కియారాకు జెరాక్స్ కాపీలా!
సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా రాజ్ కుమార్ సంతోషీ తెరకెక్కిస్తోన్న చిత్రం `బట్వారా 1947`. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రమిది.
By: Srikanth Kontham | 31 July 2026 3:00 PM ISTసన్నీ డియోల్ ప్రధాన పాత్రలో బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా రాజ్ కుమార్ సంతోషీ తెరకెక్కిస్తోన్న చిత్రం `బట్వారా 1947`. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రమిది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అయితే సినిమా విడుదల కాకముందే చిత్ర యూనిట్ విడుదల చేసిన ఓ అధికారిక పాత్ర పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నటి కనికా కపూర్ క్యారెక్టర్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కనికా కపూర్ ఫ్లోరల్ సూట్ ధరించి లైట్ బ్రౌన్ దుపట్టాతో మేకప్ లేకుండా సాదాసీదా లుక్‌లో కనిపిస్తున్నారు.
అయితే ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ ఫోటోలో కనిపిస్తున్నది కనికా కపూర్ లేక కియారా అద్వానీనా? అంటూ సోషల్ మీడియాలో చర్చకు తెర తీసారు. చాలామంది వినియోగదారులు పోస్టర్‌ను చూసి కియారా అద్వానీయే నటించిందేమోనని భ్రమపడుతున్నారు. ఈ పోస్టర్ క్రెడిట్స్‌లో కియారా పేరు ఎందుకు వేయలేదంటూ కొందరు కామెంట్లు చేయగా, మరికొందరు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో డిజైన్ చేసిన పోస్టర్ అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటి పనుల వల్ల నటీమణుల అసలు పోలికలు మారిపోతున్నాయని కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పోస్టర్ వైరల్ అయిన అనంతరం కనికా కపూర్ తనపై వస్తున్న పోలికల కామెంట్లపై సరదాగా స్పందించారు. నెటిజన్లు చేసిన కామెంట్‌కు ఆమె నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇవ్వడం విశేషం. అయితే కనికా కపూర్ ఇతర ఫోటోలను పరిశీలిస్తే అసలు కియారా అద్వానీలా కనిపించరని.. కేవలం ఈ పోస్టర్‌లోని లైటింగ్ .. మేకప్ కారణంగానే అచ్చుగుద్దినట్లు ఉండే పోలికలు వచ్చాయని అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఢిల్లీకి చెందిన కనికా కపూర్ `బట్వారా 1947` చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారు. సినిమాల్లోకి రాకముందు `ఏక్ దుజే కే వాస్తే 2` వంటి టీవీ సీరియళ్లతో పాటు పలు వెబ్ సిరీస్‌లు, మోడలింగ్ రంగంలోనూ రాణించారు. బ్యూటీ పేజెంట్స్ గెలుచుకున్న కనిక చిన్ననాటి నుంచి నటనపై ఉన్న మక్కువతో సినిమా రంగంలోకి ప్రవేశించారు. తాజాగా విడుదలైన వివాదాస్పద పోస్టర్ పుణ్యమా? అని కనిప కపూర్ బాలీవుడ్ సర్కిల్స్‌లో మార్మో గిపోతోంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న చిత్రం దేశ విభజన నేపథ్యంలో సాగుతుంది. సన్నీ డియోల్, ప్రీతి జింటా, షబానా ఆజ్మీలతో పాటు కరణ్ డియోల్, కనికా కపూర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అంది స్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
