Begin typing your search above and press return to search.

కంగ‌న వ‌ర్సెస్ శ్ర‌ద్దాక‌పూర్ ఎవ‌రు టాప్ లో?

బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్, శ్రద్ధా కపూర్‌లలో ప్రస్తుతం ఎవరు టాప్ అనే చర్చ మొదలైంది. ‘క్వీన్’, ‘మణికర్ణిక’తో కంగనా ప్రత్యేక గుర్తింపు పొందగా, ‘స్త్రీ 2’ విజయంతో శ్రద్ధా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. నటన, అవార్డుల పరంగా కంగనా ముందున్నా, ప్రస్తుత మార్కెట్, వసూళ్ల పరంగా శ్రద్ధా కపూర్ ఆధిక్యంలో ఉన్నారు.

By:  Srikanth Kontham   |   28 Nov 2026 6:00 AM IST
కంగ‌న వ‌ర్సెస్ శ్ర‌ద్దాక‌పూర్ ఎవ‌రు టాప్ లో?
X

బాలీవుడ్‌లో హీరోల ఆధిపత్యం నడుస్తున్న రోజుల్లోనే సొంత‌ భుజాలపై సినిమాను నడిపించి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన కథానాయికలు కొందరే ఉంటారు. ఆ జాబితాలో కంగనా రనౌత్.. శ్రద్ధా కపూర్ పేర్లు ముందుంటాయి. ఇద్దరు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో భారీ విజయాలు అందుకున్న వారే. ఎవరికి వారే సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్ప‌రుచుకున్నా? ఇద్ద‌రిలో అసలు టాప్ పొజిషన్‌లో ఎవరున్నారన్న చర్చ ఆసక్తికరంగా మారింది.

కంగనా రనౌత్ ప్రయాణాన్ని చూస్తే బాలీవుడ్‌లో ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అసలైన ఊపు తెచ్చిన నటిగా అమ్మడికి పేరుంది. `క్వీన్`, `తను వెడ్స్ మను` సిరీస్, `మణికర్ణిక` వంటి చిత్రాలతో స్టార్ హీరోలకు దీటుగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి నటనతో జాతీయ అవార్డులు అందుకుని తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో కంగ‌న నటించిన సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడం.. రాజకీయ వ్యవహారాల్లో బిజీ కావడం వంటి అంశాలు సినిమాల వేగంపై ప్రభావం చూపాయి.

శ్రద్ధా కపూర్ కెరీర్ గ్రాఫ్ మాత్రం పూర్తి భిన్నమైన రీతిలో సాగుతోంది. `స్త్రీ`, `స్త్రీ 2` చిత్రాలతో బాక్సాఫీస్ లెక్కలను పూర్తిగా మార్చేశారు. లేడీ ఓరియెంటెడ్ హారర్ కామెడీ జోనర్‌లో `స్త్రీ 2` సాధించిన చారిత్రాత్మక విజయం, శ్రద్ధా కపూర్ స్టార్ పవర్‌ను ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లింది. వివాదాలకు తావివ్వకుండా సినిమాల ద్వారానే అన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ అవ్వ‌డం అమ్మ‌డికి ప్లస్ అయింది.

ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలోనూ ఇద్దరి శైలి వేరుగా కనిపిస్తుంది. కంగనాకు బలమైన నటనను ఇష్టపడే ఆడియన్స్‌తో పాటు.. ఆమె వ్యక్తిత్వాన్ని అభిమానించే వర్గం ఉంది. శ్రద్ధా కపూర్‌కు మాత్రం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలోనూ ఆమెకున్న ఫాలోయింగ్ క్రేజ్ బాలీవుడ్‌లో మరే ఇతర హీరోయిన్‌కు లేనంత స్థాయిలో ఉందనడంలో సందేహం లేదు.

కమర్షియల్ మార్కెట్.. బాక్సాఫీస్ ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే శ్రద్ధా కపూర్ ఆధిక్యంలో కనిపిస్తుంది. నిర్మాతలు భారీ బడ్జెట్ పెట్టడానికి.. డిస్ట్రిబ్యూటర్లు నమ్మకంతో సినిమాలు కొనడానికి శ్రద్ధా పేరు భరోసాగా మారింది. కంగనా నటనా ప్రతిభపై సందేహాలు లేకపోయినా? థియేటర్లకు జనాన్ని రప్పించే విషయంలో కొన్నేళ్లుగా అమ్మ‌డు వెనుకబడ్డారనేది కాద‌న‌లేని నిజం.

నటన, అవార్డులు, ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన తీరు చూస్తే కంగనా రనౌత్ ఎప్పటికీ ప్రత్యేకమే. కానీ ప్రస్తుత బాక్సాఫీస్ జోరు.. ప్రేక్షకుల ఆదరణ.. మార్కెట్ విలువ పరంగా చూస్తే మాత్రం శ్రద్ధా కపూర్ ముందంజలో నిలుస్తుంది. భ‌విష్య‌త్ ప్రాజెక్టులతో కంగనా మళ్లీ ఫామ్‌ను అందుకుంటారో?లేక శ్రద్ధా హవాను ఇలాగే కొన సాగిస్తుందా? అన్న‌ది చూడాలి.