Begin typing your search above and press return to search.

అలా చూడ‌టం అలవాటు చేస్కోండి.. మ‌గ బుద్ధిపై క్వీన్ క్లాస్!

ఫ్రెంచ్ రివేరా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక కాన్స్- 2026 చలనచిత్రోత్సవంలో గ్లోబల్ ఐకాన్ ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తన అద్భుతమైన లుక్స్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.

By:  Sivaji Kontham   |   25 May 2026 11:55 AM IST
అలా చూడ‌టం అలవాటు చేస్కోండి.. మ‌గ బుద్ధిపై క్వీన్ క్లాస్!
X

ఫ్రెంచ్ రివేరా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక కాన్స్- 2026 చలనచిత్రోత్సవంలో గ్లోబల్ ఐకాన్ ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తన అద్భుతమైన లుక్స్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. బ్లూ కస్టమ్ స్కల్ప్చరల్ గౌన్ నుండి ఫెదర్ స్టోల్‌తో కూడిన వైట్ ప్యాంట్ సూట్ వరకు.. ఐసూ ధరించిన ప్రతి అవుట్‌ఫిట్ రెడ్ కార్పెట్‌పై ప్రత్యేకంగా నిలిచింది. మెజారిటీ నెటిజన్లు మాజీ ప్ర‌పంచ సుంద‌రి స్టైల్‌కు ఫిదా అవుతుంటే.. కొందరు సోషల్ మీడియా యూజర్లు మాత్రం త‌న‌ వయసు, బరువును టార్గెట్ చేస్తూ `ఏజ్-షేమింగ్` కు దిగారు. వయసుపైబడిన లుక్‌లో కనిపిస్తోందంటూ కొందరు చేసిన ఈ విమర్శలు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, నటి కంగనా రనౌత్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి.

ఐశ్వర్యను ట్రోల్ చేస్తున్న వారికి కంగనా రనౌత్ తన ఇన్‌స్టా లో గట్టి క్లాస్ తీస్కున్నారు. కాన్స్ రెడ్ కార్పెట్‌పై బ్లూ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతున్న ఐశ్వర్య ఫోటోను షేర్ చేస్తూ కంగనా ఒక ఘాటు నోట్ రాశారు. ``ఫ్యాషన్- స్టైల్ అనేవి ఎవ‌రికి వారు వ్య‌క్త‌ప‌రిచేవి. అది జీవితంపై ఒకరి దృక్పథాన్ని.. వారి వైఖరిని ప్రతిబింబిస్తుంది. ఏ మహిళ కూడా ఎవరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఐశ్వర్య అద్భుతంగా ఉంది! ఆమెను వేరే విధంగా చూడాలనుకునే వారు.. మొదట మీరేంటో చూపించండి. ఆమె ఇక్కడ ఎవరినో సంతోష పెట్టడానికి లేదు... ఆమె ఎప్పటికీ గ్లోరియస్. ఒకవేళ మీకు రెడ్ కార్పెట్‌పై వయసుపైబడిన మహిళలను చూడటం అలవాటు లేకపోతే.. ఇప్పటికైనా ఆ అలవాటు చేసుకోండి. థాంక్స్! అంటూ ట్రోలర్ల నోళ్లు మూయించారు.

ఈ ఏడాది కాన్స్ వేదికపై ఐశ్వర్యా రాయ్ సరికొత్త ప్రయోగాలతో అలరించారు. మొదటి రోజు ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన `లుమినారా` అనే ప్రత్యేకమైన బ్లూ కౌచ‌ర్ దుస్తులలో మెరిశారు. అంతరిక్షంలో కాంతి ప్రయాణించే శైలిని ప్రతిబింబిస్తూ వింగ్స్ డిజైన్ తో రూపొందించిన ఈ ఆర్కిటెక్చరల్ డ్రెస్ కాన్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ తర్వాత లోరియల్ పారిస్ నిర్వహించిన ఒక ప్రత్యేక గాలా ఈవెంట్ కోసం సోఫీ కౌచ‌ర్ డిజైన్ చేసిన రొమాంటిక్ పింక్ సిల్క్ గౌన్ తో షిఫాన్ కేప్‌లో ఐశ్వర్య ఒక యువరాణిలా వెలిగిపోయారు.

ఐశ్వర్య తన మూడవ అప్పియరెన్స్‌గా క్లాసిక్ హాలీవుడ్ ఎలిగాన్స్ - మోడ్ర‌న్ స్టైల్ కలబోసిన ఒక బోల్డ్ వైట్ ప్యాంట్ సూట్ లో క‌నిపించారు. నిజానికి ఈ కాన్స్ వేడుకల్లో లోరియల్ బ్రాండ్ కేవలం కొత్త అంబాసిడర్ అలియా భట్ ప్రమోషన్లకే ప్రాధాన్యత ఇస్తోందని, సీనియర్ అయిన ఐశ్వర్యను పక్కన పెట్టిందంటూ అంతకుముందు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. దీనిపై స్పందించిన సదరు కాస్మెటిక్ బ్రాండ్.. అలియా ప్రారంభ వేడుకలలో భాగమవగా... ఐశ్వర్య ముగింపు వేడుకలలో అంబాసిడర్‌గా సందడి చేయబోతున్నారని స్పష్టతనిచ్చింది.

గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ల వయసు, శారీర ఆకృతి మార్పులపై నిరంతరం జరిగే బాడీ షేమింగ్, ఏజ్ షేమింగ్ ధోరణిని కంగనా ప్రశ్నించిన తీరు ఇండస్ట్రీలో ప్రశంసలందుకుంటోంది. ఐశ్వర్య వంటి గ్లోబల్ స్టార్స్ తమ వయసును హుందాతనాన్ని అంతర్జాతీయ వేదికలపై గర్వంగా ప్రదర్శిస్తున్నప్పుడు దానిని అభినందించాల్సింది పోయి కేవలం కించ‌ప‌ర‌చడం ఎంతవరకు సమంజసమనే చర్చ మళ్లీ మొదలైంది.