Begin typing your search above and press return to search.

పిల్లల రక్షణపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు!

జంతర్ మంతర్ వేదికగా జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కొందరు అభ్యంతరకర పదజాలం వాడటం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

By:  Srikanth Kontham   |   1 Aug 2026 7:37 PM IST
పిల్లల రక్షణపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు!
X

జంతర్ మంతర్ వేదికగా జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కొందరు అభ్యంతరకర పదజాలం వాడటం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి వైరల్‌గా మారిన వీడియోలో తాను కేవలం 15 ఏళ్ల బాలికనని.. నిరసన సమయంలో కొందరి ప్రభావం వల్ల ప్రధానిపై తప్పుగా మాట్లాడానని పేర్కొంటూ క్షమాపణలు చెప్పింది. ఈ వ్యవహారంపై రాజకీయ..సినీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రాగా నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు.

ఈ ఉదంతంపై సోషల్ మీడియా వేదికగా కంగ‌న స్పందించారు. సమాజం , తల్లిదండ్రులు త‌మ పిల్లల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీనేజ్ వయస్సులో ఉన్న యువత ఇలాంటి రాజకీయ ..వివాదాస్పద అంశాల వలలో సులభంగా చిక్కుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 15 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలు ఇతరుల ప్రభావంతో ఇలాంటి తప్పులు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. సమాజం ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా యువతను తప్పుదోవ పట్టిస్తోన్న‌ కొన్ని శక్తుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కంగనా హితవు పలకడం చర్చనీయాంశమైంది. చిన్న వయస్సులోనే పిల్లలను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, వారిని చెడు ప్రభావాల నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నొక్కి చెప్పారు. ముఖ్యంగా యువత భవిష్యత్తును పాడుచేసే వారి పట్ల సమాజం అప్రమత్తంగా లేకపోతే అది భవిష్యత్తులో పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని హెచ్చరించారు.

ఈ వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించిన సంగ‌తి తెలిసిందే. సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. నిరసనల సమయంలో అభ్యంతరకర నినాదాలు చేసినవారు .. తప్పు చేసిన పిల్లలు కేవలం అపరిపక్వత వలనే అలా ప్రవర్తించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం .. కోర్టుల చుట్టూ తిప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. వారిని సరైన మార్గంలో నడిపించడమే అందరి బాధ్యత అని మోదీ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

ఈ ఘటనతో రాజకీయ వర్గాలలో .. సామాజిక మాధ్యమాలలో వాడీవేడీ చర్చలు కొనసాగుతున్నాయి. నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన ఆందోళనలు కాస్తా ఇలా వివాదాస్పద దిశకు మళ్లడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనల పేరుతో జరుగుతున్న దుష్ప్రచారాలు ..విద్యార్థులను పావులుగా వాడుకుంటున్న తీరుపై మేధావుల నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చివ‌రిగా 15 ఏళ్ల బాలిక క్షమాపణ వీడియో ..ప్రధాని మోదీ హుందాగా స్పందించిన తీరు..కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు పిల్లల పెంపకం , భద్రతపై సమాజంలో మరోసారి ఆలోచన రేకెత్తిస్తున్నాయి. భావోద్వేగాలతో నిండిన ఈ వివాదం రాజకీయ వాతావరణంలో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.