పెళ్లిళ్లలో డ్యాన్సులు చేయనని చెప్పిన కంగన ఇలా చేసిందేమిటి?
అయితే తన మాటకు కట్టుబడి ఏనాడూ ధనవంతుల ఇళ్లలోని పెళ్లిళ్లు, పార్టీలలో డ్యాన్సులు చేయడానికి కంగన అనుమతించలేదు.
By: Sivaji Kontham | 8 Dec 2025 5:00 PM ISTప్రయివేట్ వ్యక్తుల పెళ్లిళ్లలో డ్యాన్సులు చేయనని, డబ్బు కోసం కక్కుర్తి పడే కొందరు స్టార్లు అలా చేస్తారని చాలాసార్లు విమర్శించారు కంగన రనౌత్. షారూఖ్, అక్షయ్ కుమార్, హృతిక్, దీపిక, ఆలియా లాంటి స్టార్లు ప్రయివేట్ పార్టీలలో, పెళ్లిళ్లలో డ్యాన్సులు చేయడంపై పరోక్షంగా సెటైర్లు కూడా వేసింది క్వీన్.
అయితే తన మాటకు కట్టుబడి ఏనాడూ ధనవంతుల ఇళ్లలోని పెళ్లిళ్లు, పార్టీలలో డ్యాన్సులు చేయడానికి కంగన అనుమతించలేదు. డబ్బు ఆశ చూపినా కానీ దానికి తలొంచలేదు. ఏనాడూ పారిశ్రామిక వేత్తలు లేదా రాజకీయ నాయకుల పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయలేదు. అయినా ఇప్పుడు తన సొంత రూల్ ని అతిక్రమించి ఒక ప్రయివేట్ పెళ్లిలో డ్యాన్సులు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయంగాను ఇది దుమారం రేపుతోంది. కంగన ప్రత్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సోషల్ మీడియాల్లో విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ కుమార్తె వివాహంలో కంగనా రనౌత్ డ్యాన్సులు చేసారు. కంగనతో పాటు మహువా మొయిత్రా, సుప్రియా సులే వంటి ప్రముఖులు నృత్యం చేశారు. ఆసక్తికరంగా ప్రత్యర్థులు అయినప్పటికీ రాజకీయ విభేదాలను మరచిపోయి, పారిశ్రామికవేత్త-రాజకీయ నాయకుడు నవీన్ జిందాల్ కుమార్తె యశస్విని జిందాల్ వివాహ వేడుకల్లో బిజెపి ఎంపి కంగనా రనౌత్ కనిపించడం నిజంగా ఆశ్చర్యపరిచింది. సంగీత్ నైట్ వీడియోలలో కంగన డ్యాన్సులు చేస్తూ కనిపించారు. 2007 బ్లాక్ బస్టర్ `ఓం శాంతి ఓం` నుండి `దీవాంగి దీవాంగి` పాటకు కంగన సహా సహచరులు డ్యాన్సులు చేస్తూ కనిపించారు. నవీన్ జిందాల్ వేదికపై ఉన్న వారితో కలిసి డ్యాన్సులు చేస్తున్న వీడియో కూడా వైరల్ గా మారింది. అయితే పెళ్లిలో డ్యాన్సులు చేయడానికి వ్యతిరేకం అంటూ కంగన ఇలా చేయడంపై విమర్శకులు చెలరేగుతున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, క్వీన్ కంగన స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఎమర్జెన్సీ బాక్సాఫీస్ వద్ద ఫెయిలవ్వడం ఆర్థికంగా నష్టాలను మూటగట్టిందని కథనాలొచ్చాయి. కంగన స్వయంగా ఇందిరాగాంధీ పాత్రలో నటించినా బాక్సాఫీస్ ఫలితాన్ని మార్చలేకపోయింది. ఈ సినిమాని పూర్తి చేసేందుకు తన ఆస్తులను కూడా తనఖా పెట్టినట్టు కంగన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ తర్వాత ముంబైలోని తన సొంత ఆస్తిని అమ్మేసి అప్పులు తీర్చాల్సి వచ్చింది. ఎమర్జెన్సీని పూర్తి చేసి రిలీజ్ చేయడానికి కంగన రాజకీయంగాను తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతకుముందు కూడా కంగన నటించిన భారీ యాక్షన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. ప్రస్తుతం క్వీన్ సినీకెరీర్ కంటే రాజకీయాలపై ఫోకస్ చేస్తూ సమయాన్ని గడిపేస్తుండడం ఆశ్చర్యపరుస్తోంది.
