుదీప్ ఈసారి మార్క్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. కనుక గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది క్రిస్మస్ కూడా తమ అభిమాన హీరో సుదీప్ ది అంటూ ఆయన ఫ్యాన్స్ తెగ ఉత్సాహంగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ మూడు సినిమాలతో కన్నడ సినిమా ఇండస్ట్రీ వైపు మొత్తం ఇండియన్ సినిమా ప్రేక్షకులు చూసే విధంగా చేశారు. ఈ మూడు సినిమాల్లో ఖచ్చితంగా రెండు మూడు అయినా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాయి అనే నమ్మకాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటే రాబోయే రోజుల్లో కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి మరిన్ని సినిమాలు వస్తాయని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
