Begin typing your search above and press return to search.

నాలుక‌కు తోచిందల్లా మాట్లాడితే.. ప‌ర్య‌వ‌సానం ఎదుర్కొంటున్న‌ క్వీన్!

నీట్ (NEET) అక్రమాలకు నిరసనగా `కాక్రోచ్ జనతా పార్టీ` (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల నిరసనలపై బిజెపి ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ కలకలాన్ని రేపుతున్నాయి.

By:  Sivaji Kontham   |   28 July 2026 10:00 PM IST
నాలుక‌కు తోచిందల్లా మాట్లాడితే.. ప‌ర్య‌వ‌సానం ఎదుర్కొంటున్న‌ క్వీన్!
X

నీట్ (NEET) అక్రమాలకు నిరసనగా `కాక్రోచ్ జనతా పార్టీ` (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల నిరసనలపై బిజెపి ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ కలకలాన్ని రేపుతున్నాయి. ఆందోళనల్లో పాల్గొన్న యువతను.. ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి కంగ‌న‌ చేసిన `చెత్త జనరేషన్` వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ప్రతిపక్ష నాయకులతో పాటు రాజకీయ ప్రముఖురాలు రేణుకా సింగ్ కూడా కంగనా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ... ప్రజాస్వామ్య నిరసనల్లో పాల్గొంటున్న మహిళలను అవమానించడాన్ని ఖండించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

ఆందోళనలకు నాయకత్వం వహించిన సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్.. కంగనా చేసిన విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు. విద్యార్థుల నిరసనలు, వైరల్ వీడియోలు అసభ్యకరంగా ఉన్నాయంటూ కంగనా చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా కొట్టిపారేశారు. బిజెపి సొంత పార్టీ నాయకులే కంగనా వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోరని.. అలాంటిది దేశానికి వెన్నుముకలాంటి `జెన్ జెడ్` యువత లేదా `జెన్ ఆల్ఫా` ఆమె మాటలను అసలు ఎందుకు సీరియస్‌గా తీసుకుంటుందని ప్రశ్నించారు.

కంగనా రాజకీయ నిబద్ధత, విశ్వసనీయతను ప్రశ్నిస్తూ సౌరవ్ దాస్ గతంలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలను గుర్తుచేశారు. హిమాచల్ ప్రదేశ్ నుండి ఎంపీగా గెలిచిన కొత్తలో ``ఎంపీగా పెద్దగా పని ఉండదు అనుకున్నాను`` అని కంగనా బహిరంగంగా చెప్పిన వీడియోలను ప్రస్తావిస్తూ.. ప్రజాప్రతినిధిగా ఈ న‌టి అవగాహన ఎంత ఉందో ఆ వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని వీధి నిరసనలతో ఒత్తిడి చేయలేరని కంగనా అనడంపై స్పందిస్తూ... రాజకీయ నాయకుల కంటే `జెన్ జెడ్` యువతే ఈ దేశానికి ఎక్కువ మేలు చేస్తోందని వ్యాఖ్యానించారు.

నీట్ అక్రమాలపై విద్యార్థులు చేసిన పోరాటాన్ని.. సోషల్ మీడియా రీల్స్‌ను `వాంతి వచ్చేలా ఉన్నాయి` అని, ఆందోళనకారులు `బొద్దింకల లాగా ప్రవర్తిస్తున్నారు` అని కంగనా తీవ్ర పదజాలంతో దూషించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్, ఏఐఎంఐఎం సహా పలు పార్టీల నేతలు త‌న వ్యాఖ్య‌ల‌ను తప్పుపట్టారు. శాంతియుతంగా, సృజనాత్మకంగా నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉందని, ఆవేదనతో ఉన్న యువతకు సమాధానం చెప్పాల్సింది పోయి వారి క్యారెక్టర్, పెంచిన విధానాన్ని తప్పుబట్టడం ఏమాత్రం తగదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

మొత్తానికి విద్యార్థుల ఆందోళనల వెనుక ఉన్న అసలు సమస్యలైన పేపర్ లీకేజీలు, భవిష్యత్తు అంధకారం కావడం వంటి అంశాల నుండి దృష్టి మళ్లించేలా కంగనా వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ఒక్క రాజకీయ విభేదాన్ని మాత్రమే కాకుండా.. యువతను, మహిళల పాత్రను దిగజార్చేలా ఎంపీ స్థాయి వ్యక్తి మాట్లాడటం సముచితం కాదని...ఆమె తక్షణమే జెన్ జెడ్ యువతకు, మహిళలకు క్షమాపణ చెప్పాలని సిజెపి నాయకులు , ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.