నసీరుద్దీన్ షాని నక్కతో పోల్చిన కంగన!
బాలీవుడ్ నటి - ఎంపీ కంగనా రనౌత్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షాను 'లోమ్డి' (నక్క) అని సంబోధించడం చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమైంది.
By: Srikanth Kontham | 13 Aug 2026 12:51 PM ISTబాలీవుడ్ నటి - ఎంపీ కంగనా రనౌత్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షాను 'లోమ్డి' (నక్క) అని సంబోధించడం చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమైంది. విద్యార్థుల నిరసనలపై నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా కంగన ఈ పదాన్ని ఉపయోగించారు. తాజాగా ఈ వివాదంపై స్పందించిన కంగనా తన వ్యాఖ్యలను సమర్థించుకోవడమే కాకుండా నసీరుద్దీన్ షా పాకిస్తాన్ పట్ల చూపే ప్రేమను తీవ్రంగా విమర్శించారు.
ఈ వివాదానికి ప్రధాన కారణం జార్ఖండ్‌లో జరుగుతున్న విద్యార్థుల నిరసనలు. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలపై కన్నీరు మున్నీరు అయ్యారని.. కానీ ఇప్పుడు జార్ఖండ్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మౌనంగా ఉన్నారని కంగనా ఆరోపించారు.
ఈ ద్వంద్వ ప్రమాణాలనే తాను హిపోక్రసీ అని విమర్శించానని పేర్కొన్నారు. నిరసనలు దేశ వ్యతిరేకంగా ఉన్న ప్పుడే మద్దతు ఇస్తారా? అని ప్రశ్నించారు. నసీరుద్దీన్ షాను నక్క అని ఎందుకు అన్నానో? వివరణ ఇస్తూ ఆయన చిత్రాలు, ఇంటర్వ్యూలు , ప్రసంగాల్లో తరచుగా పాకిస్తాన్ గురించి ప్రస్తావించడంపై కంగనా అసహనం వ్యక్తం చేశారు. దేశ విభజన జరిగి ఇన్నేళ్లు గడిచినా? ఆయనకు ఆ దేశంపై ఎందుకంత ప్రేమ? అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. `ఆయనకు పాకిస్తాన్ అంటే ఎందుకంత ప్రేమ? ఈ ప్రేమ కథ ఎప్పుడు ముగుస్తుంది?` అని ప్రశ్నించారు.
గతంలో కూడా కంగనా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా నసీరుద్దీన్ షాను ఉద్దేశించి సంచలన పోస్టులు పెట్టారు. దేశంలో తింటూ పక్క దేశానికి మద్దతు ఇవ్వడం సరైనది కాదని.. తను ఈ దేశాన్ని రక్షించే కుక్కగా ఉండటానికే గర్విస్తానని నక్కలా ఉండటం కంటే కుక్కగా ఉండటమే మేలని అభిప్రాయపడ్డారు. ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో రాజకీయ వేడిని మరింత పెంచాయి. విద్యార్థుల నిరసనల పేరుతో కొందరు వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కంనగ ఆరోపిస్తున్నారు. రాజకీయంగా తనకున్న నిబద్ధతతో, దేశ ప్రయోజనాలకే తాను పెద్దపీట వేస్తానని స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలోని పలువురు వ్యక్తులు ఎంచుకున్న ఎజెండాకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
కంగనా రనౌత్ , నసీరుద్దీన్ షా వంటి అగ్ర నటుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం బాలీవుడ్‌లో పెరుగుతున్న రాజకీయ విభజనలను ప్రతిబింబిస్తోంది. కళాకారులు సామాజిక అంశాలపై స్పందించే విధానంలో వస్తున్న మార్పులు , వాటి పట్ల సెలబ్రిటీల స్పందనలు భవిష్యత్తులో మరిన్ని చర్చలకు దారితీసే అవకాశం ఉంది.
