Begin typing your search above and press return to search.

మోడ్ర‌న్ డేటింగ్ సంస్కృతిపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు!

ప్రస్తుత కాలంలో డేటింగ్ యాప్స్ ప్రభావం పెరగడంతో సంబంధాలు చాలా త్వరగా ఏర్పడటం ..అంతే త్వరగా విడిపోవడం సర్వసాధారణమైపోయింది.

By:  Srikanth Kontham   |   19 Aug 2026 10:48 PM IST
మోడ్ర‌న్  డేటింగ్ సంస్కృతిపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు!
X

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ముక్కుసూటి త‌త్వం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. భిన్నమైన .. స్పష్టమైన అభిప్రాయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆధునిక డేటింగ్ సంస్కృతి పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. నేటి యువత డేటింగ్ సంబంధాలను సూచించడానికి ఉపయోగిస్తున్న బాడీ కౌంట్స్ ,ఘోస్టింగ్, బెంచింగ్ వంటి పదాలను.. వాటి వెనుక ఉన్న పాశ్చాత్య సంస్కృతిని కంగనా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి ధోరణులు మానవ సంబంధాల విలువను తగ్గిస్తాయని కంగ‌న‌ హెచ్చరించారు.

ప్రస్తుత కాలంలో డేటింగ్ యాప్స్ ప్రభావం పెరగడంతో సంబంధాలు చాలా త్వరగా ఏర్పడటం ..అంతే త్వరగా విడిపోవడం సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలో భాగస్వామిని ఒక సంఖ్యగా చూడటం లేదా సంబంధాన్ని మధ్యలోనే వదిలేసి కనిపించకుండా వెళ్లి పోవడం వంటి చర్యలను కంగనా తప్పుబట్టారు. `మనుషుల మధ్య ఉండే అనుబంధాలు అంత పవిత్రంగా ఉండాలి. కానీ నేడు వాటిని అంకెలతో కొలవడం చాలా బాధాకరం` అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి చేసుకున్న ఈ సంస్కృతి మన భారతీయ కుటుంబ విలువలపై చెడు ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఘోస్టింగ్ అంటే ఎదుటి వ్యక్తికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా సంబంధం నుంచి తప్పుకోవడం. ఇది అవతలి వ్యక్తి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారిలో ఆత్మన్యూనతను కలిగిస్తుందని కంగనా అభిప్రాయపడ్డారు. అలాగే బాడీ కౌంట్స్ వంటి పదాలను ఉపయోగించడం ద్వారా భాగస్వామిని ఒక వస్తువుగా చూస్తున్నామని.. ఇది నైతిక విలువల పతనానికి సంకేతమని కంగ‌న పేర్కొన్నారు. భావోద్వేగాల కంటే శారీరక ఆకర్షణకు ... తాత్కాలిక సంతోషాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దీర్ఘకాలిక సంబంధాలు కనుమ రుగవుతున్నాయని అభిప్రాయ‌ప‌డ్డారు.

కంగనా రనౌత్ వ్యాఖ్యలను చాలామంది నెటిజన్లు సమర్థించగా, మరికొందరు ఇది వ్యక్తిగత స్వేచ్ఛ అని వాదిస్తున్నారు. ఆధునికత పేరుతో మన సంస్కృతిని, సంబంధాలను వక్రీకరించడం ఎంతవరకు సబబని కంగనా ప్రశ్నించారు. మన సమాజం .. సంప్రదాయాలు అనాదిగా సంబంధాల పట్ల ఒక గౌరవాన్ని, బాధ్యతను నేర్పించాయని వాటిని మర్చిపోయి పాశ్చాత్య పోకడలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఒంటరితనం పెరుగుతుందని కంగ‌న హెచ్చరించారు.

వాస్త‌వానికి సోషల్ మీడియా - డిజిటల్ యుగంలో మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కంగనా చేసిన వ్యాఖ్యలు నేటితరం యువతను సంబంధాల పట్ల మరోసారి ఆలోచించేలా చేశాయి. ఏదైనా సంబంధం విషయంలో స్పష్టత కలిగి ఉండటం ..అవతలి వ్యక్తి భావాలకు గౌరవం ఇవ్వడం ఎంత ముఖ్యమో? కంగ‌న‌ గుర్తుచేశారు. గ్లామర్ ప్రపంచంలో కూడా సాంప్రదాయ విలువల పట్ల కంగనా చూపిస్తున్న స్పష్టత పట్ల అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కంగనా రనౌత్ లేవనెత్తిన ఈ అంశం డేటింగ్ సంస్కృతిపై లోతైన చర్చకు దారితీస్తోందిప్పుడు. మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ పెరుగుతున్నా? మనుషుల మధ్య ఉండాల్సిన నిజమైన ప్రేమ, విశ్వాసం , గౌరవం ఎప్పటికీ మారకూడదని కంగ‌న వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా సందేశం ఇచ్చారు. భ‌విష్య‌త్ లో సమాజం ఇలాంటి ఆధునిక పోకడలను ఏ విధంగా స్వీకరిస్తుందో ? లేదా? ఏ విధంగా నియంత్రించుకుంటుందో? చూడాలి.